ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ను బుధవారం ముంబై రాయ్‌గడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో డిజైనర్ ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల కారణంగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా తన భర్తను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ తీసుకెళ్లారని అర్నాబ్ గోస్వామి భార్య సమ్యబ్రాతా రే ఆరోపించారు. తన ఇంటిపై పోలీసులు ఉదయాన్నే దాడి చేసి, కొంత సమయం ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదన్నారు.
లాయర్ వచ్చేంత వరకూ ఎదురు చూడాలని కోరినా పట్టించుకోలేదన్నారు. అంతేకాదు, కనీసం తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని తన భర్త అర్నాబ్ అడిగినా పోలీసులు వినిపించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాన్‌లో తీసుకెళుతుండగా అర్నాబ్ మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు తన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని చెప్పడం గమనార్హం.
అసలు అర్నాబ్ అరెస్ట్‌కు దారి తీసిన ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్య కథేంటో చూద్దాం.
ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్‌తో కలిసి 2018, మే నెలలో అలీబాగ్‌లోని తమ బంగ్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే రిపబ్లిక్ టీవీ స్టూడియోలను డిజైనర్ అన్వే నాయక్ అందంగా తీర్చిదిద్దారని, బిల్లులు చెల్లించకపోవడం వల్లే తమ వాళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది.
అయితే అర్నాబ్‌తో పాటు సూసైడ్ నోట్‌లో పేర్కొన్న నిందితులపై తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో రాయ్‌గడ్ పోలీసులు కేసును క్లోజ్ చేశారు. దీంతో ఆత్మహత్య కథ కంచికి చేరిందని అందరూ భావించారు. అయితే , ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో అర్నాబ్ అరెస్ట్ సంచలనం రేకెత్తిస్తోంది.
కాగా ఉద్దేశ పూర్వకంగా తన చానల్ వేదికగా అర్నాబ్ విషం చిమ్ముతున్నాడని మహారాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇటీవల టీఆర్పీ రేటింగ్స్ విషయమై రిపబ్లిక్ టీవీ అక్రమాలకు పాల్పడుతోందని ముంబయ్ పోలీసులు తేల్చి చెప్పారు.
ఆ సందర్భంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అర్నాబ్ సవాల్ చేయడం … పుండు మీద కారెం చల్లినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఇలా అన్నీ తోడై చివరికి అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌కు దారి తీశాయనే చర్చ నడుస్తోంది.