నాని హీరోగా నటించిన టక్ జగదీశ్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. మిక్స్ డ్ రెస్పాన్స్ తో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాపై వస్తున్న రివ్యూల సంగతి పక్కనపెడితే.. సినిమాలోని ఓ అంశంపై మాత్రం సోషల్ మీడియాలో సరదా ట్రోలింగ్ నడుస్తోంది.
టక్ జగదీశ్ లో నాజర్ కు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరి భార్యల పిల్లలే నాని, జగపతిబాబు, రోహిణి, దేవదర్శిని. వీళ్లు కాకుండా ఓ మేనకోడలు (ఐశ్యర్య రాజేష్) పాత్రను కూడా పెట్టారు. ఇక రోహిణి, దేవదర్శినికి భర్తలు, పిల్లల్ని కూడా యాడ్ చేశారు. ఓ పెద్ద కుటుంబంలో ఇంతమందిని పెట్టిన దర్శకుడు శివ నిర్వాణ, వాళ్ల మధ్య వరసల్ని మాత్రం సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. సరిగ్గా ఇక్కడే టక్ జగదీశ్ పై ట్రోలింగ్ మొదలైంది.
సినిమాలో ఏ తల్లి పిల్లలు ఎవరో ఠక్కున చెప్పగలరా అంటూ క్విజ్ కార్యక్రమాలు పెడుతున్నారు నెటిజన్లు. భారతంలో కూడా ఇంత కన్ఫ్యూజింగ్ రిలేషన్ షిప్స్ లేవని కొందరు జోకులేస్తుంటే.. చంద్రమ్మ (ఐశ్వర్య రాజేష్) తల్లి నాజర్ పెద్ద కొడుకు భార్యకు ఏమౌతుందో చెప్పగలరా అంటూ మరికొందరు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు.
సినిమాలో నాని మాస్ ఎలివేషన్స్ పై పెట్టిన దృష్టి కుటుంబంలో ఏ తల్లి పిల్లలు ఎవరనే అంశంపై పెట్టి ఉంటే బాగుండేదని కొందరు దర్శకుడికి సలహాలు ఇస్తున్నారు. పెద్ద కుటుంబాన్ని చూపించే క్రమంలో శివ నిర్వాణ ఇలా చాలా మందిని సెట్ చేశాడు. అందులో తప్పులేదు. కానీ ఎవరు ఎవరికి ఏమౌతారు.. ఏ తల్లి బిడ్డలు ఎవరు అనే విషయంపై ఆయన ఇంకాస్త క్లారిటీ ఇస్తే బాగుండేది. సినిమా చూసిన చాలామంది ఈ విషయంలో అయోమయానికి గురవుతున్నారు.