ఏపీలో.. లాక్ డౌన్ స‌డ‌లింపులకు ప్ర‌భుత్వం రెడీ

ఇప్ప‌టికే ఏపీలో లాక్ డౌన్ అమ‌లు మ‌రీ అంత క‌ఠినంగా లేదు. క‌ర్ఫ్యూ అని ప్ర‌భుత్వం చెబుతున్నా, అవ‌స‌రార్థం తిరిగే వాళ్ల‌ను ఆపే వారు కూడా ఎవ‌రూ ఉండ‌రు. ప్ర‌త్యేకించి కుటుంబాల‌తో క‌లిసి ప్ర‌యాణించే…

ఇప్ప‌టికే ఏపీలో లాక్ డౌన్ అమ‌లు మ‌రీ అంత క‌ఠినంగా లేదు. క‌ర్ఫ్యూ అని ప్ర‌భుత్వం చెబుతున్నా, అవ‌స‌రార్థం తిరిగే వాళ్ల‌ను ఆపే వారు కూడా ఎవ‌రూ ఉండ‌రు. ప్ర‌త్యేకించి కుటుంబాల‌తో క‌లిసి ప్ర‌యాణించే వాళ్ల‌ను పోలీసులు కూడా ఆప‌డం లేదు. అన‌వ‌స‌రంగా బైకుల‌పై రోడ్ల మీద‌కు వ‌చ్చార‌నిపించే యువ‌త‌నే పోలీసులు ఆపుతున్నారు. అడుగుతున్నారు. 

ఆసుప‌త్రుల‌కూ, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు తిరిగే వాళ్లు ఎలానూ ఉండ‌నే ఉన్నారు. వీరిని ఎక్క‌డా ఆప‌డం లేదు. అయితే షాపుల మాత్రం 12 త‌ర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచి ఉంచ‌నివ్వ‌లేదు. మ‌రీ వీధుల్లోని అంగ‌ళ్లు మాత్రమే ఓపెన్ లో  క‌నిపిస్తూ వ‌చ్చాయి. ఇక ఇటీవ‌లే ఈ గ‌డువును రెండు గంట‌ల వ‌ర‌కూ పెంచారు. మ‌ధ్యాహ్నం రెండు వ‌ర‌కూ ఇప్పుడు అన్నీ ఓపెన్ లోనే ఉంటున్నాయి. 

ఇక ఇదే స‌మ‌యంలో జ‌న‌జీవ‌నం దాదాపు రొటీన్ స్థితికి వ‌చ్చింది. ఇన్నాళ్లూ రోడ్ల మీద‌కు రావ‌డానికి కూడా భ‌య‌ప‌డిన జ‌నం ఇప్పుడు ఆ భ‌యం నుంచి బ‌య‌ట ప‌డుతున్నారు. ఎంచ‌క్కా త‌మ ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌డ‌మే కాదు, షాపింగులూ గ‌ట్రా కూడా చేసుకుంటున్నారు. ప‌రిమిత స‌మ‌యం మాత్ర‌మే షాపులు తెరిచి ఉండ‌టంతో ఇన్నాళ్లూ ఆడ‌వాళ్లు బ‌య‌ట‌కు రాలేక‌పోయారు. 

అలాగే క‌రోనాకు భ‌య‌ప‌డి కొంద‌రు వ్యాపార‌స్తులు కూడా కొన్ని ర‌కాల షాపుల‌ను తెర‌వ‌డానికి భ‌య‌ప‌డ్డారు. కేసుల సంఖ్య త‌గ్గ‌డంతో.. ఇప్పుడు మ‌ళ్లీ అంతా రొటీన్ స్థితికి వ‌స్తోంది. మాస్కులతో కొంద‌రు క‌నిపిస్తున్నారు, ఇక త‌మ‌కేం భ‌యం లేద‌నే వారు మ‌ళ్లీ మాస్కుల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారు కూడా!

జ‌న‌జీవ‌నం దాదాపు సామాన్య స్థితికి వ‌స్తున్న నేప‌థ్యంలో..లాక్ డౌన్ స‌డ‌లింపులు కూడా ఉంటాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు ఉంటాయ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇక రాత్రి క‌ర్ప్యూలు త‌ప్ప ఇక లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఏమీ పెట్ట‌క‌పోవ‌చ్చ‌ని ఇలా స్ప‌ష్ట‌త వ‌స్తోంది. 

రాష్ట్రంలో యాక్టివ్ క‌రోనా కేసుల లోడు గ‌ణనీయంగా త‌గ్గింది. కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లోనూ, ఆసుప‌త్రుల్లోనూ చికిత్స పొందుతున్న వారి సంఖ్య చాలా వ‌ర‌కూ త‌గ్గిపోయింది. రోజువారీ కేసుల సంఖ్య కూడా త‌గ్గుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో స‌డ‌లింపుల‌కు ప్ర‌భుత్వం కూడా స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్టుగా ఉంది.