కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్.. దేశంలో కోవిడ్ 19 వ్యాప్తి గురించి మొదటి నుంచి మీడియా కు వివరాలు అందిస్తున్నది ఈయనే. తెలుగు వారికి సుపరిచయస్తుడు లవ్ అగర్వాల్. గతంలో ఏపీలో పని చేశారు. వివిధ జిల్లాల్లో సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హోదాల్లో పని చేసి, నాటి సీఎం వైఎస్ కార్యాలయంలో కార్యదర్శిగా కూడా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆపరేషన్ కొల్లేరుతో ఈయనకు మంచి పేరొచ్చింది.
అప్పట్లో లవ్ అగర్వాల్ కు పద్మశ్రీ ఇవ్వాలని కూడా కొంతమంది రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అగర్వాల్ పేరు మార్మోగుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రెస్ బ్రీఫింగుల్లో కొన్ని విమర్శలు తప్పడం లేదు. డీడీ వాళ్లు, ఏఎన్ఐ వాళ్లు అడిగే ప్రశ్నలకే ఈయన సమాధానాలు ఇస్తున్నారని, దేశంలో పరిస్థితి గురించి ప్రైవేట్ మీడియా సంస్థలు అడుగుతున్న ప్రశ్నలకు ఈయన సమాధానాలు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఆ సంగతలా ఉంటే.. దేశంలో కరోనా కేసుల సంఖ్య గురించి చెప్పడంతో పాటు మరో విషయాన్ని చెప్పారు లవ్ అగర్వాల్. అదేమిటంటే.. దేశంలో కరోనా పూర్తిగా లేదనే విషయాన్ని ఎలా నిర్ధారించుకోవచ్చు? అంటే.. ఎక్కడా 28 రోజుల పాటు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోతే అప్పుడు కరోనా పూర్తిగా మటుమాయం అయిపోయినట్టు అని లవ్ అగర్వాల్ విశదీకరించారు.
ప్రస్తుతం దేశంలో సగటున రోజుకు వెయ్యి కేసుల చొప్పున నమోదవుతున్నాయి. మరి ఎప్పుడు కరోనా కేసులు జీరోకి వస్తాయి? అలా 28 రోజులు ఎలా గడుస్తాయి? ఎప్పటికి దేశం కరోనా విముక్తం కావాలి? అనేవి శేషప్రశ్నలు. దేశం మొత్తానికీ చూసుకుంటే.. అది విస్తుగొలిపే అంశమే. అయితే ఒక ప్రాంతం వారీగా చూసుకుంటే మాత్రం.. ఇది ఎక్కడిక్కడ అంచనా వేసుకోవడానికి పనికి వచ్చే సమీకరణం.
ఏదైనా జిల్లా వారీగా చూసుకుంటే, అక్కడ గత 28 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే, ఆ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి లేనట్టే. కనీసం ఒక్క కరోనా కేసు రిజిస్టర్ అయినా, ఆ తర్వాత 28 రోజుల పాటు అది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉన్న ప్రాంతమే అనేది లవ్ అగర్వాల్ చెబుతున్న థియరీ.