వైఎస్ రాజారెడ్డి. ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రిగా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టారు. ప్రస్తుత తరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అబ్బ (కడప జిల్లాలో నాయన తండ్రిని అబ్బ అని పిలుస్తారు)గా తెలుసు. అదేంటో గానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖరరెడ్డి పేరుతో కాకుండా రాజారెడ్డి రాజ్యాంగంగా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేశ్ పదేపదే విమర్శిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జగన్ పాలనా విధానాలను విమర్శించాలంటే ఎప్పుడో చనిపోయిన రాజారెడ్డినే గుర్తు చేసుకోవాలా? ఏం రాజారెడ్డి అంతగా భయపెడుతున్నారా? అసలు రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అంతకు మించి ఆయన రాజకీయంగా ఏ పదవుల్లో ఉన్న దాఖలాలు లేవు. కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుడిగా సీపీఐ అభ్యర్థులకు పులివెందుల్లో ఏజెంట్‌గా కూచునేవారు. అంతకు మించి ఆయన రాజకీయ ఉనికి గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు.
రాజారెడ్డి తనయుడు రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, కాంగ్రెస్ అసమ్మతి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఇలా అనేక కోణాలున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని ఏమనలేదంటే…ఆయన్ను గొప్పగా గుర్తిస్తున్నారంటే టీడీపీ నేతలు ఒప్పుకున్నట్టేనా?
కనీసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా లోకేశ్‌లా తన అబ్బ రాజారెడ్డిని స్మరించరేమో. తాజాగా లోకేశ్ ట్వీట్‌లో కూడా రాజారెడ్డి ప్రస్తావన ఉండడం గమనార్హం.
“ఇసుక మాఫియాని అడ్డుకున్నందుకు శిరోముండనం చేశారని, తనకు న్యాయం చేయాలని రాష్ట్రపతికి ఎస్సీ వర్గానికి చెందిన యువకుడు లేఖ రాస్తే, సాటి ఎస్సీకి న్యాయం చేయాల్సిన మంత్రి…నక్సలైట్లలో చేరమనడం రాజారెడ్డి రాజ్యాంగం అమలుకి ప్రత్యక్ష నిదర్శనం” అని లోకేశ్ ట్వీట్ చేశాడు. శిరోముండనం గురించి రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయవచ్చు.
కానీ ఈ కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన పోలీస్ అధికారుల్ని అరెస్ట్ కూడా చేసిందనే విషయాన్ని మరిచి పోవడం టీడీపీ నేతలకే చెల్లింది. మరి విజయవాడ కోవిడ్ సెంటర్‌లో అగ్రి ప్రమాదం సంభవించి పది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ట్వీట్ చేయడానికి ఏమి అడ్డం వచ్చిందో టీడీపీ నేతలు చెప్పాలి.