చెక్క పెట్టలో చిన్నారి.. గంగలో కొట్టుకొచ్చిన వైనం

ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పుట్టి నెల రోజులు కూడా నిండని ఓ శిశువును, చెక్కపెట్టలో పెట్టి గంగానదిలో పడేశారు. ఎక్కడ్నుంచి, ఎలా కొట్టుకొచ్చిందో తెలీదు కానీ.. చివరికి ఘాజీపూర్ లోని దాద్రి…

ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పుట్టి నెల రోజులు కూడా నిండని ఓ శిశువును, చెక్కపెట్టలో పెట్టి గంగానదిలో పడేశారు. ఎక్కడ్నుంచి, ఎలా కొట్టుకొచ్చిందో తెలీదు కానీ.. చివరికి ఘాజీపూర్ లోని దాద్రి ఘాట్ వద్ద ఆ చెక్కపెట్టెను గుర్తించారు. 

గంగా నదిలో పడవ నడుపుతున్న వ్యక్తికి ఏడుపు వినిపించడంతో అల్లంత దూరంలో ఉన్న చెక్కపెట్టెను ఒడిసిపట్టుకున్నాడు. తెరిచి చూస్తే అందులో 22 రోజుల పసికందు ఉంది. చెక్కపెట్టను అందంగా అలంకరించి, లోపల దేవుడి బొమ్మ కూడా పెట్టి పాపను అందులో ఉంచి నదిలో వదిలేశారు. 

అంతేకాదు, పాపకు గంగ అనే పేరు పెట్టామంటూ, ఆమె జాతకాన్ని కూడా పెట్టలో ఉంచారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, బిడ్డను గంగపాలు చేసిన ఆ తల్లిదండ్రుల్ని సోషల్ మీడియాలో అంతా తిడుతున్నారు.

మరోవైపు బిడ్డను గుర్తించిన వ్యక్తి, పాపను పెంచుకుంటానని ముందుకొచ్చాడు. గంగమ్మ తనకు వరం ప్రసాదించిందని చెప్పుకున్నాడు. అయితే అధికారులు మాత్రం శిశువును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. స్వయంగా యోగి ఆదిత్య నాధ్ ఈ ఘటనపై స్పందించారు. శిశువును ప్రభుత్వమే సంరక్షిస్తుందని ఆయన ప్రకటించారు. బిడ్డ ఆలనపాలన మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. జరిగిన ఘటనపై ఘాజీపూర్ లో పోలీస్ కేసు నమోదైంది. శిశువు తల్లిదండ్రులు ఎవరో కనిబెట్టే పనిలో పోలీసులు పడ్డారు.