విజయవాడ ఎంపీ కేశినేని భాష చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆయన భాషను సభ్యసమాజం థూ, యాక్ అంటూ అసహ్యించుకునేలా ఉంది. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న కేశినేని భాష, నడతలో పలువురికి ఆదర్శంగా ఉండాలి. అందుకు విరుద్ధంగా ఒక మనిషి ఎలా మాట్లాడకూడదనేందుకు కేశినేని వాడిన భాషను ఉదహరించాల్సిన దుస్థితి వచ్చింది.
రాజధానిపై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్‌పై శుక్రవారం కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
‘రాజధాని మారుస్తామంటే చూస్తూ కూర్చోడానికి చేవ చచ్చి లేము. అమరావతి తరలింపు మీ తాత రాజారెడ్డి దిగి వచ్చినా వల్ల కాదు’ అని సీఎం తాత ప్రస్తావనకు తేవడం అసందర్భం. తన అనుచిత ప్రవర్తనను శనివారం కూడా ఆయన కొనసాగించాడు. దీనికి ట్విటర్ వేదికైంది.
‘ఇది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రిపోర్టు లాగా లేదు జగన్ మోహన్ రెడ్డి గారు.. సన్న బియ్యం సన్యాసి గాడు ఇచ్చిన రిపోర్టు లాగా ఉంది’ అని కేశినేని నాని ట్వీట్ చేశాడు. కేశినేని నాని దృష్టిలో సన్నబియ్యం సన్యాసి గాడంటే పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని. ఆయనపైన్నే తీవ్ర , అభ్యంతరకర ట్వీట్ చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన మొదటి రోజుల్లో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, విజయవాడ టీడీపీ నేత వెంకన్నపై, వైసీపీకి చెందిన తన ప్రత్యర్థి పీవీపీపై ట్విటర్ వేదికగా అనేక విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కేశినేని విమర్శలను వారు కూడా దీటుగా తిప్పికొట్టారు.
ఎప్పుడూ ఏదో ఒక అంశంపై ఛీప్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలచడం కేశినేనికి వ్యసనంగా మారిందని సొంత పార్టీ వారే విమర్శిస్తున్నారు.