బాలీవుడ్ నటీమణి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరింత ఇరకాటంలో పడింది. రెండు వందల కోట్ల రూపాయల పై మొత్తం చీటింగ్ కేసులకు సంబంధించి ఈడీ కస్టడీలో ఉన్న సుఖేష్ చంద్రశేఖరన్ నుంచి భారీ స్థాయిలో బహమతులను పొందినట్టుగా అభియోగాలను ఎదుర్కొంటున్న జాక్వెలిన్ కు సంబంధించి భారీ స్థాయిలో ఆస్తుల జప్తు జరిగింది. ఆమెకు సంబంధించి ఏడు కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. దీన్నంతా అక్రమ ఆదాయంగానే భావిస్తూ జప్తు చేసినట్టుగా ఈడీ ప్రకటించింది.
అంతే కాదు.. జాక్వెలిన్ ను ఈడీ మరోసారి విచారణకు పిలవనుందనే వార్తలూ వస్తున్నాయి. మరి ఆస్తుల జప్తుతో జాక్వెలిన్ కేవలం ఆ ఆస్తులను కోల్పోతుందా? లేక ఆమెను కూడా మోసంలో భాగస్వామిగా ఈడీ అరెస్టు వరకూ తీసుకెళ్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జాతీయ మీడియాకు ఈడీ ఇచ్చిన లీకులు, లేదా ఉన్న ఊహాగానాల ప్రకారం.. జాక్వెలిన్ కు సుఖేష్ నుంచి భారీగా గిఫ్టులు అందాయి. ఖరీదైన కార్లు, బ్యాగులు, కుటుంబ సభ్యులకు ఇచ్చిన బహుమానాలు.. ఇవన్నీ కలిపి సుఖేష్ నుంచి జాక్వెలిన్ కు అందిన బహుమానాల విలువ మొత్తం ఏడు కోట్ల రూపాయల వరకూ ఉంది!
ఇప్పుడు జాక్వెలిన్ ఫిక్స్ డ్ డిపాజిట్ల మొత్తం కూడా ఏడు కోట్ల రూపాయల పైనే ఉంది. ఆ మొత్తాలను ఈడీ జప్తు చేసింది. స్వాధీనం చేసుకోలేదు కానీ.. ఆ ఖాతాల నుంచి ఆ హీరోయిన్ మరే ట్రాన్సాక్షన్స్ జరపకుండా నిరోధించింది. ఒకవేళ సుఖేష్ నుంచి మొత్తాలను రాబట్టడం మొదలుపెడితే.. జాక్వెలిన్ అకౌంట్ లోని మొత్తాలను ఈడీ రికవరీ కింద స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అవకాశం ఇవ్వాల్సి ఉంది!
సుఖేష్ నుంచి జాక్వెలిన్ బహుమతులు పొందినట్టుగా ఈడీ విచారణలో తేలినట్టుగా ప్రచారం జరుగుతోంది కానీ, అది కోర్టులో నిరూపణ కావాల్సి ఉంది కూడా! ప్రస్తుతానికి అయితే.. జాక్వెలిన్ ఆస్తుల జప్తు జరిగింది. ఈ ఆస్తులు ఆమె అక్రమంగా లేదా, సుఖేష్ నుంచి డైరెక్టుగా పొందినట్టుగా నిరూపణ అవుతుందా? లేక దేని లెక్క దానిదే అని కోర్టు స్పష్టం చేస్తుందా? అనేది ఇప్పుడప్పుడే తేలే అంశం కాకపోవచ్చు!