చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న నేతల సగటు వయసు, వైఎస్ జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రుల సగటు వయసు లెక్క తీస్తే.. యువతకు ఎవరు ఏ స్థాయిలో ప్రోత్సాహం ఇచ్చారో అర్థమవుతుంది. ఐదేళ్ల పాటు ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా.. ఎన్నికల వేళ నిరుద్యోగ భృతి ప్రకటించిన కక్కుర్తి మనస్తత్వం చంద్రబాబుది.
అధికారంలోకి వచ్చీ రాగానే సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత జగన్ ది. ఇదీ వీరిద్దరి మధ్య ఉన్న తేడా. అయితే ఇప్పుడు చంద్రబాబు-యువత అంటూ పచ్చపాత మీడియా హడావిడి చూస్తుంటే అసలు బాబుకి యువత ఎప్పుడు గుర్తొచ్చిందా అనే అనుమానం రాకమానదు.
టీడీపీ కవరింగ్ ఇలా..
ఏదైనా విషయాన్ని అటు ఇటు తిప్పి తమకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు దిట్ట. దీని కోసం అతడి అను'కుల' మీడియా నిరంతరం పనిచేస్తుంది. బాబును వీరుడు-శూరుడు అని జాకీలేసి లేపేందుకు నిత్యం కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.
ఇప్పుడు మరో కీలకమైన అంశంలో చంద్రబాబును పైకి లేపే కార్యక్రమాన్ని మెల్లమెల్లగా షురూ చేసింది అనుకూల మీడియా. అదే బాబు-యువత. తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తారట.
ఇప్పటికే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా యువకుల్ని నియమించారట. త్వరలోనే స్థాయీ సంఘాల ఎంపికలో కూడా యువతకే పెద్ద పీట వేస్తారట. అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో కూడా యువతకే తొలి ప్రాధాన్యం ఇస్తారట. ఇలా సాగుతోంది బాబు అనుకూల మీడియా ప్రచారం.
అసలు సంగతి ఇదీ..
టీడీపీలో వృద్ధ బ్యాచ్ పని కూడా పూర్తిగా అయిపోయింది కాబట్టి, బాబు యువత ఎత్తుగడ వేశారు. అక్కడ కూడా రాజకీయ వారసత్వమే. అయ్యన్నపాత్రుడు కొడుకు, సోమిరెడ్డి కొడుకు, కేశినేని నాని కూతురు.. ఇలా అటు తిరిగి ఇటు తిరిగి ఇలాంటి వారికే బాబు మళ్లీ పగ్గాలు అప్పజెబుతున్నారు. దీనికి మళ్లీ యువత, ప్రోత్సాహం అంటూ పచ్చ కవరింగ్ లు ఇస్తున్నారు.
వాస్తవానికి చంద్రబాబుకి వచ్చే ఎన్నికలనాటికి అభ్యర్థులు దొరకని పరిస్థితి. స్థానిక ఎన్నికల్లోనే బాబుకి ఈ కరువొచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికలంటే అప్పటికప్పుడు కొత్త మొహాలను తెరపైకి తేవడం కష్టం. పాత బ్యాచ్ తో మరోసారి బరిలో దిగితే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే కొత్తవాళ్లను వెదుక్కుంటున్నారు.
మరీ ముఖ్యంగా డబ్బున్న వాళ్లను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇవేవీ బయటకు రాకుండా ఉండేందుకు 'యువతకు ప్రోత్సాహం', టీడీపీకి కొత్త రక్తం, పార్టీలోకి కొత్త నీరు వంటి స్లోగన్లతో ప్రచారం చేసుకుంటున్నారు.