ఎయిర్ ఇండియాను అమ్మేస్తున్నారంటే.. ప్రభుత్వం చేయాల్సింది అదే, ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయాలి? ప్రభుత్వం పని అది కాదు కదా.. అని భక్తులు ప్రశ్నిస్తారు. మరి అదే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలతో ఎందుకు వ్యాపారం చేస్తోంది మరి? ఈ ప్రశ్నకూ భక్తులు, బీజేపీ మంత్రుల వద్ద ఒక సమాధానం ఉంది. పెట్రో ధరలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు.
కేవలం చమురు కంపెనీల నిర్ణయానుసారమే పెట్రోధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయంటారు! మరి ఈ మాత్రం దానికి యూపీఏ హయాంలో ఎందుకు కాంగ్రెస్ ను బీజేపీ పదే పదే నిలదీసేది మరి? తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పెట్రోధరల పెంపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగా, కేంద్ర ప్రభుత్వ దోపిడీగా, కేంద్ర ప్రభుత్వ చేతగాని తనంగా అనిపించేవి. తీరా తాము అధికారంలోకి వచ్చాకా.. విచ్చలవిడిగా పెట్రోల్ ధరలను పెంచేశాకా.. మాత్రం పెట్రో ధరలు కేవలం చమురు కంపెనీల ఇష్టం అనిపిస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమీ కనిపించదు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బాధ్యతనూ తీసుకోదు!
ఇటీవలే పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావలనే చర్చ ఒకటి మళ్లీ జరుగుతోంది. మోడీ ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీలోకి పెట్రో ధరలను చేర్చడం లేదు. ఒక దేశం ఒక పన్ను అంటూ నినదించి, జీఎస్టీ రాకతో అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందంటూ మోడీ ప్రభుత్వం అప్పట్లో చాలా హడావుడి చేసింది.
సంచలనం, స్వతంత్రం అంటూ చెప్పి.. ఇప్పటి వరకూ 45 సార్లు జీఎస్టీ రేట్లను సమీక్షించారు! అద్భుతం అంటూ చెప్పిన విధానంలోని లోటుపాట్లను సరి చూడటం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇక మీద కూడా పూర్తి కాదు. ప్రజల వైపు నుంచి జీఎస్టీ విషయంలో కీలకమైన డిమాండ్ పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి చేర్చడం. అయితే ఆ ఒక్కటీ అడక్కు అంటోంది మోడీ ప్రభుత్వం.
ఒకవేళ పెట్రో ధరలను జీఎస్టీలోకి చేరిస్తే 28 శాతం వరకూ పన్ను వసూలు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పెట్రో బేస్ ప్రైస్ 40 రూపాయల వరకూ ఉంది. మరి పెట్రోల్ ధరను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే.. జీఎస్టీ, డీలర్ కమిషన్ ను కలుపుకుంటే.. 53 రూపాయల ధరకు దాన్ని అమ్మొచ్చు. లీటర్ పెట్రోల్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుతో కలుపుకుని కూడా 53 రూపాయలకు అమ్మే అవకాశం ఉంది. అయితే.. మోడీ ప్రభుత్వం దీనికి సమ్మతించడం లేదు. పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదు.
ఇప్పుడు దేశంలోని చాలా చోట్ల లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయల వరకూ ఉంది. అంటే.. రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. ఇందులో మెజారిటీ పన్ను కేంద్ర ప్రభుత్వ వాటానే. లీటర్ పెట్రోల్ కనీస ధర 40 రూపాయలు అనుకుంటే.. దానిపై 67 రూపాయల పన్నును వసూలు చేసుకుంటున్నారు. అసలు ధర కన్నా పన్ను రేటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది. 40 రూపాయలు చేసే దానిపై 67 రూపాయల లాభాన్ని పొందుతున్నాయంటే ప్రభుత్వాల వ్యాపారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నష్టాల్లో ఉన్నాయంటే ప్రభుత్వం చేసేది వ్యాపారం కాదంటారు, ఆ పేరుతో ప్రజల ఆస్తులను ప్రైవేట్ కు టోకున అమ్మేస్తారు. అదే లాభాలంటే మాత్రం.. లేచొస్తారు. ఇదీ మోడీ ప్రభుత్వం తీరు. ఇక బీజేపీ వితాండవాదులు.. పెట్రోల్ పై రాష్ట్రాల పన్నును సవరించాలంటారు.
కేంద్రం రేటు తగ్గించే ప్రసక్తి లేదు, రాష్ట్రాలకు చేతనైతే తగ్గించమనే వాదననూ చేస్తారు. పెట్రోల్ పై సర్ చార్జిల పేరుతో కేంద్రం కొట్టేసే మొత్తమే ఎక్కువ అయినా, నెపాన్ని రాష్ట్రాల మీదకు నెట్టేస్తున్నారు. మోడీ అద్భుత నాయకుడు అంటూ వైఫల్యాల గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ ను, రాష్ట్ర ప్రభుత్వాలను నిందించడం రొటీన్ గా మారింది.
గతంలో రైతుల ఆత్మహత్యలు వంటి వాటి గురించి కూడా బీజేపీ నేతలు ఇలాంటి వాదనలే చేశారు. అధికారం ఎక్కువ కాలం చేతిలో ఉంటే.. నేతలు ఇలానే మాట్లాడుతూ ఉంటారు. తమ వైఫల్యాల గురించి ప్రశ్నలు ఎదురైనప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. బీజేపీ వరస ఇలానే ఉంది!