వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా స్పందించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడం కోసమంటూ వైఎస్ షర్మిల తన తండ్రి పేరుతో అక్కడ ప్రాంతీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్‌పై షర్మిల నిప్పులు చెరుగుతున్నారు.
కానీ టీఆర్ఎస్ నేతలెవరో ఆమె విమర్శలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ మధ్య ఒకసారి మాత్రం షర్మిల నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్షకు దిగడంపై పరోక్షంగా చురకలు అంటించారు. అంతకు మించి షర్మిలపై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇటీవల ఓ సందర్భంలో కేటీఆర్ ఎవరు? అని వ్యంగ్యంగా షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా షర్మిలపై కేటీఆర్ నేరుగా విమర్శలు గుప్పించారు. ఆమెను నిలదీయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి షర్మిల ఎందుకు మాట్లాడ్డం లేదని ఆయన ప్రశ్నించారు.
సీఎంను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనకాడమని కేటీఆర్ హెచ్చరించారు. టీఆర్ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు న్యాయం చేయాలని చూస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీబంధు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.