ప్రకాశ్‌రాజ్ విమర్శలకు “మా” ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అసలు తగ్గట్లేదు. తాను ఒకే మాట-ఒకే బాట అన్నట్టు స్పష్టంగా ఉన్నారు. మరోవైపు తనకు ప్రత్యర్థి మంచు విష్ణుతో ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రధాన సమస్య ఎన్నికల అధికారితోనే అని ప్రకాశ్‌రాజ్ ఇవాళ కూడా తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి మరోసారి స్పందించారు. “మా” ఎన్నికల నిర్వహణతో తన బాధ్యత పూర్తయ్యిందని అన్నారు. సీసీటీవీ ఫుటేజీ కావాలని ప్రకాశ్‌రాజ్ డిమాండ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన మరోమారు తేల్చి చెప్పారు.
ఒకవేళ ఎన్నికల నాటి సీసీటీవీ ఫుటేజీ కావాలంటే కోర్టుకెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని పేర్కొన్నారు. ఈ వైఖరే ప్రకాశ్‌రాజ్‌కు కోపం తెప్పిస్తోంది.
తాను అడిగిన వెంటనే నిబంధనలను తెరపైకి తెస్తున్న ఎన్నికల అధికారిపై ప్రకాశ్‌రాజ్ బుస కొడుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఎందుకివ్వరని ఆయన ప్రశ్నిస్తుండడంతో వివాదం పెరిగి పెద్దదవుతోంది.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యుల ప్రవర్తన సరిగా లేదని, కేవలం ప్రచార పిచ్చితో ఎన్నికలను వివాదం చేస్తున్నారని లాయరైన కృష్ణమోహన్ ఆరోపిస్తుండడం గమనార్హం.