ఈ మధ్యనే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏదో ప్రకటన చేశాడు. తాము ఒకప్పుడు ఇండియాను వరసగా ఓడించినట్టుగా చెప్పుకొచ్చాడు. అది క్రికెట్ లో లెండి. అయితే ఇమ్రాన్ ఎప్పుడు అంతగా ఇండియాను ఓడించాడో అంతా మరిచిపోయి ఉండొచ్చు. ఆయనే ఆ విషయాన్ని గుర్తు చేయాల్సి ఉండొచ్చు.
ఈ తరంలో మాత్రం ఇండియన్ టీమ్ కు పాక్ జవాబు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నట్టుగా లేదు. ఇప్పటికే ప్రపంచకప్ లలో ఇండియాతో తలపడి పాక్ వరసగా ఓటముల పాలవుతూ ఉంది. ఈ క్రమంలో అండర్ 19 ప్రపంచకప్ లో మరోసారి అదే ఫలితమే వచ్చింది. భారత కుర్రాళ్లు పాక్ ను చిత్తుగా ఓడించారు. అది కూడా సెమిఫైనల్ మ్యాచ్ లో. ఈ విజయంతో ఇండియా అండర్ 19 ప్రపంచకప్ లో ఫైనల్ లోకి ఎంటరయ్యింది.
పాక్ జట్టు 173 పరుగులకు ఆలౌట్ కాగా, భారత జట్టు వికెట్ పడకుండానే ఆ స్కోర్ ను ఛేదించింది. భారత బ్యాట్స్ మన్లలో జైస్వాల్ సెంచరీ చేయగా, మరో ఓపెనర్ సక్సెనా 59 పరుగులు చేశాడు. విన్నింగ్ షాట్ ను సిక్సర్ గా మలిచి సెంచరీ పూర్తి చేయడంతో పాటు, మ్యాచ్ ను కూడా 36వ ఓవర్లోనే ముగించాడు జైస్వాల్. పది వికెట్ల విజయంతో టీమిండియా గ్రాండ్ గా ఫైనల్లోకి ఎంటరయ్యింది.
న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ల మధ్యన జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఈ సారి అండర్ 19 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా టైటిల్ ను నిలబెట్టుకునేందుకు మరో అడుగు దూరంలో ఉంది.