ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు కీలక తీర్పులనకు వేదిక కానుంది. ఈ తీర్పులు రాజధాని అంశంతో ముడిపడి ఉండడంతో అందరి దృష్టి హైకోర్టుపై పడింది.
ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తరలించవద్దంటూ పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై నేటి నుంచి నేరుగా హైకోర్టులో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా చేశారు.
ఇదిలా ఉండగా రాజధాని తరలింపు పేరుతో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అతిథి గృహం నిర్మిస్తోందని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి.
దీనిపై సోమవారం హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. దీంతో విశాఖలో అతిథి గృహం నిర్మాణంపై క్లారిటీ రానుంది. అలాగే ఈ తీర్పు రాజధానికి సంబంధించి మిగిలిన వ్యాజ్యాలపై పరోక్షంగా పడనుందనే అభిప్రాయాలు న్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పలువురు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.
ప్రధాన న్యాయమూర్తి జీకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కు మార్, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.
అనుబంధ పిటిషన్లను అనుమతిస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు పాలకులు, ప్రకృతి వివక్ష కారణంగా ఎలా వెనుకబడ్డాయో చెప్పుకునే అవకాశం దక్కుతుంది.
విశాఖ, కర్నూలు ప్రాంతాలకు ఎగ్జిక్యూటివ్, న్యాయ రాజధాని రావాల్సిన ఆవశ్యతకతను న్యాయస్థానం వేదికగా ఆ ప్రాంత వాసులు తమ వాదనను బలంగా వినిపించే అవకాశం ఉంది. దీంతో మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్న తీర్పు, ఆదేశాలపై ఏపీలో ఉత్కంఠ నెలకుందని చెప్పొచ్చు.