టీడీపీ భవిష్యత్తుపై ఆ పార్టీ నేతల్లో కూడా తీవ్ర ఆందోళన ఉంది. పెద్దాయనకు వయసైపోతోంది, చినబాబుకి వయసొచ్చినా తెలివితేటలు రాలేదు. నారావారికి మినహా ఇంకెవరికీ పార్టీ పెత్తనం ఇచ్చే ఆలోచన బాబుకి లేదు. ఇలాంటి దశలో టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందనే ప్రశ్న దాదాపు అందరి మదిలో ఉన్నదే. అయితే గియితే చివరాఖరికి టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెడతారని, ఆయనొక్కరే పార్టీని కాపాడగలుగుతారని కొంతమంది వీరాభిమానుల విశ్వాసం. అయితే అది కూడా పగటి కలేనని తేల్చి పారేశారు కొడాలి నాని. చంద్రబాబుకి మరోసారి చాకిరేవు పెట్టారాయన.
ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ భవిష్యత్ ఎలా ఉండబోతోందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు నాని. జూనియర్ ఎన్టీఆరే కాదు, ఇంకెవరూ టీడీపీని కాపాడలేరని, ఆ పార్టీకి ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందని తేల్చిపారేశారు. కొత్తగా ఎవరో కాపాడే స్థితిలో కూడా టీడీపీ లేదని అన్నారు నాని.
చంద్రబాబుతో నానికి విభేదాలు ఉండొచ్చు కానీ, ఎన్టీఆర్ తో ఆయనకి ఇంకా సత్సంబంధాలే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంటే నానికి గౌరవం ఎక్కువ. అలాంటి నాని కూడా జూనియర్ టాలెంట్ ని శంకిస్తున్నారంటే ఆ పార్టీ ఎంత అధ్వాన్న స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నందమూరి హరికృష్ణ, ఎన్టీఆర్ ని ఇప్పటికే బాబు వాడుకుని వదిలేశారని అన్నారు నాని. అంటే ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టడం ఆయన నిజమైన అభిమానులకు ఇష్టం లేదన్నమాట. అదే విషయాన్ని బహిర్గతం చేశారు నాని.
ఇక వెన్నుపోటు రాజకీయాలతో టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చాక 25ఏళ్లలో ఆ పార్టీ ఎలా పతనం అయిందో కూడా వివరించారు. తెలంగాణలో కనీసం ఒక్కచోట కూడా గెలిచే పరిస్థితి లేదు, ఇటు ఏపీలో దాదాపు 100 స్థానాల్లో పోటీ నామమాత్రంగానే ఉంది. బలమైన నాయకులు లేరు, అధినాయకత్వంపై అపనమ్మకంతో క్యాడర్ చేజారింది.
చివరకు చరిత్రలో కనీ వినీ ఎరుగని దారుణ పరాభవాన్ని 2019 ఎన్నికల్లో టీడీపీ మూటగట్టుకుంది. రాబోయే రోజుల్లో ఇంతకంటే పతనమే ఉంటుంది కానీ పైకెదగడం మాత్రం టీడీపీకి ఉండదంటున్నారు నాని.