తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ముదిరి పాకాన పడింది. ప్రభుత్వం మాట లెక్కచేయని ఉద్యోగులు సమ్మెను ఉధృతం చేశాపు. సమ్మెలోకి వెళ్తే ఉద్యోగాలుండవని కేసీఆర్ హెచ్చరించారు. కానీ ముఖ్యమంత్రి మాటను ఎవ్వరూ ఖాతరుచేయలేదు. కేసీఆర్ ఇజ్జత్ కా సవాల్ అంటుంటే.. ఆ ఇజ్జత్ తీసిపారేసేలా ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు.
50 వేల మంది ఉద్యోగుల్లో కేసీఆర్ మాటలకు బెదిరిపోయింది కేవలం 165 మంది మాత్రమేనంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళ్లు కూడా అధికారుల కారు డ్రైవర్లు, చిరుద్యోగులు మాత్రమే. వీళ్లలో కండక్టర్లు, డ్రైవర్లు ఎవరూ లేరు. మామూలు రోజుల్లో ఈ సమ్మెలను పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ, దసరా సీజన్ ని దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కేసీఆర్ ని భలే దెబ్బకొట్టారు.
ఇటు వారిని బుజ్జగించలేక, అటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక అధికారులు చేతులెత్తేశారు. ప్రైవేట్ బస్సులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవీ ఫలించలేదు. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కేసీఆర్ కూడా ఊహించలేదు. తాను ఢిల్లీ పర్యటన ముగించుకునే సరికి ఇటు రాష్ట్రంలో ఉద్యోగులు తనకు వ్యతిరేకంగా తల ఎగరేశారు.
ఉద్యమ సమయంలో తనకు అండగా నిలబడిన ఉద్యోగులు, ఇప్పుడిలా రివర్స్ కావడంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు కేసీఆర్ నోటివెంట కఠిన నిర్ణయం వెలువడే అవకాశముందని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ కీలక నేతలు మాత్రం కేసీఆర్ ని బుజ్జగించడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఉద్యోగులను మరీ రెచ్చగొట్టడం సరికాదని, రాష్ట్రంలో ఉపఎన్నిక వేళ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని సీఎంకు వారు నచ్చజెబుతున్నారు. అయితే కేసీఆర్ మాట వినేరకం కాదు, ఉద్యోగులతో తాడోపేడో తేల్చుకుంటారని తెలుస్తోంది. ఏదేమైనా కేసీఆర్ ఈరోజు తీసుకునే నిర్ణయం ఉద్యోగుల కుటుంబాలనే కాదు, హుజూర్ నగర్ ఉప ఎన్నికలను కూడా ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.