తనపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తోందని అంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మధ్యనే తెలుగుదేశం కార్యకర్తలంటే.. తనపై ఉన్న కేసుల కన్నా ఎక్కువ కేసులను కలిగి ఉన్న వారేనని లోకేషుడు వాకృచ్ఛారు. మరి ఇప్పుడు మళ్లీ తనపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని, ఇక రౌడీషీటే తరువాయని అంటున్నారు లోకేష్!
ఇంతకీ విషయం ఏమిటంటే.. అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన మంత్రి స్వాగత ఆర్భాటల ఫలితంగా, వైద్యం అందక ఒక చిన్నారి మరణించిందంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అయితే ఆ ప్రచారం అబద్ధమని ప్రభుత్వం తరఫు నుంచి వివరణ వచ్చింది.
ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు లోకేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు అయ్యింది. దీన్నో ఘన విజయంగా చెప్పుకుంటున్నారు లోకేష్. తనపై కేసులు తనకు గర్వకారణం అని, తను ప్రజల వైపు నిలబడుతున్నందుకు తనపై కేసులు పెడుతున్నారంటూ లోకేష్ చెప్పుకుంటున్నారు. తనపై రౌడీ షీట్ తెరవడమే తరువాయి అని లోకేష్ అంటున్నారు కూడా.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. లోకేష్ ఏం చేసినా అది సోషల్ మీడియాకే సరిపోతోంది. ఆయన వాగ్భాణాలు, ఆయన విమర్శలు, ఆయన విశ్లేషణలు, ఆయనపై నమోదైన కేసులు కూడా సోషల్ మీడియా చుట్టూరానే తిరుగుతున్నారు. నాయకత్వం అంటే ఇది కాదేమో లోకేషా!