ఏపీలో పాలన గురించి వ్యాఖ్యలు చేసి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక ఆసక్తిదాయకమైన చర్చకు తెరలేపారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల కౌంటర్లు, స్పందనలు ఎలా ఉన్నా.. ఏపీ, తెలంగాణల్లో పాలన గురించి, ప్రజలకు పాలన చేరవవుతున్న తీరు గురించి మాత్రం చర్చకు ఆస్కారం ఇచ్చారు కేసీఆర్.
నిజానికి ఏపీ, తెలంగాణల మధ్య పోలిక అక్కర్లేదు. ఐదు దశాబ్దాల పాటు ఏపీ, తెలంగాణ ప్రజల అభ్యున్నతితో అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను, దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏకపక్షంగా సొంతం చేసుకుని సాగుతున్న తెలంగాణ, రాజధానిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ను చూసి వెకిలి మాటలు మాట్లాడితే అంతకన్నా హాస్యాస్పదం లేదు. కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా.. కలిసి అభివృద్ధి చేసుకున్న నగరంపై వచ్చే ఆదాయాన్ని చూసుకుని గప్ఫాలు కొట్టుకోవడమే అవుతుంది. ఇది ఎవరికీ తెలియనిది కాదు!
పుండు మీద కారం జల్లినట్టుగా వ్యవహరించడమే ఇది! మరి అలాగైనా.. సుపరిపాలన, ప్రజలకు సౌకర్యాలను అందించడంలో ఏపీతో తెలంగాణ ఏ మేరకు పోటీ పడుతోంది? అనే అంశాలపై కేటీఆర్ ఒక శ్వేతపత్రం లాంటిది విడుదల చేస్తే మంచిదే!
ఎవరో తన ఆంధ్రా స్నేహితుల మాటలను పక్కన పెట్టి, ఏపీ, తెలంగాణల్లోని పరిస్థితులను పోల్చి చెబుతూ వివరణ ఇస్తే మంచిదే. ఆ సందర్భంలో హైదరాబాద్ ను దాటి బయటకు వెళితే తెలంగాణలో రోడ్ల పరిస్థితి ఏమిటి? ఆ రోడ్లను రాయలసీమలోని మారుమూల ప్రాంతాలతో పోల్చగలరా? రాయలసీమలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నంత మాత్రం తారు రోడ్డు సౌకర్యాలు తెలంగాణలో ఉన్నాయా? ఇలా మొదలుపెడితే మాట్లాడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ప్రతి నెలా పించన్ కోసం పోస్టాపీసుల ముందు క్యూల్లో నిలబడే తెలంగాణ వృద్ధులను అడిగినా కేటీఆర్ కు చాలానే చెబుతారు!
పెన్షన్ పొందడానికి ప్రతి నెలా తెలంగాణలో ఐదారు తేదీల వరకూ వృద్ధులు కరోనా పరిస్థితుల్లో కూడా క్యూలలో నిలబడి ఆ అంటువ్యాధి బారిన పడ్డారు! అదే ఏపీలో ఒకటో తేదీ తెల్లారుఝామునే ఇంటి వద్దకు పెన్షన్ వస్తోంది! ఇలాంటి విషయాలు కూడా పాలన స్థితిగతుల కిందకే వస్తాయని కేటీఆర్ కు ఆంధ్రా ఫ్రెండ్స్ ఎవ్వరూ చెప్పలేదేమో!