పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన స్థాయి మరిచి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలకు కాదేది అనర్హమన్న రీతిలో ఆయన నడుచుకుంటున్నారనే విమర్శలు పెరిగాయి.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త డైలాగ్‌లకు తెర లేపారు. తనను కూడా చంపాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. పట్టాభిని ఆయన నివాసంలో చంద్రబాబు పరామర్శించారు.
దాడికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు కళ్లు నెత్తికెక్కి ఏమైనా చేయగలమని అనుకుంటున్నారన్నారు.
పట్టాభిపై దాడికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పట్టాభిపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా చంద్రబాబు అభివర్ణించడం గమనార్హం. పట్టాభికి వ్యక్తిగత విరోధులెవరూ లేరని బాబు అన్నారు. ప్రజల కోసమే పట్టాభి పోరాడుతున్నారన్నారు.
ఎంతమందిని చంపుతారు? జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నట్టు చంద్రబాబు తీవ్రస్థాయిలో అన్నారు. ముఖ్యమంత్రి.. మీ బూతు మంత్రులకు ఇది సరికాదని చెప్పాలని కోరారు. పట్టాభిపై మొదటిసారి దాడి చేసినప్పుడే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
పోలీసులకు జీతాలు ఇచ్చేది జగన్ కాదని… ప్రజల సొమ్మే అని బాబు అన్నారు. చంపుతారా..? నన్ను కూడా చంపండి. ప్రజలు కన్నెర్ర చేస్తే అధికార పార్టీ నేతలు బయటకు కూడా రాలేరని చంద్రబాబు హెచ్చరించారు. కాగా చంద్రబాబు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తదితర పెద్దపెద్ద విషయాల గురించి మాట్లాడుతుంటే …దెయ్యాలు, వేదాలు గుర్తుకొస్తే అది చంద్రబాబు తప్పు ఎంత మాత్రం కాదని గుర్తించుకోవాలి.