-ఇండియాకు మరో భారీ సినిమాను సమర్పిస్తున్న టాలీవుడ్!
-మొన్న 'సాహో', ఇంతలోనే 'సైరా'
-ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఉయ్యాలవాడ బయోపిక్ హవా
-దేశభక్తి, జాతీయవాద సినిమాలకు అనుకూల ట్రెండ్
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచానికి ఇప్పుడు భారీ సినిమాలను అందిస్తూ ఉంది. బడ్జెట్‌లోని భారీ తనాన్ని స్క్రీన్ మీద చూపిస్తూ.. తెలుగు మూవీమేకర్లు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే భారీ సినిమాలను తెలుగుచిత్ర పరిశ్రమే నిర్మిస్తూ ఉందిప్పుడు. భారీ సినిమాలకు టాలీవుడ్ ఇలా కేరాఫ్‌గా మారింది. ఇటీవలే అలాంటి భారీ సినిమా 'సాహో'ను యావత్ భారతదేశం ఎంతో ఆసక్తితో చూసింది. ఆ సినిమా తెలుగుతో పాటు.. ఇతర భాషల్లో కూడా భారీఎత్తున విడుదల అయ్యింది. విశేషం ఏమిటంటే… ఆ సినిమాకు కలెక్షన్లు కూడా తెలుగు కన్నా హిందీలోనే ఎక్కువగా దక్కినట్టుగా ఉన్నాయి! అలా 'సాహో' వంటి భారీ సినిమా తర్వాత ఇప్పుడు 'సైరా' అంటూ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు సై అంటూ వస్తోంది మరో సినిమా.
భారీతనం విషయంలో కొత్త నిర్వచనాన్ని ఇస్తోంది 'సైరా నరసింహారెడ్డి'. ఈసారి బడ్జెట్‌లో భారీ తనమేకాదు.. కథలోనూ భారీతనం ఉంది. భారత స్వతంత్ర తొలి పోరాటకర్తగా చెప్పగల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వస్తోందని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే.. హింసాత్మక మార్గంలో బ్రిటీషు వారిపై తిరుగుబాటు రేపిన వీరుడు ఉయ్యాలవాడ. ఈ రేనాటి సూర్యుడి జీవిత కథను సినిమాగా తీయాలని చిరంజీవి చాలాకాలం కిందటే అనుకున్నారట. అయితే అది ఎట్టకేలకూ ఆయన రీఎంట్రీతో సాధ్యం అవుతూ ఉంది. 'బాహుబలి' తర్వాత పెరిగిన తెలుగు సినిమా ప్రమాణాలకు అనుగుణంగా ఈ సినిమా రూపొంది, అతి త్వరలోనే విడుదల కాబోతూ ఉంది.
చారిత్రక నేపథ్యమున్న చిత్రమే అయినా, వాస్తవ సంఘటనలు, పాత్రలకి కల్పన జోడించిన ప్రయత్నమే అయినా కానీ 'సైరా నరసింహారెడ్డి' ఫక్తు కమర్షియల్ మసాలాలతో తెరకెక్కింది. ఈ విషయాన్ని ట్రెయిలర్లోనే స్పష్టంచేసారు. నరసింహారెడ్డి కోసం వందలాది జనం ప్రాణత్యాగం చేయడం, శిస్తు ఎందుకు కట్టాలంటూ బ్రిటిష్వారిపై నరసింహారెడ్డి జూలు విదల్చడం, చివరికోరిక ఏమిటంటే నా మాతృభూమినుంచి బయటకు పొండి అనడం, ఉరికంబం ముందు కూడా దేశభక్తి చాటుకోవడం లాంటి లక్షణాలని చూపించి ఎమోషనల్గా సిద్ధంచేసారు.
అలాగే కీలకపాత్రలు అన్నిటికీ తగిన ప్రాధాన్యత వుంటుందంటూ, వివిధ భాషలకి చెందిన నటీనటులని ఒకచోటికి చేర్చి ఇండియా అంతా ఏకమై యుద్ధం చేసిందనే భావన తీసుకురావడం మంచి కమర్షియల్ టచ్. బాహుబలి మాదిరిగా అద్భుతమైన నిర్మాణ విలువలు, యుద్ధ సన్నివేశాలకి తోడు హత్తుకునే ఎమోషన్స్ వుండడంతో సైరా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం అవుతుందని అంచనా వేస్తున్నారు. టీజర్ రాకముందు వరకు ఈ చిత్రాన్ని నార్త్ మీడియా అస్సలు పట్టించుకోలేదు. ట్రెయిలర్ రిలీజ్ అయ్యేసరికి అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ కూడా దీని గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ట్రెయిలర్లో చిన్నపాటి ఇబ్బంది పెట్టిన అంశాలున్నప్పటికీ సైరా రైట్ ట్రాక్ మీద వుందనేది మాత్రం స్పష్టమయింది. ఈ అంచనాలకి తగ్గట్టు నరసింహారెడ్డి వీరగాధ నిజంగా గుండెలకి హత్తుకుని కంటతడి పెట్టిస్తే ఇక ఆకాశమే హద్దవుతుంది.
సైరా.. బిజినెస్ సై.. సైరా
మెగాస్టార్ మెగామూవీ సైరా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చిరంజీవి ఫుల్‌ఫామ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటి నుంచీ ఆయన ఆలోచనల్లో వున్న సినిమా ఇది. ఇన్నాళ్లకు సాధ్యమైంది. ఖైదీ నెం.150 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చేస్తున్న సినిమా. మెగాస్టార్ కెరీర్‌లోనే తొలిసారి వందల కోట్ల ఖర్చుతో తీసిన సినిమా. ఇలా అన్నివిధాలా సైరా సినిమా మీద అంచనాలు వున్నాయి. అవి నానాటికీ పెరుగుతున్నాయి. ఆ సినిమా మీద వున్న అంచనాలు, ఆ సినిమా కోసం పెట్టిన ఖర్చు, ఆ సినిమా వస్తున్న సీజన్, చాలా చాలా కారణాలతో సైరా బిజినెస్ అద్భుతంగా జరిగిపోయింది. బిజినెస్ రేంజ్ ఎంత అన్నది తరువాత సంగతి, దాదాపు 90శాతం అమ్మకాలే. పైగా అది కూడా నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్, ఆపై ఓవర్ ఫ్లోస్‌లో షేర్.
తెలుగునాట సైరా సినిమా 60 నుంచి 65 కోట్ల రేషియోలో విక్రయాలు జరిపారు. నెల్లూరు లాంటి చిన్న ఏరియాలు 60 కోట్ల రేషియోలో, వైజాగ్ లాంటి పెద్ద ఏరియాలు 65 కోట్ల రేషియోలో విక్రయించారు. ప్రతిచోటా, ఎన్‌ఆర్‌ఎకి తోడు, అయిదు నుంచి పదిశాతం రిటర్నబుల్ అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. ఆ విధంగా ఓవర్ ఫ్లోస్ మీద కాస్త ముందే జాగ్రత్త పడ్డారు. మొత్తంమీద కేవలం ఆంధ్ర ఏరియా నుంచి 65 కోట్లు రాబట్టారు. అలాగే సీడెడ్ నుంచి మరో 20కోట్లు రాబట్టారు. ఇక నైజాం నుంచి 30కోట్లు సంపాదించారు. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 115 వరకు వచ్చాయి.
ఇదికాక వరల్డ్ వైడ్ ఓవర్‌సీస్ 15 కోట్లు కర్ణాటక 27 కోట్లకు విక్రయించారు. తమిళనాడు 10 కోట్లకు, కేరళ 6 కోట్లకు పంపిణీకి ఇచ్చారు. బాలీవుడ్ పంపిణీకి ఇచ్చారు. అయితే ఎంత అడ్వాన్స్ తీసుకున్నదీ తెలియరాలేదు. సో, టోటల్‌గా థియేటర్ రైట్స్ ద్వారా 173కోట్లు ఇప్పటికే వచ్చాయి. బాలీవుడ్, అదర్ లాంగ్వేజెస్ అమౌంట్లు రావాలి. ఇధిలావుంటే నాన్ థియేటర్ హక్కులు కూడా తక్కువేమీ కాదు. కేవలం డిజిటల్ రైట్స్‌నే అన్ని లాంగ్వేజెస్ కలిపి వరల్డ్ వైడ్‌గా 50 కోట్లకు అమెజాన్ ప్రయిమ్‌కు విక్రయించారు.
ఇక శాటిలైట్ హక్కులు వుండనే వున్నాయి. శాటిలైట్ హక్కుల నుంచి 100 కోట్లు వరకు సైరా నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇదికనుక వర్కవుట్ అయితే, థియేటర్, నాన్ థియేటర్ రూపంలో మూడువందల కోట్లకు కాస్త అటు ఇటుగా వస్తాయి. మొత్తంమీద బిజినెస్ పరంగా సైరా మంచి వెంచర్ అనే అనుకోవాలి.