ఈ నెల 21వ తేదీన బక్రీద్ సందర్భంగా షాపింగ్ ల కోసమంటూ రిలాక్సేషన్ ను ప్రకటించి కేరళ ప్రభుత్వం ఆత్మహత్యాసదృశ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆదివారం నుంచినే పినరాయి విజయన్ ప్రభుత్వం రిలాక్సేషన్ ను అనౌన్స్ చేసింది.
ఆది, సోమ, మంగళ వారాలు అన్ని షాపులనూ తెరుచుకోవచ్చని ఎలాంటి.. ఆంక్షలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం బక్రీద్ జరపుకోనున్నారు ముస్లింలు. వారి కోసం ప్రభుత్వం ఆంక్షలన్నింటినీ ఎత్తి వేసింది. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఈ అంశంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని, ఆంక్షలను ఎత్తివేయవద్దని ఐఎంఏ కోరింది. లేదంటే ఈ అంశంపై తాము సుప్రీంను ఆశ్రయిస్తామని కూడా ప్రకటించింది. అయితే కేరళ ప్రభుత్వం ఈ అంశంపై కిక్కురుమనడం లేదు.
ఒకవైపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో కావడ్ యాత్ర వివాదాస్పదం అయ్యింది. సుప్రీం కోర్టు జోక్యంతో ఆ యాత్రకు యూపీ ప్రభుత్వం కూడా పర్మిషన్ ను రద్దు చేసుకున్నట్టుగా ఉంది. ఇంతలోనే కేరళ బక్రీద్ రిలాక్సేషన్ ఇవ్వడం ద్వారా దుమారం రేపింది.
ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం కూడా కేరళనే కావడం గమనార్హం. అక్కడ పాజిటివిటీ రేటు ఏకంగా 15 శాతం ఉందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గత ఇరవై నాలుగు గంటల్లోనే అక్కడ 13 వేలకు పైగా కేసులు వచ్చాయి. ఇక యాక్టివ్ కరోనా కేసుల సంఖ్యలో కూడా కేరళ టాప్ లో ఉంది. 1.25 లక్షలకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి కేరళలో. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బక్రీద్ కు అంటూ మినహాయింపులు ఇవ్వడం ఏమిటో కేరళ సర్కార్ కే తెలియాలి!
దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా పరిస్థితిని నియంత్రించడానికి అదనపు ఆంక్షలను పెట్టుకోవాల్సిన కేరళ ప్రభుత్వం, ఇప్పుడు పండగ సంబరాలు అంటూ.. పగ్గాలను వదలడం క్షమార్హమైన చర్యలా కనిపించడం లేదు. ఇప్పటికే పక్క రాష్ట్రాలు కేరళపై గుర్రుగా ఉన్నాయి.
కేరళ నుంచి వచ్చే వారిపై కన్నేసి ఉంచాలని ఇది వరకే కర్ణాటక ప్రకటించింది. ఇప్పుడు విజయన్ ప్రభుత్వ తీరు.. పని మీదో, మరో దాని కోసమే రాష్ట్రం దాటాలనే కేరళ ప్రజలపై ఇతర రాష్ట్రాలు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలను పెంచుతోంది.