బీజేపీ మీద మండిపడ్డ వైసీపీ మంత్రి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక పాలసీ పెట్టుకుంది. అదేంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి పారేయడం. ఈ విషయంలో ఎలాంటి రాజీలూ రాయబారాలూ అసలు లేవని తేల్చిచెబుతోంది. ఈ నేపధ్యంలో విశాఖ…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక పాలసీ పెట్టుకుంది. అదేంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి పారేయడం. ఈ విషయంలో ఎలాంటి రాజీలూ రాయబారాలూ అసలు లేవని తేల్చిచెబుతోంది. ఈ నేపధ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీదనే మోడీ సర్కార్ పెద్దలు తొలి అడుగు మోపేశారు.

దాంతో ఆంధ్రుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం చిక్కుల్లో పడింది. గత ఏడు నెలలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్ల మీదనే ఉంటూ ప్రైవేటు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మహా పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన కేంద్ర సర్కార్ విధానాల‌ మీద కాస్తా గట్టిగానే ద్వజమెత్తారు. కేంద్ర పెద్దల వైఖరిని కూడా ఘాటుగానే మాట్లాడుతూ ఎండగట్టేశారు. కేంద్రానికి అతి ముఖ్యమైన విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పట్టకపోవడం దారుణమని మంత్రి అన్నారు. కార్మికులు నెలల తరబడి వీధులలోకి వచ్చి నిరసన తెలియచేస్తున్నా చోద్యం చూడడమేంటి అని కూడా ఆయన నిలదీశారు.

ఆరు నూరు అయినా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాల్సిందే. ఈ విషయంలో రెండవ మాట లేదు అని అని వైసీపీ మంత్రి క్లారిటీ ఇచ్చేశారు. తమ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకమని కూడా ఆయన పేర్కొనారు. 

స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తామని కూడా చెప్పేశారు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని దోషిగా పెట్టి హాట్ కామెంట్స్ చేయడం ద్వారా వైసీపీ విశాఖ  స్టీల్  ప్రైవేటీకరణపైన‌ సరికొత్త సమరాన్నే సాగిస్తోంది అని చెప్పాలి.