అతి విశ్వాసమే టీఆర్ఎస్ కి భస్మాసుర హస్తం

వరుసగా రెండు ఎన్నికల్లో పరాభవం ఎదురైనా.. టీఆర్ఎస్ నాయకుల్లో అతి విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. కేసీఆర్ ఈమధ్య కాస్త తగ్గినా కేటీఆర్ మాటల్లో, చేతల్లో ఈ అతి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా 'టి' …

వరుసగా రెండు ఎన్నికల్లో పరాభవం ఎదురైనా.. టీఆర్ఎస్ నాయకుల్లో అతి విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. కేసీఆర్ ఈమధ్య కాస్త తగ్గినా కేటీఆర్ మాటల్లో, చేతల్లో ఈ అతి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా 'టి'  అనే అక్షరం కేసీఆర్ భిక్ష అంటూ చాలా పెద్ద డైలాగే కొట్టారు కేటీఆర్. 

టీపీసీసీ అధ్యక్షుడు, టీబీజేపీ అధ్యక్షుడు.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, అసలు కేసీఆర్ లేకపోతే వారికి పదవులు వచ్చేవా అని ఎద్దేవా చేశారు. వారి పదవులకు ముందున్న 'టి'  అనే అక్షరం కేసీఆర్ పెట్టిన భిక్షేనంటూ మాట్లాడారు.

వాస్తవానికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేయకపోతే తెలంగాణ ఏర్పడేది కాదు. దొడ్డిదారిన బీజేపీ వత్తాసు పలకకపోతే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమయ్యేది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రమేయం కాదనలేనిది. దీనికి పార్లమెంటే సాక్ష్యం.

ఈ వాస్తవాలు తెలియక కాదు కానీ, ఉద్యమం క్రెడిట్ మొత్తం తమదేనంటూ మాట్లాడటం కేటీఆర్ కే కాదు, యావత్ టీఆర్ఎస్ నాయకులకే అలవాటు. తెలంగాణపై సర్వహక్కులు టీఆర్ఎస్ పార్టీవే అన్నట్టు.. మిగతా పార్టీ జనాలంతా ఉద్యమ ద్రోహులనే ముద్ర వేయాలని ఆది నుంచీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

టీడీపీ బాటలో టీఆర్ఎస్..

తెలంగాణ ఏర్పాటుకి ప్రధాన కారణం అస్తిత్వం అయితే, మరో మూల కారణం నిరుద్యోగ సమస్య. కొత్త రాష్ట్రం వస్తే నిరుద్యోగ సమస్య తీరిపోతుందని చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ యువత ఆశపడింది. కానీ కేసీఆర్ మాట మార్చారు. మడమ తిప్పారు. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలేనా అంటూ కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాటకి అందరికీ మైండ్ బ్లాక్ అయింది.

అంతేకాదు.. తాజాగా ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూనే, నిరుద్యోగ భృతిని తెరపైకి తెచ్చింది టీఆర్ఎస్ సర్కారు. ఈ ప్లాన్ పూర్తిగా ప్రభుత్వానికే రివర్స్ లో తగిలేలా ఉంది. నిరుద్యోగ భృతి అంటూ పార్టీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం చేసుకున్న చరిత్ర టీడీపీది. 

అలాంటి తప్పుడు నిర్ణయాలతోనే టీడీపీ చరిత్రలో కలసిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అదే బాటలో నిరుద్యోగ భృతి అంటూ తన తలపై తానే భస్మాసుర హస్తం పెట్టుకునేలా కనిపిస్తోంది. అటు ఫిట్ మెంట్ విషయంలో జరిగిన అన్యాయంతో ఉద్యోగులు కూడా రగిలిపోతున్నారు, ఇటు నిరుద్యోగులు భారీ నోటిఫికేషన్ల కోసం తహతహలాడుతున్నారు. 

లోటు బడ్జెట్ తో కునారిల్లుతున్న ఏపీలోనే జగన్ సర్కారు లక్షల ఉద్యోగాలు సృష్టించి యువత మదిలో చెరగని ముద్రవేసుకుంది. అలాంటిది ధనిక రాష్ట్రంగా (ఒకప్పుడు, ఇప్పుడు కాదు) ఉన్న తెలంగాణలో తమ పరిస్థితి ఎందుకిలా తయారైందని యువత ఆవేదనలో ఉంది.

ఈ ఆవేదన చల్లార్చకపోతే వచ్చే ఎన్నికలనాటికి అదే టీఆర్ఎస్ ని దహించక మానదు. రెండోసారి అధికారం చేపట్టాక వరుస తప్పులు చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు ఇప్పటికే రెండు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంది. నాగార్జున సాగర్ విషయంలో కూడా ఎదురు దెబ్బ తగిలితే.. టీఆర్ఎస్ కి చికిత్స అవసరం. అతి విశ్వాసం తగ్గించుకొని, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన టైమ్ వచ్చింది.

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?

అయ‌న లాంచ్ చేశారు..హిట్టయింది