జగన్ సర్కార్ లాజిక్ మిస్ అయింది. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడుతున్న చందంగా విశాఖపట్నంలో కృష్ణాయాజమాన్య బోర్డు కార్యాలయాన్ని పెట్టాలనే నిర్ణయం ఉందని రైతు సంఘాలు, వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు విమర్శి స్తున్నారు.
చివరికి విశాఖలో కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని పెట్టాలనే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. తెలంగాణ వ్యతిరేకతను గుడ్డిగా సమర్థించడం లేదా వ్యతిరేకించడం కూడా మంచిది కాదు.
అందులోని సహేతుకతను ప్రతి ఒక్కరూ, మరీ ముఖ్యంగా ఏపీ సర్కార్ అర్థం చేసుకోవాల్సి ఉంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయడం సముచితం. కృష్ణా నది ప్రవహిస్తున్న రాయలసీమ లేదా కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే.
అయితే ఇటు కోస్తా, అటు రాయలసీమ ప్రాంతాలను కాదని, అసలు కృష్ణా నదితో సంబంధం లేని…. ఉత్తరాంధ్రలోని విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాయలసీమలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాలు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో కృష్ణా నది ప్రవాహం మొదలయ్యేది ఆ ప్రాంతం నుంచే. రాయలసీమ ఆకాంక్షను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం తమకు సమ్మతం కాదని తెలంగాణ పేర్కొంది. ఈ మేరకు ఇది తమకు అనుకూలం కాదంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్‌చీఫ్ మురళీధర్ సోమవారం లేఖ రాశారు.
కృష్ణా బేసిన్‌కు బయట, సంబంధం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు ఇబ్బంది అవుతుందని ఆ లేఖలో ప్రస్తావించారు. కనీసం తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను పక్కన పెట్టి, రాయలసీమ సమాజం డిమాండ్‌నైనా పరిగణలోకి తీసుకుని కర్నూ లులో కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
రాయలసీమలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏపీలోని టీడీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పొంతన లేని నిర్ణయాలను తీసుకుంటూ, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు సలహాలిస్తున్న ఆ సాగునీటి నిపుణులెవరో తెలియదు కానీ, వాళ్లకు చేతులెత్తి దండం పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.