ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ప్రతిపక్షాలంటున్నాయి. ఇబ్బందులున్నా, కష్టాలున్నా జగన్ అన్నిటినీ భరిస్తూ ఎవరి ఊహలకి అందని విధంగా పాలన చేస్తున్నారని అధికార పక్షం చెబుతూ వస్తోంది. అప్పులున్నా కూడా ఎక్కడా ఒకటో తేదీ పింఛన్ ఆగలేదు, ఏ ఒక్క తల్లికీ అమ్మఒడి నిలిచిపోలేదు, రైతు భరోసా విషయంలో కూడా అనుమానాలు లేవు. దాదాపుగా అన్ని పథకాలు అమలులోనే ఉన్నాయి.
అయితే ఉద్యోగుల పీఆర్సీ విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం కాస్త ఆచితూచి అడుగులేస్తోంది. పీఆర్సీ ప్రకటించి అమలులోకి తెస్తే.. జీతభత్యాల కోసం కేటాయింపులు భారీగా పెరగాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అది అసాధ్యం. కానీ జగన్ తిరుపతిలో హామీ ఇచ్చేశారు. 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు.
జగన్ హామీ ఉద్యోగుల్లో సంతోషం నింపచ్చేమో కానీ, అటు ఆర్థిక శాఖ అధికారులు, సంబంధిత మంత్రులు మాత్రం హడలిపోతున్నారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో రాజశేఖర్ రెడ్డి ఇచ్చే హామీలకు తన గుండె ఆగినంత పని అయ్యేదని అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య సరదాగా చెప్పేవారు. ఆయన చేతికి ఎముక లేదని, ఆయన దానాలు చూస్తే తనకి భయం వేస్తోందని చెప్పేవారు. సరిగ్గా ఇప్పుడు జగన్ ని చూసి కూడా అధికారులు అలాగే హడలిపోతున్నారు.
జనం ఏది కోరితే అది చేయడం జగన్ కి అలవాటైంది. తాజాగా మూడు జిల్లాల పర్యటనలో వరద బాధితులకు కూడా ఎక్కడికక్కడ హామీలు ఇచ్చి వచ్చారు జగన్. నెల్లూరు జిల్లాలో పెన్నాకు బండ్ నిర్మాణానికి 100కోట్లు ఇస్తామని, సోమశిల ఆప్రాన్ మరమ్మతులకు 120కోట్లు ఇస్తామంటూ.. వారు ఊహించినదాని కంటే ఎక్కువే కేటాయింపులు చేశారు. అయితే ఇప్పుడు పీఆర్సీ ప్రకటన అలా కాదు.. ఇది నెల నెలా ఖర్చు చేయాల్సిన విషయం. అందుకే అధికారులు కిందామీదా పడుతున్నారు.
ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్..
ఉద్యోగులు 55శాతం అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం 30శాతం ఇచ్చే అవకాశముందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పదిరోజుల తర్వాతయినా ప్రభుత్వ ప్రకటనతో తీవ్ర చర్చ నడిచే అవకాశం ఉంది. కనీసం 40నుంచి 45శాతం ప్రకటించినా ఉద్యోగ వర్గాలు ఫుల్ హ్యాపీ. అదే 30శాతం దగ్గర ఆగిపోతే మాత్రం ఉద్యోగుల్లో జగన్ ఇమేజ్ ఒక్కసారిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ఇప్పటివరకూ కొన్ని విషయాల్లో లేటయినా జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆ ఆలస్యాన్ని కూడా మరచిపోయేలా చేశాయి. మరి ఉద్యోగుల విషయంలో జగన్ చేయబోయే ప్రకటన ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో చూడాలి.