చుక్క కోసం రిస్క్: క్యూ కట్టిన మందుబాబులు

కరోనా లాక్ డౌన్ కాలంలో కనీసం కూరగాయలు కొనడానికి కూడా బైటకు వచ్చి ఉండరేమో, రేషన్ సరుకులు తీసుకోడానికి కూడా కుటుంబ సభ్యులను పంపించి ఉంటారే కానీ, వీరు మాత్రం బైటకు వచ్చి క్యూలైన్లో…

కరోనా లాక్ డౌన్ కాలంలో కనీసం కూరగాయలు కొనడానికి కూడా బైటకు వచ్చి ఉండరేమో, రేషన్ సరుకులు తీసుకోడానికి కూడా కుటుంబ సభ్యులను పంపించి ఉంటారే కానీ, వీరు మాత్రం బైటకు వచ్చి క్యూలైన్లో నిలబడి ఉండరు. అలాంటి వారంతా ఈరోజు బైటకొచ్చేశారు. దీనికి కారణం వైన్ షాపులు తెరవడమే. లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ టైమ్ తెరుచుకున్న వైన్ షాపులు మందు బాబులతో కళకళలాడాయి.

లాక్ డౌన్ నిబంధనలు సడలించి మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఢిల్లీ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్… ఇలా నిబంధనలు సడలించిన రాష్ట్రాలన్నిట్లో ఉదయాన్నే రోడ్లపైకి వచ్చేశారు మందుబాబులు. వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. కరోనా సోకినా పర్వాలేదు, మందుబాటిల్ చేతిలో పడితే అదే చాలన్నట్టు ప్రవర్తించారు వీరంతా.

కర్నాటకలో ఓ వ్యక్తి వైన్ షాపు ముందు కర్పూరంతో హారతిచ్చి టెంకాయ కొట్టాడంటే.. మద్యంపై వారికున్న భక్తి ప్రపత్తులు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. ఛత్తీస్ గఢ్ లో వైన్ షాపుల ముందు ఏకంగా కిలోమీటరు వరకు లైన్ లు కనిపించాయి. ఒక్కసారిగా వందలమంది వైన్ షాపుల ముందుకు రావడంతో పోలీసులకి కూడా వారిని కట్టడి చేయడం సాధ్యం కాలేదు.

ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీ చార్జి చేశారు, సమూహాలను చెదరగొట్టారు. వీపు విమానం మోతమోగుతున్నా.. చేతిలో బాటిల్ పడితే ఆ నొప్పులన్నీ మటుమాయం అవుతాయని దెబ్బలకోర్చి మరీ క్యూలైన్లో నిలబడ్డారు కొందరు.

అయితే ఈ రద్దీ కేవలం రెండు మూడు రోజులకే పరిమితం అయ్యే అవకాశముంది. దాదాపు 40రోజులకి పైగా మందు అందుబాటులో లేకపోవడంతో మద్యంప్రియులు ఒక్కసారిగా బైటకొచ్చారు. రెండు రోజులకి సరిపడా సరుకు తీసుకెళ్తారు కాబట్టి.. ఇకపై రద్దీ తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

ఇక ఏపీలో మద్యం ధరలు పెరిగినా కూడా ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే బ్లాక్ లో రెట్టింపు ధరలు చెల్లించి కొన్న అలవాటుతో.. షాపులో పెంచిన 25శాతం రేట్లు వారికి లెక్కలోకి రాలేదు. మద్యానికి బానిసైన పేద ప్రజలు, కూలీలు.. ఎక్కువగా తొలిరోజు క్యూలైన్లలో కనపడ్డారు. బార్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉండటంతో.. కాస్త మొహమాటపడే బ్యాచ్ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది.

మరోవైపు ఏపీలో ప్రతి వైన్ షాపు దగ్గరా కస్టమర్లు సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. కానీ కొన్ని మండల కేంద్రాల్లో చాలామంది మందుబాబులు సామాజిక దూరం పాటించలేదు. మందుబాబులపై లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎంతగా ఉందో.. ఈరోజు వెలుగులోకి వచ్చింది. 

జగన్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన నవీన్ పట్నాయక్