తమ వారసులకు పట్టాభిషేకం చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుగా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నాన్చివేత ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇందుకు కారణం తనయుడు కేటీఆర్ సమర్థతపై కేసీఆర్‌కు ఎంతో ధీమా ఉంది. కానీ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సమర్థతపై ఆయన తండ్రి చంద్రబాబునాయుడికి నమ్మకం లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా 2014లో విభజనకు గురైంది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్, ఆంధ్రపదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ అధికారంలోకి వచ్చాయి. తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఆంధ్రా సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు కేసీఆర్ వారసుడు కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తండ్రి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
మరోవైపు ఏపీలో బాబు వారసుడు మాత్రం లోకేశ్ మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి బాబు తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో ప్రతి విషయంలోనూ కేటీఆర్, లోకేశ్‌లను పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చ స్టార్ట్ అయింది. మరోవైపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తనయుడు ఐటీ మంత్రిత్వ శాఖలు చేపట్టడం కూడా పోటీకి, పోలికకు కారణమైందని చెప్పొచ్చు. కేటీఆర్ ముందు లోకేశ్ తేలిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తెలంగాణలో ఏడాది ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్లి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ ఏపీ విషయానికి వస్తే ఐదేళ్లు పాలన సాగించిన చంద్రబాబు…ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకుని బొక్క బోర్లా పడ్డారు. అన్నిటికంటే విషాదం ఏంటంటే బాబు తనయుడు, టీడీపీ భవిష్యత్ నాయకుడిగా చెప్పుకుంటున్న లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోవడం.
తెలంగాణలో కేటీఆర్ నాయకత్వం రోజురోజుకూ బలపడుతోంది. కేటీఆర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయడం ద్వారా భావి ముఖ్యమంత్రి అతనే అనే సందేశాన్ని కేసీఆర్ పంపారు. ఇటీవల కేసీఆర్ తరచూ ఫాంహౌస్‌కు వెళుతుండడం, ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షిస్తున్నారు. దీంతో కేటీఆర్‌కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన వారసుడి ఎంపిక విషయంలో మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు వయస్సు 71-72 ఏళ్లు. లోకేశ్ వయస్సు 37 ఏళ్లు. ఇదే కేసీఆర్ వయస్సు 66 ఏళ్లు, కేటీఆర్ వయస్సు 44 ఏళ్లు. చంద్రబాబు కంటే ఐదారేళ్ల చిన్న వాడైన కేసీఆర్ తన వారసుడి విషయంలో చురుగ్గా అడుగులేస్తున్నారు. త్వరలో కేటీఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పినా ఆశ్చర్య పోనవసరం లేదు.
ఇదే చంద్రబాబు విషయానికి వస్తే…రాజకీయంగా 40 ఏళ్ల అనుభవశాలినని పదేపదే చెప్పుకుంటారు. ఇది నిజం కూడా. అలాగే 14 ఏళ్ల పాలనానుభవం, 10 సంవత్సరాల ప్రతిపక్ష అనుభవం, ఇక పార్టీ అధ్యక్షుడిగా 25 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకని లోకేశ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించడంలో తటపటాయిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆరోగ్యం బాగుంటే మరో పదేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పిన చంద్రబాబు…లోకేశ్‌కు పూర్తిస్థాయిలో టీడీపీ బాధ్యతలు అప్పగించడానికి చంద్రబాబు భయపడుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించిన చంద్రబాబుకు తన కడుపున పుట్టిన లోకేశ్‌ను మాత్రం లీడర్‌గా తయారు చేయలేదనే బాధ, ఆవేదన వెంటాడుతోందా? అని ప్రశ్నిస్తే…అవుననే సమాధానమే వస్తుంది. ప్రస్తుత కరోనా సమయంలో ఇంటి నుంచి బయటికి రాలేక, హైదరాబాద్‌కే పరిమితమైన చంద్రబాబు…కనీసం తన కుమారుడినైనా జనంలోకి పంపి ఉండాల్సింది.
తన నాయకత్వాన్ని నిరూపించుకునేందుకు లోకేశ్‌కు ఇదే సరైన సమయం. కానీ ఆయన కూడా తండ్రి కంటే ఎక్కువగా కరోనాకు భయపడి హైదరాబాద్‌లో ఇంటికే పరిమితమయ్యారు. తండ్రీకొడుకులు ఇలా ఉంటే టీడీపీ భవిష్యత్ ఏం కాను? అసలు లోకేశ్‌కు టీడీపీ బాధ్యతలు అప్పగించే ఆలోచన చంద్రబాబుకు ఉందా?
మరోవైపు టీడీపీలో శ్రీకాకుళం ఎంపీ, దివంగత ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ల పేర్లు తరచూ వినిపిస్తున్నాయంటే…లోకేశ్ నాయకత్వంపై అపనమ్మకం ఉన్నట్టే కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. వయస్సు పైబడుతున్న నేపథ్యంలో పార్టీతో పాటు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబునాయుడు తన వారసు డిపై సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలస్యం అమృతం విషం అంటారు.
బహుశా ఇలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకునే పెద్దలు చెప్పినట్టున్నారు. ఇవేవీ చంద్రబాబుకు తెలియదనుకోం. కానీ కొడుకు లోకేశ్ సమర్థతపై నమ్మకం కొరవడడం, మరో వైపు ఇతరులను తెరపైకి తేవడం ఇష్టం లేక…సందిగ్ధంలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.