రాజధాని మార్పు.. జగన్ వెనక కీలక వ్యక్తి?

ఉన్నఫలంగా ఏపీకి మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అసెంబ్లీలో జగన్ ప్రకటన చేసేంత వరకు అసలు ఆ కోణంలో ఎవ్వరూ ఆలోచించలేకపోయారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా ఈ విషయంలో…

ఉన్నఫలంగా ఏపీకి మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అసెంబ్లీలో జగన్ ప్రకటన చేసేంత వరకు అసలు ఆ కోణంలో ఎవ్వరూ ఆలోచించలేకపోయారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా ఈ విషయంలో షాక్ కు గురయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు-నలుగురికి మాత్రమే ఈ విషయం ప్రకటన కంటే ముందు తెలుసు.

అయితే ఈ మూడు రాజధానుల వ్యవహారం అకస్మాత్తుగా ఊడిపడింది కాదంటున్నారు చాలామంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుంచి జగన్ దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఓ వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పేరు స్వరూపానంద స్వామి.

అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించినప్పుడు చాలామంది అభ్యంతరం వ్యక్తంచేశారు. రాజధాని వాస్తు సరిగ్గా లేదని, చివరికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం కూడా వాస్తు విరుద్ధంగా ఉందని అప్పట్లో కొందరు ఆవేదన వ్యక్తంచేశారు. వాళ్లలో స్వరూపానంద కూడా ఒకరు.

వీటికి తోడు భౌగోళికంగా కూడా అమరావతిని రాజధానిని చేయడం ఏమంత శ్రేయష్కరం కాదని కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్వరూపానందన, జగన్ కు కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వాటి ఫలితంగానే ఇలా మూడు రాజధానుల ప్రకటన వచ్చిందని చెబుతున్నారు చాలామంది. జగన్ ఇప్పటికే పలుమార్లు స్వరూపానందను కలుసిన సంగతి తెలిసిందే.

కేవలం తన వర్గీయుల కోసం, స్వలాభం కోసం అమరావతిని ఏకపక్షంగా రాజధానిగా ప్రకటించుకున్నారు చంద్రబాబు. హూటాహుటిన అసెంబ్లీ, సెక్రటేరియట్లు నిర్మించారు. వాటి నాణ్యత గురించి అందరికీ తెలిసిందే. ఆ విషయం పక్కనపెడితే..వాస్తుపరంగా కూడా అసెంబ్లీకి, సచివాలయానికి చాలా మార్పుచేర్పులు చేశారు అప్పటి ముఖ్యమంత్రి.  అంతెందుకు.. జగన్ కూడా నూతన ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టేముందు వాస్తుమార్పులు చేయించుకున్నారు.

ఈ క్రమంలో రాజధాని ప్రాంతానికి విశాఖపట్నం అన్ని విధాలుగా అనువుగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. పరిపాలన ఇక్కడ్నుంచి సాగిస్తే మరింత శుభం కలుగుతుందని గతంలోనే వాస్తుపండితులు చెప్పిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. జగన్ 3 రాజధానుల నిర్ణయం వెనక ఈ వాస్తు అంశం కూడా ఉండే ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.