ఏపీ ఉల్లి ఎగుమ‌తుల‌పై కేంద్రం సానుకూల‌త‌

కృష్ణాపురం (కేపీ) రకం ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఒకటి, రెండు రోజుల్లో తొలగించి ఎగుమతులకు అనుమతిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో…

కృష్ణాపురం (కేపీ) రకం ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఒకటి, రెండు రోజుల్లో తొలగించి ఎగుమతులకు అనుమతిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్సీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి ఈ అంశంపై మాట్లూడుతూ దేశంలో ఇటీవల ఏర్పడిన ఉల్లిపాయల కొరత కారణంగా ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్ధిస్తున్నా. కానీ ఒకే విధానం అన్నింటికీ అమలు చేయడం సరికాదని భావిస్తున్నా అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప, కర్నూలు, ప్రకాశం వంటి జిల్లాల్లో కృష్ణాపురం (కేపీ) రకం అనే ఉల్లిపాయలను రైతులు దాదాపు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో పండిస్తున్నారు. కేపీ ఉల్లి వంటలకు, గృహ వినియోగానికి పనికి రాదు. కేవలం విదేశాలకు ఎగుమతి చేయడానికి కేపీ ఉల్లిని సాగు చేస్తారు. హాంగ్‌కాంగ్‌, మలేసియా, సింగపూరు వంటి దేశాలు కేపీ ఉల్లిని దిగుమతి  చేసుకుంటాయని ఆయన చెప్పారు. దురదృష్టవశాత్తు గత ఏడాది సెప్టెంబర్‌లో కేపీ రకం ఉల్లితో సహా ఉల్లిపాయల ఎగుమతులను ప్రభుత్వం నిషేధించడం వలన కేపీ ఉల్లి సాగుచేస్తున్న వేలాది మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

రైతులు కేపీ రకం ఉల్లిని దేశీయ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి. కేపీ ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి పనికి రాదు. అందువలన చేతికొచ్చిన  పంట కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. కేపీ ఉల్లి పండించే రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రోజ్ ఆనియన్ పేరుతో ఇదే రకం ఉల్లిని కర్నాటక  రైతులు సాగుచేస్తున్నారు. ఆ ఉల్లిని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించి కేపీ ఉల్లి ఎగుమతులకు మాత్రం అనుమతించకపోవడం న్యాయం కాదని వాదిస్తూ కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తక్షణమే తొలగించాలని వాణిజ్య శాఖ మంత్రి గోయల్‌ను అభ్యర్ధించారు.

ఎగుమతులకు అనుమతించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇది చాలా ప్రధానమైన సమస్య అని అంగీకరించారు. ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటుందని సభా ముఖంగా హామీ ఇచ్చారు.