అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు రైతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. తమ సమస్యల్ని ముఖ్యమంత్రి యెదుట వారంతా ఏకరువు పెట్టారు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీల కోసం ప్రకటించిన సరికొత్త ప్యాకేజీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అమరావతి పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలైన ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి రైతుల్ని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్ళారు.
ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రైతుల్లో కొందరు, 'మాకు రాజధాని వద్దు మహాప్రభో..' అంటూ వ్యాఖ్యానించడం. 'రాజధాని వుంటుందో, వుండదో మాకు అనవసరం. మా ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం. మాకు రోడ్లు కావాలి.. స్కూళ్ళు, ఆసుపత్రులు కావాలి..' అంటూ రైతులు నినదించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామన్నారు. ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చిందనీ చెబుతున్నారు రైతులు.
ఇంతకీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసినవారుఏ నిజంగానే రాజధాని ప్రాంతానికి చెందినవారా.? అన్న అనుమానం తలెత్తడం సహజమే. కానీ, తాము ఏ ఊరిలో వుంటున్నదీ, రాజధాని కోసం ప్రభుత్వానికి తాము ఎంతెంత భూముల్ని ఇచ్చిందీ సదరు రైతులు చెప్పుకొచ్చారు. 'స్వచ్ఛందంగా భూములు తీసుకుంటామని తొలుత ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత బెదిరించి భూములు లాక్కుంది..' అని ఓ రైతు తన ఆవేదనను వెల్లగక్కాడు.
ఇదిలా వుంటే, ఢిల్లీలో అమరావతి రైతుల పేరుతో కొందరు హల్చల్ చేస్తోన్న విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి, రాజధానిని తరలించొద్దంటూ మొరపెట్టుకుంటున్నారు. అక్కడా రైతులే, ఇక్కడా రైతులే. వాళ్ళూ అమరావతికి చెందినవారే, వీళ్ళూ అమరావతికి చెందినవారే. ఇదే అసలు సిసలు ట్విస్ట్. రాజధాని అమరావతి విషయంలో అమరావతి ప్రాంత రైతుల్లోనే చీలిక వచ్చింది. ఇంతకీ, ఇప్పటిదాకా ఒక్కటిగా వున్న రైతుల్లో ఈ చీలిక ఎందుకు వచ్చినట్లు.?