బెదిరింపులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భయపడే మనిషి కాదని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అర్థమైంది. దీంతో జగన్‌ను వదిలిపెట్టి కేసులు, ఇతరత్రా అవరోధాల నుంచి బయటపడేందుకు మరో వైపు నుంచి నరుక్కొచ్చేందుకు బాబు సరికొత్త వ్యూహం రచించారు.
నయాన్నో, భయాన్నో అధికారులను గుప్పిట్లోకి తెచ్చుకోవడమే బాబు తాజా వ్యూహం. మూడేళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామంటూ… సామ దాన భేద దండోపాయాలను అధికారులపై బాబు ప్రయోగిస్తున్నారు.
గత కొంత కాలంగా చంద్రబాబు ఎక్కడ పర్యటించినా, ఏం మాట్లాడినా తన ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్‌పై కంటే అధికారుల మీదే తీవ్రస్థాయిలో మండిపడుతుండడాన్ని గ్రహించొచ్చు. చంద్రబాబే కాదు ఆయన తనయుడు లోకేశ్ కూడా ఇలాగే బెదిరింపులకు పాల్పడుతుండడం విశేషం.
తండ్రి కంటే లోకేశ్ రెండాకులు ఎక్కువే చదివారని నిరూపించుకున్నారు. వడ్డీతో సహా ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. నిన్న తమ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించడానికి పొన్నూరు వెళ్లిన సందర్భంలో చంద్రబాబు తీవ్రస్థాయిలో జగన్‌తో పాటు అధికారులపై కూడా మండిపడ్డారు.
“చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. చట్ట వ్యతిరేకంగా ప్రజల్ని, టీడీపీ నేతల్ని ఎలా హింసిస్తున్నారో వాటన్నింటినీ గుర్తు పెట్టుకుంటాం. భవిష్యత్‌లో అన్నింటిపైనా సమీక్షిస్తాం” అని నిన్న చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించడం వెనుక వ్యూహం లేకపోలేదు. అధికారులను భయపెట్టి, టీడీపీ నేతలపై చర్యలకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని వెనక్కి తగ్గేలా చేయడమే చంద్రబాబు హెచ్చరికలోని ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నేడు కృష్ణా జిల్లా మచిలీపట్నం వెళ్లిన చంద్రబాబు… అక్కడ కూడా ఇదే రీతిలో వ్యవహరించారు. కేసులకు తాము భయపడే పరిస్థితే లేదని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. పోలీసులు కూడా హుందాగా ప్రవర్తిస్తూ పద్ధతి ప్రకారం పని చేయాలని హితవు చెప్పారు. జగన్‌ను నమ్ముకున్నోళ్లంతా జైలుకు పోయారని బాబు పరోక్షంగా అధికారులను హెచ్చరించడం గమనార్హం.
తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుందని అధికారులను హెచ్చరించడం వెనుక బాబు బెదిరింపులు స్పష్టంగా కళ్లకు కట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా పదేపదే అధికారులను హెచ్చరించడం ద్వారా మానసికంగా వారు కూడా ఏదో ఒక దశలో భయాందోళనలకు గురై మనకెందుకులే అని సర్దుకుంటారని బాబు అంచనా. అందుకే ఆయన అధికారులతో మైండ్‌గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి సందర్భంలోనూ అధికారులను హెచ్చరించడం ద్వారా, వారిని మానసికంగా తమ కంట్రోల్‌లోకి తీసుకుని… ప్రభుత్వం చెప్పినట్టు కేసులు, ఇతరత్రా చర్యలు తీసుకునేందుకు వెనుకాడేలా చేయాలనే వ్యూహంతోనే బాబు విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి బాబు వ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో రాబోయే మూడేళ్ల కాలమే జవాబు చెప్పాల్సి వుంది.