కాంగ్రెస్ పార్టీని కొత్త రకంగా ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఉభయ సభల్లో కలిసి కాంగ్రెస్ పార్టీకి వంద మంది ఎంపీలు కూడా లేరంటూ ఎద్దేవా చేశారు. నంబర్లను చెబుతూ హేళన చేశారు!
లోక్ సభ, రాజ్యసభల్లో కలిసి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 89 మంది వరకూ ఎంపీలున్నారు. ఆ నంబర్ ను చులకన చేస్తూ మోడీ ఎద్దేవా చేశారు. బహుశా రాజ్యసభలో బీజేపీకి కాస్త బలం పెరిగిన నేపథ్యంలో మోడీ ఉత్సాభరితుడైపోయి కాంగ్రెస్ నంబర్లను కించపరిచారేమో!
మోడీజీ మరిచిపోతున్న అంశం ఏమిటంటే.. ఇది ప్రజాస్వామ్యం. ఈ రోజు రాజుగా ఉన్న వారు రేపు బంటు కావొచ్చు, నేటి బంటు రేపు రాజు కావొచ్చు! అంత వరకూ ఎందుకు.. భారతీయ జనతా పార్టీకి గతంలో ఎన్ని ఎంపీ సీట్లుండేవి? రెండు ఎంపీ సీట్లతో కదా ఆ పార్టీ ప్రస్థానం మొదలైనది?
2009లో బీజేపీ బలమెంత? రాజ్యసభలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? ఇలాంటి వన్నీ చరిత్రలో మిగిలే ఉన్నాయి. రాజకీయ విమర్శలు చేయడానికి అడ్డేమీ లేకపోవచ్చు. కానీ… గొప్ప హోదాలోని వారు హేళన చేయడం బాగుండదేమో! ఏ సాధారణ భక్తులో వాట్సాప్ యూనివర్సిటీలో ఇలాంటి హేళనపూర్వకమైన మాటలతో రెచ్చిపోతే అదో ముచ్చట.
ప్రజాస్వామ్యంలో ఎన్ని సీట్లు ఎవరికి ఉన్నా.. అవి తాత్కాలికం కిందే లెక్క. బీజేపీకి అన్ని సీట్లు వస్తాయనీ ఎవరూ అనుకోలేదు, కాంగ్రెస్ అంత తక్కువ స్థాయికి పోతుందనీ ఎవరూ అనుకోలేదు. అది అలాగే ఉంటుందన్నట్టుగా మాట్లాడటం మాత్రం భ్రమ మాత్రమే!