మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా పల్స్ పడిపోవడంతో ఆయన్ను హుటాహుటిన హాస్పిటల్ కు…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా పల్స్ పడిపోవడంతో ఆయన్ను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు.

రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరు తెచ్చుకున్నారు రోశయ్య. 1933, జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించిన రోశయ్య.. హిందూ కాలేజ్ లో కామర్స్ డిగ్రీ చేశారు. ఆ టైమ్ లోనే రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా 1968లో శాసనమండలి సభ్యుడయ్యారు.

ఇక మంత్రిగా తొలిసారి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు-భవనాలు, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. కెరీర్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడిగా కొనసాగుతూ వచ్చిన రోశయ్య.. కాంగ్రెస్ హయాంలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా తను మాత్రం వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. అయితే ఆర్థిక శాఖలో ఆయన తనదైన ముద్ర వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన అనుభవం దక్కించుకున్న రోశయ్య.. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యథికంగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డ్ సృష్టించారు రోశయ్య. ఇప్పటివరకు 15సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారాయన. బడ్జెట్ కూర్పు, లెక్కల్లో రోశయ్యకు తిరుగులేదు అనే రిమార్క్ ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయనేతలందరితో అందరివాడు అనిపించుకున్న ఘనత రోశయ్యది. రోశయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తున్నారు.