నిన్నమొన్నటి వరకూ సహచర మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్‌కు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్ట్రయిట్ క్వశ్చన్స్ వేశారు. హైదరాబాద్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని నేరుగా ప్రశ్న సంధించారు.
బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది ఆత్మగౌరవం కాదని, ఆత్మ వంచన అని దుయ్యబట్టారు. ఈటల.. తాను మోసపోతూ ప్రజలనూ మోసం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈటలకు టీఆర్ఎస్ ఎంత గౌరవమిచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
మంత్రిగా ఉంటూనే కేబినెట్ నిర్ణయాలను తప్పుబట్టిన నేత ఈటల అని విరుచుకు పడ్డారు. తప్పు చేశానని ఈటల ఒప్పుకున్నారని, అలాంటప్పుడు ఆయనపై ప్రజల్లో సానుభూతి ఎందుకు ఉంటుందో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
ఐదేళ్ల క్రితమే ఆత్మగౌరవం దెబ్బతింటే మంత్రిగా ఎందుకు కొనసాగారో ఈటల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల నుంచి ఈటల అడ్డంగా మాట్లాడినా మంత్రిగా ఉంచారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. తమ పార్టీ ప్రజలకు ఏం అన్యాయం చేసిందని బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని ఆయన ప్రశ్నించారు.