తరచు వినిపించే జోక్ ఒకటి వుంది.
'నాన్నా నేను రన్నింగ్ రేస్ లో సెకెండ్ వచ్చాను అన్నాడట కుర్రాడు. ఎంత మంది పాల్గొన్నారు అన్నాడట తండ్రి. ఇద్దరు అంటూ బదులిచ్చాడట పుత్రరత్నం. నోరు వెల్లబెట్టడం తండ్రి వంతు అయింది.
ఇప్పుడు ఈ పరమ పాత జోక్ చెప్పాల్సిన అవసరం, అగత్యం ఏమిటంటే, ప్రధాని మోడీ పాలన వ్యవహారం అచ్చంగా ఇలాగే వుంది కాబట్టి. చిన్న గీత దగ్గర పెద్ద గీత అన్న చందంగా, నానాటికీ తీసికట్టు నామం బొట్టు అన్న రీతిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం తగడలబడడంతో, మోడీ ప్రభకు ఎదురులేకుండా అయిపోయింది. అలా కాకుండా మొత్తంగా మోడీ పాలన ప్రోగ్రెస్ రిపోర్టు నికార్సుగా తీయడం మొదలుపెడితే వచ్చేవి అత్తెసరు మార్కులే అన్నది లోతుగా చూస్తే తెలిసే వైనం.
ప్లానింగ్
మోడీ ప్రధాని కావడనికి చాలా కాలం ముందు నుంచే మాంచి ప్రణాళిక అమలు చేయడం ప్రారంభమైంది. మీడియా తో ఆరెస్సెస్ కు లేదా భాజపా జనాలకు వున్న పరిచయాలను వాడుకుంటూ జాతీయ భావాలు రేకెత్తించడం దగ్గర నుంచి మోడీ గుజరాత్ పాలనను ఊదరగొట్టే ప్రయత్నం ప్రారంభమైంది.
వివేకానంద జయంతి అకేషన్ ను కొంత వాడుకున్నారు. ఆపై ఎప్పుడూ గుజరాత్ వైపు కన్నెత్తి చూడని మన సినిమా జనాలను వెంకయ్య నాయుడు వంటి పెద్దలు పూనుకుని పట్టుకెళ్లారు. వాళ్లు వస్తూనే అహో అద్భుతం, అబ్బో అద్భుతం అన్నారు. ఇదందా ఒక ఫేజ్.
కాంగ్రెస్ స్వయంకృతం
మీడియా హడావుడి చూసి, కొందరు కాంగ్రెస్ నేతల మాటలకు లొంగి, అన్నింటికి మించి కేసిఆర్ ను పూర్తి విశ్వసంలోకి తీసుకుని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఇవ్వడం తప్పు కాదు. ఇచ్చిన టైమ్ రాంగ్. పైగా తెలంగాణ డిమాండ్ అన్నది భాజపా స్టార్ట్ చేసింది అన్న సంగతి గమనించలేదు. భాజపా చేసిన మీడియా మేనేజ్ మెంట్ కాంగ్రెస్ కు అస్సలు చాతకాలేదు.
కాంగ్రెస్ తో సమానంగా భాగస్వామ్యం వుంది భాజపాకు తెలంగాణ ఏర్పాటులో. కానీ బయటకు ఎలా వచ్చింది అంటే భాజపా నాయకుడు వెంకయ్య నాయుడు వల్లే ప్రత్యేక హోదా తీర్మానం జరిగింది.పదేళ్లు ఉమ్మడి రాజధాని వచ్చింది. అలాంటి అద్భుతాలు సాధించిన వీరుడు ఆయన.
అలాంటి వీరుడు వున్న పార్టీ భాజపా అంటూ మన అను'కుల' మీడియా టముకేసింది. ఇంకేం వుంది మొత్తం పాపభారం అంతా కాంగ్రెస్ మోయాల్సి వచ్చింది. జీవితంలో మరి కోలుకోలేనంతగా కాంగ్రెస్ ను తెలంగాణలో, ఆంధ్రలో కిందకు తొక్కేసారు.
ఆంధ్రలో అంటే అర్థం చేసుకోవచ్చు. మరి తెలంగాణలో ఎందుకు తొక్కేసారు అంటే దాన్ని సాధించిన వీరుడిగా కేసిఆర్ ఆయన పార్టీ తెరాస ప్రొజెక్ట్ అయ్యాయి కాబట్టి. ఆంధ్రలో భాజపా వీరోచితం అయిపోయింది. అలా రెంటికి చెడిన రేవడిగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది.
ఇంకా తప్పులు
కాంగ్రెస్ పార్టీ పాపం మరిన్ని తప్పులు చేసింది. ఆ పార్టీ హయాంలో జరిగిన కుంభకోణాలను ఆ పార్టీనే వెలికి తీయడం, ఆ పార్టీ బాధ్యులకే శిక్షపడేలా చేయడం. ఆఖరికి ఆ పార్టీ నేతల, ఆ పార్టీ పొత్తు దారులైన పార్టీలే వివిధ కేసుల్లో ఇరుక్కునేలా చేయడం. ఇది నికార్సయినా పాలనకు నిదర్శనమో కాదో అన్నది పక్కన పెడితే కుంభకోణాల పాలన అన్న కలర్ వచ్చేసింది.
ఆ కలర్ సంగతి అలా వుంచి ఇదే వ్యవహారం ఇప్పుడు మోడీకి మహాబాగా కలిసివచ్చింది. జగన్, కేసిఆర్ దగ్గర నుంచి మమత, శశికళ, మాయావతి ఇలా దాదాపు అందరు రాజకీయ వేత్తలు మోడీ దగ్గర భయం భయంగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది.
మోడీ గొప్పతనం
మోడీ విషయంలో చెప్పుకోవాల్సిన మంచి విషయం ఒక్కటే. దేశంలో మోడీ హయాంలో కుంభకోణాల వ్యవహారాలు ఏవీ లేవు. రక్షణశాఖ విమానాల వ్యవహారం మినహా మరే ఒక్క అవినీతి వ్యవహారం గడబిడ లేదు. మోడీ ఒంటరి. ఆయన బంధువులు ఎవ్వరూ కూడా ఆయన చుట్టూ వున్న దాఖలాలు లేవు. మంత్రుల విషయంలో కూడా పెద్దగా గడబిడలు లేవు. ఇది భాజపాకు కీలక ప్లస్ పాయింట్.
కానీ ఈ ఒక్క విషయం తప్పిస్తే మిగిలిన అనేకానేక అసంతృప్తి సమస్యలు అనేకం వున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఏ పెట్రోల్, డీజిల్ ధరలను అయితే బూచిగా చూపించి హడావుడి చేసారో? ఇప్పుడు వాటి ధరలు ఆకాశాన్నంటాయి. రాజస్థాన్ లో పెట్రోలు ధర లీటరు వంద రూపాయలకు చేరిపోయింది. కానీ తగ్గింపు చర్యలు కనిపించడం లేదు.
రాష్ట్రాల మధ్య యూనిఫారమ్ టాక్స్ సిస్టమ్ లేదు. ఎవరికి తోచినట్లు వారు పెట్రోలు, డీజిల్ మీద ఆదాయం అందుకుంటున్నారు. అందువల్ల కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేంత సీన్ లేదు. కేవలం పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రమే కాదు, వంట నూనెల ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి.
జిఎస్టీ వ్యవహారం
జిఎస్టీ రావడం వల్ల చాలా ఉపయోగాలు వుంటాయని, ముఖ్యంగా ప్రజలకు కూడా బోలెడు ప్రయోజనాలు వుంటాయని ఆది నుంచీ ఊదరగొట్టారు. జీస్టీ వద్దు అని చెప్పే పరిస్థితిలో రాష్ట్రాల నేతలు లేరు. అందరూ తల ఊపారు. ఆదిలో తరచు జిఎస్టీ కమిటీ మీటింగ్ లు, ఈ పర్సంటేజ్ నుంచి ఆ పర్సంటేజ్ కు మార్చారు లాంటి వార్తలు కనిపించేవి. తరువాత ఇక అవి మాయం అయ్యాయి.
గతంలో సేల్స్ టాక్స్ వున్నపుడు ప్రత్యేకంగా వుండేది కాదు. ధరలో అదే కలిసిపోయి వుండేది. కానీ ఇప్పుడు జిఎస్టీ సెపరేట్ గా చూపించడం వరకు బాగానే వుంది కానీ కొన్ని వ్యాపారాలు మాత్రం జిఎస్టీ అదనంగా చెల్లించడం అన్నది కామన్ మాన్ కు అదనపు భారం అయింది. హోటళ్లు, లాడ్జ్ లు, ఇంకా చాలా వ్యాపారాలు రెగ్యులర్ ప్రయిస్ కు జిఎస్టీని వడ్డించడం ప్రారంభించాయి. బంగారం పై వన్ పర్సంట్ అదనంగా వుండేది ఇప్పుడు అది కూడా పెరిగిపోయింది.
పైగా జీఎస్టీతో రాష్ట్రాలు కూడా హ్యాపీగా లేవు. పన్నుల వసూలు కేంద్రం చేతిలోకి పోయింది. తిరిగి వెనక్కు ఇవ్వడం అన్నది కేంద్రం దయాధర్మంగా మారింది. జిఎస్టీ వసూళ్లు మినిమమ్ కు లేనపుడు రక్షణ నిధి అన్నది ఏర్పాటు చేసి, దానికి కొంత మళ్లించడం అనే విధానం లాంటిది రూపొందించారు. కానీ కరోనా టైమ్ లో అలా ఇవ్వలేం అని కేంద్రం చేతులు ఎత్తేస్తే రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి లేదు. జిఎస్టీ వల్ల భారం పడింది అనే రంగాలే తప్ప లబ్ధిపొందాం, రేట్లు తగ్గిస్తున్నాం అనే రంగం ఒక్కటి కనిపించలేదు
ప్రయివేటీకరణ
ప్రయివేటీకరణ అన్నది కొత్తగా కనిపెట్టిన పదం కాదు. కానీ మోడీ హయాంలో అది మరింత పెరిగిందన్న విమర్శలు వున్నాయి. చిరకాలంగా ప్రజల సేవలో వున్న రైల్వేను సైతం ప్రయివేటీకరణ దిశగా నడిపిస్తున్నారన్న వార్తలు వినవస్తున్నయి.
రైల్వేలు పేదలకు దగ్గరగా వెళ్లేది పోయి, దూరంగా జరుగుతున్నాయి. కరోనా తరువాత పేదల కోసం ధరలు తగ్గించాల్సింది పోయి, అన్ని రైళ్లను స్పెషల్స్ గా మార్చేసారు. రాయతీలు తీసేసారు. సదుపాయాలు తీసేసారు. పైగా రేట్లు పెంచేసారు. కానీ ఎక్కడా ఎవ్వరూ నొరు ఎత్తిన సాహసం చేయలేదు.
లాభదాయకం కాని ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరణ బాట పట్టిస్తే తప్పు లేదు. కానీ లాభాల్లో వున్నవాటిని కూడా అటే పంపడం అంటే ఏమనుకోవాలి. లాభాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కు లో ప్రభుత్వ వాటా కొంత విక్రయిస్తారన్న వార్తలు వినవస్తున్నాయి. దీనిని ఖండిస్తూ ఏ రాజకీయ పక్షం ఓ ప్రకటన గట్టిగా చేసిన దాఖలా లేదు.
రోడ్ల అభివృద్ది విస్తరణ ఎక్కువగా జరగడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. కానీ అదే సమయంలో మామూలు రోడ్లు అన్నీ టోల్ రోడ్ లు గా మారిపోతున్నాయి. రోడ్ ఎక్కడితే టోల్ అన్నది పెద్ద వ్యవహారం అయిపోయింది. పైగా టోల్ కు డిజిటల్ పేమెంట్లు ఏర్పాటు చేసి, జనాలకు నొప్పి తెలియని ఇంజక్షన్ మాదిరిగా మార్చేసారు.
మధ్యతరగతి..ఏదీ గతి?
గతంలో మధ్యతరగతికి బ్యాంకులు పెద్ద ఆసరాగా వుండేవి. రిటైర్ అయినవారు, సేవింగ్స్ చేసుకున్నవారు బ్యాంకుల్లో దాచుకుని, వాటిని నమ్ముకుని కాస్త వడ్డీ తీసుకుని బతుకే అవకాశం వుంది. షెర్ లు, మ్యూచువల్ ఫండ్ ల్లాంటి రిస్క్ కు దూరంగా వుండేవారికి ఫిక్స్ డ్ డిపాజిట్ లు ఓ వరంగా వుండేవి.
కానీ ఒకప్పుడు 9 శాతానికి పైగా ఫిక్స్ డ్ డిపాజిట్ల మీద వడ్డీ వుంటే ఇప్పుడు అది అయిదు శాతానికి పడిపోయింది. బంగారం కొనలేరు. బ్యాంకులో వడ్డీ రాదు. మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ చేయలేరు. మరి మధ్యతరగతి వారికి పెట్టుబడి అవకాశం ఏదీ?
దేశం మొత్తం మీద బడాబాబుల బ్యాంకు రుణాల జాబితా తీస్తే లక్షల కోట్లు వుంటుందేమో? అనిల్ అంబానీ నుంచి మన రాష్ట్రానికి చెందిన లగడపాటి, రాయపాటి, సుజన చౌదరి, ఇలా అనేకానేక సంస్థలు వేనవేల కోట్లు బ్యాంకులకు కట్టాల్సి వుంది. ఇవన్నీ ఇడి, సిబిఐ, కొర్టు కేసులంటూ అలా సాగుతున్నాయి. బ్యాంకులకు కోట్లు బాకీ పడి, కేసులు ఎదుర్కొంటున్నవారు అయోధ్య రామమందిరానికి కోట్లు విరాళం ఇచ్చి భాజపా నీడలో భరోసాగా బతికేస్తున్నారు.
కోవిడ్ వ్యవహారం
కోవిడ్ దేశాన్ని పట్టి కుదిపేసిన టైమ్ లో మోడీ ముందుగా కొన్ని ప్రశంసలు అందుకున్నారు. లాక్ డౌన్, జనాలను ఓ తాటిపైకి తీసుకురావడానికి ఆయన వాడిన చిట్కా వైద్యాలు ముందు బాగానే పనిచేసాయి. కానీ మోడీ కేవలం మాటల గారడీ చేస్తున్నారని, ఖజానా లోంచి పైసలు తీయడానికి మాత్రం ముందుకు రావడం లేదని జనాలకు అర్థం కావడానికి అట్టే కాలం పట్టలేదు.
అలాగే కరోనా ప్యాకేజ్ అంటూ ప్రకటించిన భారీ ప్యాకేజ్ కూడా పలు జోక్ లు పాలయింది. కేంద్రం మీద భారం తప్పించుకోవడానికి వైన్ షాపులకు ముందుగా అనుమతి ఇవ్వడం విమర్శల పాలయింది. ఆఖరికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కిందా మీదా పడి కరొనాను కట్టడి చేయగలిగాయి
పార్టీ ఫిరాయింపులు,
సిద్దాంతాలకు కట్టుబడిన పార్టీ అంటూ, చెప్పే పార్టీ, నల్ల ధనాన్ని వెనక్కు రప్పిస్తామన్న పార్టీ, ఇప్పుడు పెట్టుబడి దారులకు ఆశ్రయంగా మారిపోయింది. అంబానీ, ఆదానీల కోసమే ప్రభుత్వం అన్న అపవాదులు ప్రారంభమయ్యాయి. ముంబాయి ఎయిర్ పోర్ ఉదంతంలో జివికే మీద వచ్చిన వత్తడి, అది ఆదానీల పరమైన వైనం సింపుల్ గా కవర్ అయిపోయాయి. వందలు వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టినవారంతా ఇప్పుడు భాజపాలో షెల్టర్ తీసుకుంటున్నారు.
ఇదే పరిస్థితి కాంగ్రెస్ హయాంలో వుండే మీడియాలో ఎంత యాగీ జరిగేదో? పార్టీల నుంచి జనాలను లాక్కోవడం, మెజారిటీ బొటా బొటీగా వచ్చినా ప్రభుత్వాలను ఏర్పాటుచేయడానికి ఫిరాయింపులను ప్రోత్సహించడం వంటి అవలక్షణాలు అన్నీ ప్రదర్శించినా అంతా సజావుగానే వుంటుంది భాజపా హయాంలో. దేశాన్ని కాషాయీకరణ చేసే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వున్నాయి.
జాతీయ భావం అనేదాన్ని భక్తితో రంగరంచడం అన్నది భాజపా స్పెషాలిటీ. రామమందిరం నిర్మాణానికి వందల కోట్లు ఇవ్వడానికి ఎందరో ముందుకు వచ్చారని టాక్ వున్నా, దేశం మొత్తం మీద నిధి సేకరణ అంటూ భక్తి భావం రేకెత్తించే కార్యక్రమం వెనుక కూడా ఇదే తరహా పద్దతులు వున్నాయన్న విమర్శలు వున్నాయి.
కాంగ్రెస్ పరిస్థితి
దేశంలో భిన్నమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. ప్రాంతీయ పార్టీలు అన్నీ మోడీ అంటే భయభక్తులతో వున్నాయి. అలా అని అవన్నీ లోలోపల అదనుకోసం చూస్తున్నాయి అన్నది వాస్తవం. కానీ ఆ అదను అన్నది ఎలా రావాలి? ప్రతిపక్షాలు పోరాటం చేయడం ద్వారా? ప్రతిపక్షలు ఎక్కడ వున్నాయి.
ఉదాహరణకు ఆంధ్రలో తెలుగుదేశం, వైకాపా రెండూ ఒకదానితో ఒకటి కొట్టుకుంటాయి కానీ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనవు. అలాగే ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలు వాటిలో అవి కొట్టుకుంటాయి తప్ప మోడీ పాలన జోలికిపోవు. ఎక్కడో ఒకటి రెండు రాష్ట్రాలు దీనికి మినహాయింపు.
పంజాబ్ లో ప్రారంభమైన రైతుల ఉద్యమం దేశం మొత్తానికి పాకకపోవడానికి ఇదే కారణం. దాదాపు తోంభై శాతం ప్రాంతీయ పార్టీలు మోడీకి వ్యతిరేకంగా గళం ఎత్తడానికి సిద్దంగా లేవు.
చాలా కాలం కిందటే కాంగ్రెస్, భాజపా అన్న వ్యవహారం పోయి ఎన్టీఎ, యుపిఎ అంటూ ప్రాంతీయ పార్టీల సమ్మేళం, జాతీయ పార్టీల నాయకత్వం అనే విధానం వచ్చేసింది. దాంతో కింది స్థాయిలో కాంగ్రెస్ కుదేలయిపోయింది. ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా కాంగ్రెస్ పోరుబాట పట్టలేదు. జనాల్లో భాజపా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. ఎందుకంటే మోడీకి సరితూగే నాయకుడు లేడు. రాహుల్ గాంధీ ఎంత ప్రయత్నించినా జనంలో కలిసిపోయి తిరుగుతున్నా, కష్టపడుతున్నాడన్న పేరు మాత్రమే మిగులుతోంది.
కాంగ్రెస్ హయాంలో కోటరీ అనిపించుకుని, రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కితొక్కి, హవా నడిపించుకున్న నాయకులు అంతా తాత్కాలికంగా వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నారు. అందువల్ల ఆ పార్టీ తరపున పోరాడేవాళ్లు తగ్గిపోయారు. మరోపక్క మీడియా కూడా రెండుగా చీలిపోయింది. మెజారిటీ మీడియా మోడీ ప్రభుత్వం వెనుకనే వుంది. అందువల్ల మోడీ పాలన జనాలకు కనిపించదు.
కేవలం మోడీ మాత్రమే కనిపిస్తారు. మోడీ ముందు మరే నాయకుడు మనకు కనిపించడు. మోడీ చేసే మ్యాజిక్ తో మనం మైమరిచిపోవడమే. అంతకు మించి గత్యంతరం లేదు. కానీ మోడీ మ్యాజిక్ మాత్రమే చేసి రంజిపచేయకుండా, మధ్య తరగతి జీవితాలకు వెలుగు తెస్తే అది అసలైన మ్యాజిక్ అవుతుంది.
చాణక్య