ఇప్పటికే కర్ణాటకలోని చాలా ప్రాంతంలో సాధారణ షాపులు ఓపెన్ అయ్యాయి. బుధవారం నుంచినే అక్కడ చాలా చోట్ల వివిధ రకాల పరిశ్రమలు పని చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. గ్రీన్ జోన్ లో ఉన్న 22 జిల్లాల్లో ఇలాంటి యాక్టివిటీస్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మాల్స్, థియేటర్స్, సభలూ, సమావేశాలు, మత ప్రార్థనలు వీటన్నింటికీ అవకాశం లేదు.
ఇక అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో విమానయాన సర్వీసులను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు మొదలైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవైపు కరోనా కేసుల విషయంలో అమెరికా ఆందోళన కరమైన పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ..సోషల్ డిస్టన్స్ పాటిస్తూ.. యాక్టివిటీస్ మొదలుపెట్టాలని అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
అలాగే లాక్ డౌన్ తర్వాత విమానాలను నడపడానికి భారత విమానయాన సంస్థలు కూడా ఒక నిర్ణయానికి వచ్చాయట. కనీసం 30 శాతం సీట్లను భర్తీ చేస్తూ విమానాలను కదిలించాలని విమానయాన సంస్థలు రెడీ అవుతున్నాయని సమాచారం. అయితే లాక్ డౌన్ నుంచి విమానయాన సంస్థలను కేంద్ర ప్రభుత్వం మినహాయించాల్సి ఉంది. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే విమానాలు కదిలే అవకాశం ఉంది.
ఇక యూరప్ ఇప్పటికే చాలా వరకూ యాక్టివిటీస్ మొదలుపెట్టింది. అత్యవసర వ్యవహారాలను లాక్ డౌన్ నుంచి మినహాయించారక్కడ. పబ్లిక్ పార్కుల్లో కూడా జనాల మళ్లీ అగుపిస్తున్నారు యూరప్ లో. స్వీడన్ వంటి దేశంలో లాక్ డౌనే విధించలేదు. కరోనాను ధైర్యంగా ఎదుర్కొనడానికే అక్కడ ప్రజలు, ప్రభుత్వాలు మొదటి నుంచి రెడీ అయ్యాయి. అయితే యూరప్ దేశాల్లో జనాభా తక్కువ. వైద్య సదుపాయాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ లు తప్ప.. మిగతా దేశాలు మొదట్లోనే అలర్ట్ అయ్యాయి, ఆ తర్వాత తెగించాయి. అయినా వాటిని కరోనా పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయింది.
ఇలా స్థూలంగా ప్రపంచం కరోనా లాక్ డౌన్ నుంచి కాస్త కదులుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఇక నుంచినే అసలైన సవాల్ అని స్పష్టం అవుతూ ఉంది. నెలన్నర లాక్ డౌన్ లో కూడా కరోనా పూర్తిగా కట్టడి అయితే కాలేదు. ఇక నుంచి దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? అనేదే ప్రపంచం తదుపరి ప్రయాణాన్ని నిర్దేశించనుందని పరిశీలకు అంటున్నారు.