ఏరుదాటి తెప్పతగలేస్తున్న కేసీఆర్

కుక్కతోకని ఊపుతుందా, లేక తోకే కుక్కని ఊపుతుందా.. తెలియని పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి కేసీఆర్ అన్న మాటలివి. దీనికి కొనసాగింపుగా చాలానే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఉద్యోగులు రాజకీయ…

కుక్కతోకని ఊపుతుందా, లేక తోకే కుక్కని ఊపుతుందా.. తెలియని పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి కేసీఆర్ అన్న మాటలివి. దీనికి కొనసాగింపుగా చాలానే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఉద్యోగులు రాజకీయ కారణాలతో ఆందోళనలు చేస్తే సహించను, అలాంటి వాటిని మా ప్రభుత్వం సమర్ధించదని హెచ్చరించారు. ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయలేరని, శాసన సభలోనే చట్టాలు తయారవుతాయని, వాటికి అనుగుణంగానే ఉద్యోగులు పనిచేయాలని తేల్చి చెప్పారు.

అంతా బాగానే ఉంది కానీ ఈమాట కేసీఆర్ నోటివెంట రాకూడదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఉద్యోగుల భాగస్వామ్యం ఎన్నదగినది. ముఖ్యంగా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఏర్పడిన తర్వాతే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఉద్యోగుల సహాయ నిరాకరణ వల్లే రాష్ట్రం స్తంభించి పోయి, కేంద్రం దిగొచ్చింది. ఈ విషయం కేసీఆర్ కి కూడా బాగా తెలుసు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల్ని నెత్తినపెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నేతలకే వర్తించింది.

కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే నేతలు, ఉద్యోగుల ఉద్యమాన్ని పణంగా పెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యారు, మంత్రులుగా కూడా కొనసాగుతున్నారు. మరి పోరాటాల్లో లాఠీ దెబ్బలు తిన్న ఉద్యోగుల మాటేంటి. వారికి న్యాయం జరిగిందా? ఇది భేతాళ ప్రశ్న? కొత్త రాష్ట్రం – త్యాగాల పేరుతో పోయినసారే ఉద్యోగుల చేతులు కట్టేశారు కేసీఆర్. మీడియాని భయపెట్టి ఒక్క గొంతు కూడా వినపడకుండా నొక్కిపెట్టారు. ఇక వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక మరింతగా జూలు విదిలిస్తున్నారు. ముఖ్యంగా కొత్త రెవెన్యూ చట్టం పేరుతో వీఆర్వోల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేయబోతున్నారు.

గతంలో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ దాన్ని పంచాయతీరాజ్ లో విలీనం చేసేందుకు సిద్ధమైనా ఉద్యోగులు వ్యతిరేకించడంతో సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడా విధానాన్ని తెరపైకి తెస్తున్నారు. నూతన రెవెన్యూ చట్టం పేరుతో వీఆర్వోల అధికారాలకు కత్తెర వేస్తున్నారు. దీన్ని ఆయా సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సహజంగానే కాంగ్రెస్, బీజేపీ ఉద్యోగులకు అండగా నిలిచాయి. దీంతో కేసీఆర్ కి మరింతగా కాలింది. ఏకంగా అసెంబ్లీలోనే ఉద్యోగులపై నిప్పులు చెరిగారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దైనప్పుడు ఏం జరిగిందో.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని, వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.

సరిగ్గా హుజూర్ నగర్ ఎన్నికలకు ముందు ఉద్యోగులతో సున్నం పెట్టుకుని కేసీఆర్ పార్టీని నెగ్గించుకోగలరా? కేసీఆర్ నియంతృత్వ పోకడలకు సమాధానం ఈ ఉపఎన్నికే అంటున్నాయి ప్రతిపక్షాలు. మొత్తమ్మీద ఉద్యోగులను అడ్డం పెట్టుకుని ప్రత్యేకరాష్ట్రం అనే ఏరు దాటిన కేసీఆర్ ఇప్పుడా తెప్పను పూర్తిగా తగలబెట్టే పనిలో ఉన్నారు.  

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ