తమ పార్టీ నేతల రాజీనామా వల్ల వచ్చే ఉప ఎన్నికలకు వారి గత ప్రత్యర్థులను అరువు తెచ్చుకోవడం టీఆర్ఎస్ కు అలవాటుగా మారింది. ఆ పార్టీ స్వల్ప కాలపు చరిత్రలోనే ఇలాంటి అధ్యాయాలెన్నో ఉన్నాయి. ఈ క్రమంలో.. మరోసారి అదే జరుగుతోంది. ఈటెల రాజేందర్ రాజీనామాతో అనివార్యం అయిన హుజురాబాద్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు రెడీ అయినట్టుగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ నేతలతో తన ఫోన్ సంభాషణలు బయటపడిన కొన్ని గంటల్లోనే కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ కావడం, వాటికి వివరణ ఇవ్వడానికి బదులు పార్టీపై విమర్శలు చేస్తూ రాజీనామాను ప్రకటించారు కౌశిక్ రెడ్డి. దీంతో ఆయన టీఆర్ఎస్ లోకి చేరతారనే క్లారిటీ రానే వస్తోంది.
ఇన్నాళ్లూ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ చార్జిగా వ్యవహరించిన కౌశిక్ రాజీనామాతో ఆ పార్టీకి ఉప ఎన్నికల ముందు ఎదురుదెబ్బ తగిలినట్టే. అయితే కాంగ్రెస్ ముందే అలర్ట్ అయినట్టు అయ్యింది. ఈయన మరి కొన్ని రోజుల తర్వాత రాజీనామా విషయాన్ని ప్రకటించి ఉంటే, అప్పుడు అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ మరింతగా పాకులాడాల్సి వచ్చేదేమో!
ఆ సంగతలా ఉంటే.. ఇది టీఆర్ఎస్ కు చెప్పుకోదగిన విజయం అవుతుందా? అనేది మరో చర్చ. టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం బలహీనంగా ఉన్న వైనానికి ఇది మరో రుజువు అవుతుంది. సొంత పార్టీ నేత రాజీనామా చేసి మరో పార్టీలోకి వెళ్లిపోతే, మరో పార్టీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిని తెచ్చుకుంటోంది.
ఈ అరువు రాజకీయాలకు టీఆర్ఎస్ కు కొత్త కాదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముందు కూడా జానారెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం జరిగింది. ఆ ప్రయత్నాలు కూడా జరిగినట్టున్నాయి. అయితే జానా నిరాకరించడంతో చివరకు ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. రాజకీయం మరోలా సాగింది. ఈ సారి మాత్రం మళ్లీ అరువు రాజకీయమే సాగుతున్నట్టుగా ఉంది!