మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన పంచాయతీ ఎన్నికల ప్రణాళికలో అతిముఖ్యమైన హామీని మరిచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మరిచారబ్బా? అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ‘పల్లె ప్రగతికి పంచ సూత్రాలు’ పేరుతో చంద్రబాబు నిన్న తన పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
‘పల్లెలు మళ్లీ వెలగాలి’ అన్న నినాదంతో ఈ ప్రణాళికను రూపొందించినట్టు చంద్రబాబు చెప్పారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నా.. తమ పార్టీ మద్దతుతో పోటీచేసే అభ్యర్థులను గెలిపించాలని కోరేందుకు, వారు గెలిస్తే గ్రామాల స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చేందుకు ఈ ప్రణాళిక రూపొందించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ ప్రణాళికలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు, పేదలకు ఉచితంగా నీటి కుళాయిలు, శాంతిభద్రతల పరిరక్షణ, బాలికల విద్యకు ప్రోత్సాహం, భూములు కబ్జా కాకుండా కాపాడ్డం.
టీడీపీ అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ 100 గజాల్లో రూ.3 లక్షలతో ఇళ్ల నిర్మాణం, చిన్నారులకు పోషకాహారం, గ్రామాల్లో ఉచిత వై-పై సౌకర్యం, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, మహిళలకు, వెనుకబడిన కులాలకు వడ్డీ లేని రుణాలు, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడంతోపాటు కొవిడ్ టీకా అందించడం, ఆస్తి పన్ను 50% తగ్గింపు, పన్ను బకాయిలపై రాయితీ తదితర హామీలను పొందుపరిచారు.
అయితే ఏడాదికి పైగా ఏదో రకంగా ఆందోళన చేస్తున్న రాజధాని రైతుల ఊసే ప్రణాళికలో లేకపోవడం గురించి నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇంతకూ తమరి భూదాహం, రియల్ ఎస్టేట్ వ్యాపార కాంక్షతో నిండా మునిగిపోయిన రాజధాని రైతులకు ఏం చేస్తారో ప్రణాళికలో చెప్పలేదేం చంద్రబాబు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
పల్లె ప్రగతికి పంచ సూత్రాల్లో రాజధాని ఎందుకు చోటు చేసుకోలేదో చంద్రబాబు జవాబివ్వాల్సి ఉంది. రాజకీయ స్వార్థానికి ఎవరినైనా బలి ఇస్తారనేందుకు టీడీపీ తాజా ఎన్నికల ప్రణాళికే నిదర్శనమనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.