స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి వరుసపెట్టి విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ప్రైవేటీకరణను ఆపేందుకు తన పార్టీ నుంచి పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలన్నారు.
“పవన్ రాజకీయ అజ్ఞాని. ఈ విషయాన్ని చిన్న పిల్లలు కూడా చెబుతారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తోందో అంతా చేస్తోంది. ప్రతిపక్షం నుంచి టీడీపీ ఏం చేయాలో అది చేస్తోంది. మరి పవన్ కల్యాణ్ ఏ పార్టీయో తెలియదు. పగిలిపోయే గ్లాస్ గుర్తు పెట్టుకొని ఆయనేం చేస్తాడో తెలీదు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు ఆయన పార్టీ నుంచి ఏం చేశాడో చెప్పాలి. అది చెప్పకుండా మాకు సలహాలిస్తాడు. మేం పీకేని తీసేసి ఈయన్ను పెట్టుకున్నామా? మా పార్టీ ఎప్పుడు ఏం చేయాలో ఈయన ఎందుకు చెబుతున్నాడు? ఆ పీకే (ప్రశాంత్ కిషోర్)ని తీసేసి, తనని పెట్టామని అనుకుంటున్నాడేమో. మేం పీకే..పీకే అంటుంటే ఆయన్ను అనుకొని సలహాలు ఇచ్చేస్తున్నాడు.”
దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్ ప్లాంట్స్ పై కేంద్రం నిర్ణయం తీసుకుందని, అన్నీ ప్రైవేటుపరం చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మాత్రం విడిచిపెట్టదని అన్నారు నాని. ఈ విషయంలో వైసీపీ నేతలు మాత్రమే ఆందోళన చేస్తే పని జరగదని, దేశవ్యాప్తంగా ఉద్యమం రావాలన్నారు. ఈ విషయం తెలిసి కూడా పవన్ కల్యాణ్, తన ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వైసీపీ ప్రభుత్వానికి సలహాలిస్తున్నారని విమర్శించారు నాని.
“పార్లమెంట్ లో మేం ప్లకార్డులు చూపిస్తే ప్రైవేటీకరణ ఆగిపోతుందా? ఒకవేళ అలా ఆగిపోతుందనుకుంటే.. ప్లకార్డులు ఏం ఖర్మ, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ చేయొద్దంటూ మా ఎంపీల చొక్కాల మీద వెనక-ముందు రాయించేస్తాం. బాబూ పవన్ కల్యాణ్ నీకో నమస్కారం. నీ సలహాలు మేం వింటే మరోసారి అసెంబ్లీకి రాలేం. స్టీల్ ప్లాంట్ పై నీకు ఎలా కావాలంటే అలా పోరాటం చేస్కో. మాకు మాత్రం సలహాలు ఇవ్వకు. కావాలంటే నీ దత్త తండ్రి చంద్రబాబుకు సలహాలు ఇచ్చుకో.”
బీజేపీ-జనసేన మధ్య సంబంధాలు దెబ్బతినకుండా, మోడీ మనసు గాయపరచకుండా ఉండేందుకు.. పవన్ కల్యాణ్ వైసీపీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు మంత్రి కొడాలి నాని. ఇలాంటి పీకేని సలహాదారుగా పెట్టుకుంటే, తమను జనాలు పీకి అవతల పడేస్తారని ఎద్దేవా చేశారు.