నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు… ఏపీ వంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే అరెస్టు కావడం అంటే మాటలు కాదు. అధికార పార్టీలో ఉంటే.. ఎన్ని అరచకాలు అయినా చేయవచ్చు అనే భావన కలిగిన రాష్ట్రం ఇది. అందుకు నిదర్శనం గత ఐదేళ్ల పాలన. గత ఐదేళ్లలో జన్మభూమి కమిటీలు అనే చెంచాగిరి పనులు చేసిన వారు చేసిన అరచకాలే అన్నీ ఇన్నీ కావు!
ఒక మండల తహశీల్దార్ పై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తే.. ఏం జరిగిందో అంతా చూశారు. ఆ ఎమ్మెల్యేను హెచ్చరించడం మాట అటుంచి, చంద్రబాబు నాయుడు ఆ తహశీల్దార్ పై విరుచుకుపడ్డారు. ఆమెను పిలిపించుకుని పంచాయితీ చేశారు. అప్పటికే రౌడీయిజంలో పండిపోయిన తన పార్టీ ఎమ్మెల్యే తహశీల్దార్ పై దాడి చేస్తే ఆ ఎమ్మెల్యే తీరును సమర్థించారు చంద్రబాబు.
విశేషం ఏమిటంటే.. ఇప్పుడు కూడా అలాంటి పనులను చంద్రబాబు నాయుడు సమర్థిస్తూనే ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ కు మద్దతుగా రేపోమాపో దెందులూరు వెళ్లనున్నారట చంద్రబాబు నాయుడు. ఆయన ఇంకా అలాగే కొట్టుమిట్టాడుతూ ఉంటే.. తన పార్టీ ఎమ్మెల్యేను జైలుకు పంపించారు జగన్ మోహన్ రెడ్డి.
ఎంపీడీవో ఫిర్యాదు నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటంరెడ్డి అనుచరులు తన ఇంటి మీద దాడి చేశారని ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చట్టం తన పని తాను చేసింది. ఎమ్మెల్యేను అరెస్టు చేసింది. అధికార పార్టీ వ్యక్తిని జైలు పంపింది.
ఇదే సీన్లో చంద్రబాబు నాయుడు ఉంటే, తన పార్టీ ఎమ్మెల్యేదాష్టీకం చేస్తే.. రాజీ చర్చలు చేశారు. జగన్ మాత్రం తన పార్టీ ఎమ్మెల్యేనే చూడక జైలుకు పంపారు. ఇదే కదా.. ఇద్దరి మధ్యన తేడా. వ్యవస్థపై నమ్మకం పెంచుతున్న జగన్ మోహన్ రెడ్డి నిజంగా అభినందనీయులే!