తెలంగాణలో పాదయాత్రల సీజన్ మొదలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైమ్ ఉంది. సాధారణంగా ప్రతిపక్షాలేవీ ఇంత త్వరగా ఎన్నికలను టార్గెట్ చేయాలనుకోవు. వనరులు సమకూర్చుకోడానికి, అభ్యర్థుల్ని సిద్ధం చేసుకోడానికి ఏడాది టైమ్ సరిపోతుంది అనుకుంటాయి. కానీ తెలంగాణలో…

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైమ్ ఉంది. సాధారణంగా ప్రతిపక్షాలేవీ ఇంత త్వరగా ఎన్నికలను టార్గెట్ చేయాలనుకోవు. వనరులు సమకూర్చుకోడానికి, అభ్యర్థుల్ని సిద్ధం చేసుకోడానికి ఏడాది టైమ్ సరిపోతుంది అనుకుంటాయి. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి అలా లేదు. రెండున్నరేళ్ల ముందుగానే ప్రతిపక్షాలు రంకెలేస్తున్నాయి. పాదయాత్రలకు సిద్ధమయ్యాయి.

జగనే అందరికి ఆదర్శం..

ఎన్నికలకు రెండేళ్ల ముందుగా.. 2017 నవంబరులో అప్పటి ప్రతిపక్షనేత జగన్ ఏపీలో పాదయాత్ర మొదలు పెట్టారు. సరిగ్గా ఎన్నికలనాటికి నియోజకవర్గాలన్నీ చుట్టేసి, యాత్రలోనే అభ్యర్థుల్ని ఖరారు చేసుకున్నారు. వారిలో ధైర్యం నింపారు, జనంలో ఓ ఆశ కల్పించారు. 

చంద్రబాబు ఈ యాత్రను లైట్ తీసుకున్నారు. చివరి నిముషంలో పసుపు-కుంకుమ డబ్బులు, పింఛన్ పెంపు వంటి మాయలు పనిచేస్తాయనికుని బోల్తా పడ్డారు. జగన్ చేతిలో చిత్తయ్యారు. ఇప్పుడీ ఫార్ములానే తెలంగాణ ప్రతిపక్ష నేతలు ఫాలో అవ్వాలనుకుంటున్నారు.

బండి సంజయ్ పాదయాత్ర..

హుజూరాబాద్ ఉప ఎన్నికల లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆగస్ట్ 9న చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. అక్టోబర్ 2న హుజూరాబాద్ లో యాత్ర ముగుస్తుంది.

ఇది తొలి విడత యాత్ర మాత్రమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి మొత్తం 5 విడతల్లో రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చేలా రూట్ మ్యాప్ ఖరారు చేసుకుంటున్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ ని అడ్డుకునేందుకు, సొంత పార్టీలో కిషన్ రెడ్డి లాంటి సీనియర్లకు చెక్ పెట్టేందుకు కూడా పాదయాత్రే తనకు శ్రీరామ రక్ష అనుకుంటున్నారాయన.

రేవంత్ రెడ్డి యాత్ర..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. గతంలో ఆయన యాత్ర మొదలు పెడతానంటే.. ఏ హోదాలో చేస్తావంటూ సీనియర్లు అడ్డుకున్నారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో ఆయనకు లైన్ క్లియర్ అయింది. 

పార్లమెంట్ సమావేశాల అనంతరం ఆయన యాత్రకు రూట్ మ్యాప్ క్లియర్ అవుతుందని అంటున్నారు. ఎన్నికలనాటికి యాత్ర పూర్తి చేసి తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చూపించాలనుకుంటున్నారు రేవంత్.

షర్మిల యాత్ర..

గతంలో జగన్ ఓదార్పు యాత్రను కొన్నాళ్లపాటు కొనసాగించిన ఆయన సోదరి షర్మిల, ఇప్పుడు తాను సొంతగా ఏర్పాటు చేసుకున్న వైఎస్సార్టీపీ తరపున యాత్ర మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ యాత్రపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. 

ప్రస్తుతానికి నిరుద్యోగుల సమస్యలపై షర్మిల నిరాహార దీక్షల కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇదే ఏడాది షర్మిల పాదయాత్ర మొదలయ్యే అవకాశముంది.

తీన్మార్ మల్లన్న..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం కంటే ఎన్నోరెట్లు మేలు అనిపించుకున్నారు. మల్లన్న కూడా ఇప్పుడు యాత్ర మొదలుపెట్టాలనుకుంటున్నారట. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ కి చెమటలు పట్టించే పనిలో ఉన్నారు తీన్మార్ మల్లన్న.

మొత్తమ్మీద ఏపీలో జగన్ కి కలిసొచ్చిన పాదయాత్ర ఫార్ములా తెలంగాణలో కూడా తమకు కలిసొస్తుందని ఆశపడుతున్నారు అక్కడి ప్రతిపక్ష నేతలు. పాదయాత్రలకు సిద్ధమయ్యారు. రెండున్నరేళ్లకు ముందే తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచారు.