టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపించే నేతల్లో పట్టాభి ఒకరు. టీవీల్లో తప్ప ఏనాడూ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేసినట్టు కూడా ఆయన కనిపించిన దాఖలాలు లేవు. కానీ అనతికాలంలోనే మీడియా పుణ్యమా అని పట్టాభి గుర్తింపు పొందారు.
కాగా పట్టాభిపై దాడి ఇది రెండోసారి. ఈ వేళ ఉదయం ఆయన తన ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళుతుంటే 10 మంది గుర్తు తెలియని దుండగులు కాపు కాసి చితక్కొట్టారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారు డ్రైవర్‌ను కూడా కొట్టారు. ఈ దాడిలో పట్టాభికి గాయాలయ్యాయి.
రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఘటన నుంచి పట్టాభితో సహా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటుంది.
మన పట్ల ఎదుటి వాళ్లు ఎంత గౌరవంగా ఉండాలని కోరుకుంటామో, మనం కూడా ఇతరుల విషయంలో అంతే మర్యాదగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే సంస్కారానికి సంబంధించిన వ్యవహారం.
దాడుల్లో రెండు రకాలున్నాయి. ఒకటి భౌతిక దాడి, రెండు మానసిక దాడి. భౌతిక దాడిలో అయిన గాయాలు కొంత కాలానికి మానిపోతాయి. అదే మనసుకు చేసే గాయం ఆ మనిషి బతికి ఉన్నంత వరకూ వెంటాడుతూ బాధపెడుతూనే ఉంటుంది. చర్యకు ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ మహాశయుడు ఏనాడో చెప్పారు. కావున మనపై దాడి జరిగిందంటే, అందుకు ప్రేరేపించిన ఘటనలేంటో కూడా ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉంటుంది.
టీడీపీలో ఎంతో మంది నాయకులు ఉండగా, ఒక్క పట్టాభే టార్గెట్ కావడం వెనుక బలమైన కారణం ఉండే ఉంటుంది. తనపై దాడికి మంత్రి కొడాలి నాని హస్తం ఉంటుందని పట్టాభి ఆరోపిస్తున్నారు. మంత్రి కొడాలే తనపై ఎందుకు దాడి చేయించారని అనుమానిస్తున్నారో పట్టాభి తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.
టీవీ చర్చల్లో విమర్శలు రాజకీయాలు దాటి వ్యక్తిగతమైతే సమాజంలో ఇలాంటి అశాంతి ప్రేరేపిత ఘటనలే చోటు చేసుకుంటుంటాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరని పెద్దలు చెబుతారు.
కానీ ప్రత్యర్థులను శత్రువులుగా భావించి …ఒరేయ్, అరేయ్ అని కించపరిచేలా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను కూడా ఏకవచన సంబోధనతో ఇష్టానుసారం నోరు పారేసుకోవడం ఈ మధ్య కాలంలో ప్యాషనైంది. ఎదుటి పార్టీ వాళ్ల కుటుంబ సభ్యుల మనసులు గాయపడేలా మాట్లాడితే వాటి పరిణామాలు హింసనే ప్రేరేపిస్తాయి. దీనికి అనేక ఘటనలను ఉదహరించొచ్చు.
అందుకే ముందు మనం ప్రత్యర్థులను గౌరవంగా మాట్లాడి, అక్కడి నుంచి కూడా అంతే గౌరవం పొందేందుకు ప్రయత్నించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. పట్టాభిపై దాడి తర్వాత ఇలాంటి ఆలోచనలు ఏపీ సమాజం మనసులో చక్కర్లు కొడుతున్నాయి. పట్టాభిపై దాడిని మరోసారి ఖండిద్దాం.