మొన్న వీరప్పన్ కూతురు, ఇప్పుడు పెరియార్ మనవడట.. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప గొప్ప వాళ్లనే చేర్చుకుంటున్నట్టుగా ఉంది! వాళ్ల మనవడు, వీళ్ల మేనల్లుడు.. అంటూ జనాలు మరిచిపోయిన వారి వారసులకు బీజేపీ పెద్ద పీటలు వేస్తున్నట్టుగా ఉంది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ తరచూ మాట్లాడే బీజేపీ ఇలా ఎవరెరవరి పేర్లో చెబుతూ వాళ్ల మనవళ్లకు, మనవరాళ్లకు పార్టీ పదవులు ఇచ్చేస్తోంది!
అవతల కర్ణాటకలో యడియూరప్ప తనయుడికి పార్టీ ఉపాధ్యక్ష పదవిని కూడా ఇచ్చేశారు! ఇప్పటికే ఆయన ఎమ్మెల్యే! ఇప్పుడు పార్టీ పదవి కూడా ఇచ్చేశారు. ఇలా.. పార్టీపై యడియూరప్ప వారసత్వం పట్టుబిగిస్తోంది. యడియూరప్పను కాదని అక్కడ బీజేపీ మనుగడ సాగించలేదు. అందుకే 75 యేళ్ల వయసు దాటినా, పార్టీ లో కొత్తగా రాసుకున్న రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆయనను సీఎంను చేశారు, ఆయన వారసుడికి పార్టీ పగ్గాలు ఇస్తున్నారు! బీజేపీ దృష్టిలో కేవలం రాహుల్ గాంధీ తప్ప ఎవ్వరిదీ రాజకీయ వారసత్వం కాదేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇక తమిళనాడు వ్యవహారంలో.. పెరియార్ మనవడట! అసలు పెరియార్ సిద్ధాంతాలకూ బీజేపీ సిద్ధాంతాలకూ సంబంధం లేదు. నాస్తికవాదం, విగ్రహారాధనను నిరసించడంతో మొదలుపెడితే.. ద్రవిడదేశం కూడా పెరియార్ సిద్ధాంతం. పెరియార్ సిద్ధాంతాల నుంచినే డీకే, డీఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకే.. వంటిపార్టీలన్నీ వచ్చాయి. అయితే అవే పెరియార్ సిద్ధాంతాలను తుంగలో తొక్కాయి. ఆఖర్లో పెరియార్ కు ఆయన అనుచరులే దూరం అయ్యారు.
ద్రవిడ దేశం సిద్ధాంతంతో విబేధించి డీఎంకే పుట్టింది. పెరియార్ వ్యక్తిగత వ్యవహారాలను ఆయన అనుచరులు ఇష్టపడలేదు. ఆయన పోయాకా పెరియార్ వారసులం, సిద్ధాంతాలు అంటూ రచ్చ చేశారు కానీ.. ఆ తర్వాత కరుణానిధే రూటు మార్చారు. పుట్టపర్తి సత్యసాయిబాబాను చెన్నైకి పిలిచి, ఆయన ఇచ్చిన నిధులతో వాటర్ ప్లాంట్లు పెట్టించుకుని, ఆయనను సత్కరించారు కరుణానిధి. కరుణ భార్య సత్యసాయి ఆశీస్సులు తీసుకుంది. అలా డీఎంకే పేరుకు పెరియార్ భావాలు కానీ, ఓటు బ్యాంకు రాజకీయాలను అలవాటు చేసుకుంది. అన్నాడీఎంకే సంగతి సరేసరి!
ఇక పెరియార్ వారసులనూ తమిళనాడు జనాలు అంత సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. అలా జనాలు మరిచిపోయిన వారిని ఇప్పుడు బీజేపీ తన బలం అన్నట్టుగా ప్రచారం చేసుకుంటోంది. వీరప్పన్ కూతురు, పెరియార్ మనవడు.. ఈ జాబితా ఆశ్చర్యకరంగా ఉంది! వీళ్లా బీజేపీ బలం అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది!