టీడీపీ అధినేత చంద్రబాబుకు మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత గుమ్మడి కుతూహలమ్మతో పాటు ఆమె కుమారుడైన టీడీపీ ఇన్‌చార్జ్ హరికృష్ణ షాక్ ఇచ్చినట్టు సమాచారం.
బాబు సొంత ప్రాంతం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గ నాయకురాలైన ఆమె పార్టీ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేసినట్టు తెలిసింది. తమ రాజీనామా లేఖలను అధిష్టానానికి కూడా పంపారని విశ్వసనీయ సమాచారం.
ఎస్సీ నియోజకవర్గమైన గంగాధరనెల్లూరు నుంచి గతంలో గుమ్మడి కుతూహలమ్మ ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు దక్కించుకున్నారు. అనంతరం టీడీపీలో చేరారు. వయసు పైబడడం, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తన కుమారుడు ఆనగంటి హరికృష్ణను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో గుమ్మడి కుతూహలమ్మతో పాటు గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఆనగంటి హరికృష్ణ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు, పదవులకు రాజీనామా చేసినట్టు సమాచారం. పార్టీ వైఖరిపై అసంతృప్తితో గత కొంత కాలంగా వాళ్లిద్దరూ టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నారాయణస్వామిపై టీడీపీ తరపున హరికృష్ణ పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత టీడీపీని వీడుతారని గతంలో పలుమార్లు ప్రచారం జరిగింది. అయితే అవన్నీ వదంతులని ఆయన కొట్టి పారేశారు. చిన్న వయస్సులో చంద్రబాబు తనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. టీడీపీకి ఏనాడు ద్రోహం చెయ్యనని ,అలాంటి ఉద్దేశం కూడా తనకు లేదని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా గంగాధరనెల్లూరులో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలోని ఓ వర్గం అతన్ని పార్టీలోకి తీసుకురానున్నట్టు సమాచారం. మంత్రి నారాయణస్వామిపై ఓ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది. సదరు సామాజిక వర్గాన్ని బహిరంగం గానే నారాయణ స్వామి తిడుతున్న సంగతిని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్‌చార్జ్ రాజీనామాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.