నటుడు, కథకుడు, నిర్మాత, దర్శకుడు బాలయ్య ఏప్రిల్ 9న పోయారు. మీడియా కవరేజి పెద్దగా లేదు. పేపర్లలో పది లైన్లలో సరిపెట్టారు. టీవీల్లో కూడా అంతంతమాత్రమే. సినీరంగంలో కొందరికే పబ్లిసిటీ బాగా వస్తుంది. తక్కినవాళ్లకి అంతంత మాత్రమే. 92 ఏళ్ల నటుడు అంటే పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో పని చేసే సీనియర్ జర్నలిస్టులకే తెలిసి వుండదు, ఏదో చూచాయగా తెలిసినా సమాచారం అందుబాటులో ఉండదు. తెలిసీ తెలియకుండా రాయడం దేనికిలే అని మొత్తానికి వదిలేస్తారు. భౌతికకాయాన్ని పావుగంట సేపు చూపించి ఊరుకుంటారు. ఇలాటి సందర్భాల్లో వారసులు సినీరంగంలో ఉంటే మంచిది. వేరే రంగంలో ఉన్నా ప్రెస్ మీట్ పెట్టి లేదా హేండ్‌ఔట్స్ యిచ్చి సమాచారం అందిస్తే రాయడానికి జర్నలిస్టులకు మెటీరియల్ లభ్యమౌతుంది. ఇవేమీ కాకపోతే సీనియర్ జర్నలిస్టుల్లో ఎవరికో ఒకరికి అభిమానం ఉండి ఓ వ్యాసం రాస్తే పాఠకప్రేక్షకులకు తెలుస్తుంది.
ఇలాటి ప్రమాదం ఉంటుందని, కొందరు నటీనటులీమధ్య యూట్యూబుల్లో ఇంటర్వ్యూలు యిస్తున్నారు. అది కూడా సాఫ్ట్‌గా యిస్తే ఎవరూ వినరు, గుర్తించుకోరు. అందువలన ఇంటర్వ్యూ చేసేవాళ్లు వాళ్లను రెచ్చగొట్టి, ఏదో మాట్లాడిస్తున్నారు. వాళ్లు ఏదో కాస్త చెపితే చాలు ‘అక్కినేనికి నేనంటే అసూయ’, ‘నందమూరి నన్ను చూసి బెదిరాడు’ అనే కాప్షన్లు పెట్టి ఆ వీడియోలను మార్కెట్ చేస్తున్నారు. అరగంట వీడియో చూస్తే దానిలో ఓ చోట ‘.. మీ వేషానికి యిచ్చిన డ్రస్సు చూసి నాకు అసూయ పుట్టిందండి అని అక్కినేని ఛలోక్తి విసిరారు.’ అనే డైలాగు ఒకటి ఉంటుందంతే! అలాగే ‘..నాకు కత్తి తిప్పడం అస్సలు రాదు. కత్తియుద్ధం షూటింగు చేసేటప్పుడు చేతకాక నేను ఎక్కడ పొడిచేస్తానో అని నందమూరి బెదిరారు..’ అని చెప్తారు.
మరి కొంతమందికి దీర్ఘచరిత్ర ఉన్నా ఇంటర్వ్యూ చేసేవారికి ఏమడగాలో తెలియదు. ఎందుకంటే వాళ్లు హోమ్‌వర్క్ చేసుకుని రారు. అందుకని 70 ఏళ్ల సీనియర్ నటీనటులను ‘విజయ్ దేవరకొండ గురించి మీ అభిప్రాయం ఏమిటి? రాజమౌళి స్థాయి ఎలాటిదని మీ ఉద్దేశం?’ వంటి ప్రశ్నలు వేస్తారు. సరైన ప్రశ్నలు వేసి శ్రోతలు మెచ్చే సమాచారాన్ని రాబట్టడం ఓ కళ. ఎక్కడ పుట్టారు? రంగంలోకి ఎలా వచ్చారు? వంటి రొటీన్ ప్రశ్నలతో పొద్దు పుచ్చితే చెప్పేవాళ్లకు కూడా ఉత్సాహం ఉండదు. పాతకాలం నాటి విషయాలు తెలుసుకోవాలనుకునే శ్రోతలున్నారని గ్రహించిన కొందరు జర్నలిస్టులు ఏవేవో కథలల్లి చెప్పేస్తున్నారు. నిజానికి అప్పట్లో వాళ్లు మద్రాసులో చిన్నాచితకా పనులు చేసుకుంటూ వుండి వుంటారు. పెద్ద నటీనటుల వద్దకు, దర్శకుల వద్దకు వెళ్లే అవకాశమే వుండి వుండదు. సెట్‌లో లైట్‌బాయ్స్, బయటి డ్రైవర్లు మాట్లాడుకునే మాటలు చెవిన పడి వుంటాయి. వాటిని క్రాస్‌చెక్ చేసుకుని నిజాలు తెలుసుకునేటంత అవసరం కానీ, టైము కానీ ఉండదు. అవన్నీ చెత్త అని వదిలేసి ఉంటారు. కానీ ఆ వేస్టు లోంచి వెల్త్ పుట్టించవచ్చని యిప్పుడు తెలిసింది. అందువలన గుర్తున్న కాస్తదానికి, మరి కొంత మసాలా కలిపి, గ్యాప్స్ ఉన్నచోట గంతులు వేసేస్తూ పావుగంట, అరగంట వీడియోలు చేసేస్తున్నారు.
వీటికి ఇంటర్వ్యూ అని పేరే తప్ప, అడిగేవాళ్లు ఏమీ అడగరు. వీళ్లే ఏదో చెప్పుకుపోతారు. రహస్య సమాచారం మాట అలా వుంచండి, అందరికీ తెలిసిన సమాచారంలో కూడా తప్పులు చెప్తున్నారని నా బోటివాడికే తెలిసిపోతోంది. ఏ సినిమా ముందో, ఏ సినిమా తర్వాతో కూడా తెలియకుండా చెప్పేస్తున్న సందర్భాలున్నాయి. బాలయ్య గురించి యూట్యూబ్ వీడియో ఏమైనా ఉందా అని వెతికితే రెండేళ్ల క్రితం చేసిన అరగంట వీడియో కనబడింది. సమాచారం తక్కువ, జనరల్ టాక్ ఎక్కువ. పైగా బాలయ్య నటించిన ‘‘చివరకు మిగిలేది’’ సినిమాకు ఆధారం బుచ్చిబాబు నవల అని చెప్పేశారు. ‘‘దీప్ జ్వలే జాయ్’’ అనే బెంగాలీ సినిమా ఆధారం బాబూ అని కింద కామెంట్స్ రాశారు. నా ఆర్టికల్ లాటిదైతే తప్పు దిద్దుకునే సౌలభ్యం ఉంది. వీడియో మళ్లీ రీషూట్ చేయరనుకుంటాను. వీడియో మాత్రమే చూస్తే తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లిపోతుంది.
వీరు చెప్పే తప్పులను ఖండించే ఓపిక సీనియర్ నటులకుండదు. 60 ఏళ్ల వరకు తాము సాధించిన విజయాలను, ఆ తర్వాత గ్రంథస్తం చేయించే శ్రద్ధ కళాకారులకు ఉండాలి. జ్ఞాపకశక్తి బాగా ఉండగానే ఆత్మకథ రాయడమో, లేదా ఆథరైజ్డ్ బయోగ్రఫీ రాయించడమో చేయాలి. ఆ విధంగా తర్వాతి తరానికి తన గురించి సరైన వివరాలు తెలిసే అవకాశం కల్పించాలి. దానికి గాను తగినంత పారితోషికం యిచ్చి ఒక మంచి రచయితను ఏర్పాటు చేసుకోవాలి. కానీ యీ కళాకారులందరూ తమ కుటుంబసభ్యులకు కోట్లాది రూపాయల ఆస్తులను సమకూరుస్తారు తప్ప యిలాటి రచయితలకు డబ్బివ్వడానికి వెనకాడతారు. ఎందుకంటే తాము లైమ్‌లైట్‌లో ఉన్నంతకాలం ఫిల్మ్ జర్నలిస్టులు తమ వెంట పడి, వద్దన్నా వార్తలు రాసేస్తూంటారు. అందువలన దీనిక్కూడా డబ్బివ్వడమా అనే ఆలోచనాధోరణి అలవాటు పడుతుంది.
వాళ్లు గతించాక, కుటుంబసభ్యులను వివరాలడిగితే ‘ఏమో’ అంటారు. చాలా సందర్భాల్లో కళాకారుల, రచయితల పిల్లలకు తలిదండ్రుల వృత్తివిశేషాలు తెలియవు, తెలుసుకోవాలన్న ఆసక్తీ ఉండదు. అభిమానులో, రిసెర్చి చేద్దామనుకునేవారో వచ్చి అడిగితే సహకరించరు. న్యూసెన్సు అనుకుంటారు. తమ విజయాలను గ్రంథస్తం చేయించని సినీ నటీనటుల, దర్శక, నిర్మాతల లిస్టు తయారు చేయబోతే, చేంతాండంత ఉంటుంది. చేయించినవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. జర్నలిస్టులు వాళ్లంతట వాళ్లే రాసిన సందర్భాలు కూడా కొన్నే. దీంతో సమాచారం దొరక్కపోవడమో, దొరికిన సమాచారం తప్పులు తడకలతో ఉండడమో జరుగుతోంది. అందువలన వాళ్లకు ముదిమి వయసులో ఏ ఎవార్డో వచ్చిందనుకోండి, ఎందుకిచ్చార్రా అని ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకిచ్చారో ఎవార్డు పుచ్చుకున్నవారు కూడా సరిగ్గా చెప్పలేని సందర్భాలున్నాయి. ఎందుకంటే 70-75 ఏళ్ల వయసు వచ్చేసరికి చాలామందికి జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.
మన్నవ బాలయ్య గారి గురించి చెప్పదగిన విశేషాలు చాలానే ఉన్నాయి. ఎవరూ చెప్పలేదనే బాధతోనే పెద్ద వ్యాసం రాస్తున్నాను. మామూలుగా అయితే సమాచారం దొరకడం చాలా కష్టమయ్యేది. కానీ ‘‘కమ్మవైభవం’’ పత్రిక 2009 జనవరి సంచికలో ఆయన మీద వచ్చిన సుదీర్ఘవ్యాసాన్ని ఆయన మీద అభిమానంతో యిన్నాళ్లూ భద్రపరుచుకున్నాను కాబట్టి దాన్ని ఉపయోగించు కుంటున్నాను. ఆయన అరుదుగా యిచ్చిన యింటర్వ్యూలలోని సమాచారాన్ని గుర్తు చేసుకుని దానికి చేరుస్తున్నాను. ముందుగా ఆ పత్రిక యాజమాన్యానికి, సంపాదకవర్గానికి కృతజ్ఞతలు. బాలయ్య అనగానే యీ తరం వాళ్లకు ‘‘మల్లీశ్వరి’’లో కత్రినా తాత, ‘‘అన్నమయ్య’’లో అన్నమయ్య తండ్రి, ‘‘శ్రీరామరాజ్యం’’లో వశిష్టుడు.. ఇలాటివి గుర్తుకు వచ్చి ఏదో కారెక్టరు యాక్టరులే అనుకోవచ్చు. కానీ ఆయన హీరోగా వేసిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటి గురించి చెప్పేముందు ఎమ్జీయార్ ఉదంతం ముందుగా చెప్తాను.
‘‘నేరమూ-శిక్ష’’ (1973) సినిమా బాలయ్య కథ రాసి, విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన రెండో సినిమా. చాలా బాగా హిట్ అయి, తమిళ సినీ పెద్దలను ఆకర్షించింది. అప్పటికే బాలయ్య నిర్మించిన మొదటి సినిమా ‘‘చెల్లెలి కాపురం’’ (1971) హక్కులు కొని ముత్తురామన్, జయలలిత హీరోహీరోయిన్లుగా ‘‘అన్బు తంగై’’ (1974) సినిమాను తీస్తున్నారు. దానిలో హీరోకి గ్లామర్ లేదు. దీనిలో మంచి మాస్ హీరోకి తగ్గ లక్షణాలున్నాయి. ఈ సినిమాకై ఎమ్జీయార్, కరుణానిధి యిద్దరూ పోటీపడ్డారు. ఎందుకలా అంటే దానికి రాజకీయ నేపథ్యం ఉంది. డిఎంకె పార్టీకి ఎమ్జీయార్ వెన్నుదన్నుగా వుండి ఉభయత్రా లాభపడ్డారు. అణ్నాదురై మరణం తర్వాత కరుణానిధి ముఖ్యమంత్రి అయి, ఎమ్జీయార్ ప్రాధాన్యతను తగ్గించేద్దామని చూశాడు. అతనికి పోటీగా తన కొడుకు ము.క. ముత్తును అదే స్టయిల్లో హీరోగా మలిచి, తను స్క్రిప్టులు అందిస్తూ తోడ్పడ్డాడు. ఎమ్జీయార్ యీ కుట్రను గమనించి కరుణానిధిపై అవినీతి ఆరోపణలు చేసి అలజడి సృష్టించాడు.
దాంతో కరుణానిధి అతన్ని పార్టీలోంచి తీసేసి, పార్టీ దన్ను లేకపోతే ఎమ్జీయార్ సినిమాలు ఆడవని నిరూపిద్దామనుకున్నాడు. ఇది జరిగినది 1972లో. 1973లో ఎమ్జీయార్ నిర్మించిన భారీ సినిమా ‘‘ఉలగం సుట్రియ వాలిబన్’’కు అనేక అడ్డంకులు సృష్టించాడు. అయినా సినిమా రిలీజై బ్రహ్మాండంగా ఆడింది. ఎమ్జీయార్‌కు ఆత్మవిశ్వాసం పెరిగి, వరుసగా అనేక సినిమాలు వేశాడు. వాటిలో హిందీ రీమేక్స్ కూడా ఉన్నాయి. సినిమా టైటిళ్లు రాజకీయంగా ఉపయోగపడేట్లు చూసుకున్నాడు. 1974లో వచ్చిన ‘‘నేట్రు, ఇన్ఱు, నాళై’’ (నిన్న, నేడు, రేపు), ‘‘ఉరిమై కురల్’’ (హక్కుల గళం), ‘‘సిరిత్తు వాళ వేండుమ్’’ (చిరునవ్వు జయించాలి, జంజీర్ రీమేక్), 1975లో వచ్చిన ‘‘నినైత్తదై ముడిప్పవన్’’ (అనుకున్నది సాధించేవాడు, సచ్చా ఝూఠా రీమేక్), ‘‘నాళై నమదే’’ (రేపు మనదే, యాదోంకీ బారాత్ రీమేక్), ‘‘ఇదయక్కని’’ (హృదయఖని), ‘‘పళ్లాండు వాళ్గ’’ (చిరకాలం జీవించండి, దో ఆంఖే బారహ్ హాత్ రీమేక్) ఉన్నాయి.
ఈ ‘‘నేరము-శిక్ష’’ గురించి వినగానే తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకునే హీరో పాత్ర తన యిమేజికి ఉపయోగ పడుతుందనుకుని షో వేయండి చూస్తాను అని ఎమ్జీయార్ డిస్ట్రిబ్యూటర్లకు కబురు పంపాడు. ఇదే ఐడియా కరుణానిధికీ వచ్చింది. అతని కొడుకు ముత్తు అప్పటికే లక్ష్మి హీరోయిన్‌గా ‘‘పిళ్లయో పిళ్లయ్’’ (1972), మంజుల హీరోయిన్‌గా ‘‘పూక్కారి’’ (1973), వెన్నిరాడై నిర్మల హీరోయిన్‌గా ‘‘సమయల్‌కారన్’’ (1974) వేసి ఉన్నాడు. అవేమీ ఆడలేదు. (ఆ తర్వాత మరో నాలుగు సినిమాలు వేసి కనుమరుగై పోయాడు). ఈ సినిమా ఐతే తన కొడుక్కి పనికి వస్తుందనుకుని తన కోసం షో వేయమని డిస్ట్రిబ్యూటరుకి చెప్పాడు. ఎమ్జీయార్ చూస్తానన్నారు, మీకు చూపించను అని అందామా అంటే కరుణానిధి ముఖ్యమంత్రి. పోనీ ఎమ్జీయార్‌ను కాదందామా అంటే సినిమారంగంలో అతను రారాజు. ఇద్దరూ ఒకే సమయానికి వస్తాననడంతో బాలయ్యకు టెన్షన్. ఎలాగోలా ఒకరికి తెలియకుండా ఒకర్ని మేనేజ్ చేసి ఒకే థియేటరులో వరుసగా షోలు వేయించారు. ఇదంతా చాలా ఏళ్ల క్రితం ఆయన ఒక యింటర్వ్యూలో చెప్పారు.
షో చూశాక ఎమ్జీయార్ బెటర్ ఆఫర్ యిచ్చారులా వుంది. ఆయన నిర్మాతలకు హక్కులిచ్చారు బాలయ్య. లత హీరోయిన్‌గా వేసిన ఆ తమిళ సినిమా పేరు ‘‘నీతిక్కు తలైవణంగు’’ (నీతికి తల వంచు). జెమినీ స్టూడియోలో పెద్ద సెట్ వేసి షూటింగు ప్రారంభం రోజున కథకుడిగా బాలయ్యను కూడా ఆహ్వానించారు. ఒక ఆర్టిస్టు తీసుకెళ్లి ఎమ్జీయార్‌కు పరిచయం చేశాడు. ఒరిజినల్ సినిమాకు బాలయ్యే రచయిత, నిర్మాత, ముఖ్యపాత్రధారి అని తెలుసుకుని ఎమ్జీయార్ అమాంతం కౌగలించుకుని బాలయ్య మొఖం మీద ముద్దులు పెట్టారు. ‘‘మీరు తెలుగులో వేసిన పాత్రను తమిళంలో కూడా వేయాలి, నా పక్కన నటించాలి.’’ అని కోరాడు. ఆ రోజు సాయంత్రమే తమిళ నిర్మాతలు ఫోన్ చేసి బాలయ్యను బుక్ చేసుకున్నారు. ఆయన వేసిన తమిళ సినిమా అదొక్కటే. సూపర్ హిట్ అయింది.
ఆ సినిమాలో బాలయ్య తనకు తనే డబ్బింగు చెప్పుకున్నారా అనేది నాకు స్పష్టంగా తెలియదు కానీ చెప్పుకునే వుండవచ్చు. ఎందుకంటే ఆయనకు తమిళం బాగా వచ్చు. ఇంటర్ చదివినది మద్రాసు లయోలా కాలేజీలోనే. ఇంజనీరింగు చదివినది మద్రాసు గిండీ కాలేజీలోనే! గుంటూరాయన అక్కడిదాక ఎందుకు వెళ్లాడంటే దానికో కథ ఉంది. వాళ్ల కుటుంబానికి 50 ఎకరాల పొలముంది. మిడిల్ స్కూల్లో థర్డ్ ఫామ్ దాకా చదివాక, వ్యవసాయంలో పెట్టేద్దామని వాళ్ల నాన్నగారి ఉద్దేశం. అయితే పంతులుగారు నచ్చచెప్పారు, హైస్కూల్లో చేర్పించండి, ఎప్పుడు ఫెయిలయితే అప్పుడు చదువు మాన్పించి పొలానికి పంపుదురు గాని అని. సరిగ్గా చదవకపోతే వ్యవసాయమే గతి అనే భయంతో యీయన బాగా చదువుకుని ఎస్సెల్సీ పాసయ్యాడు. మద్రాసులో చదివితే ఇంగ్లీషు బాగా వస్తుందనుకుని ఇంటర్‌కు అక్కడికి వెళ్లారు. ఇంటర్ పూర్తయ్యాక గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్, గిండీలో ఇంజనియరింగు సీటు వచ్చాయి. ఇంజనియరింగు అయితే బెటరు అనుకుని 1948లో ఆ కాలేజీలో చదివారు.
ఆ విధంగా ఆనాటి హీరోల్లో అత్యధిక విద్యావంతుడు బాలయ్యే. తక్కినవాళ్లవి మామూలు డిగ్రీలే. ప్రభాకరరెడ్డి ఎంబిబిఎస్ డాక్టరే కానీ హీరో కాదు. ‘‘చివరకు మిగిలేది’’ (1960) సినిమాలో యీ విద్యాధికులిద్దరూ నటించారు. సావిత్రి పక్కన యిద్దరు హీరోల్లో ఒకరిగా బాలయ్య వేశారు. బెంగాలీ మూలచిత్రాన్ని ‘‘ఖామోషీ’’ (1970)గా హిందీలో రీమేక్ చేసినప్పుడు యీ పాత్రను రాజేశ్ ఖన్నా వేశారు. హిందీలో ధర్మేంద్ర వేసిన అతిథి పాత్రలాటి హీరో వేషాన్ని కాంతారావు వేశారు. ప్రభాకరరెడ్డిది డాక్టరు వేషం. సినిమా ఆడలేదు కానీ, సావిత్రి అభినయానికి మంచి పేరు వచ్చింది. సావిత్రి పక్కన నిలదొక్కుకున్నందుకు బాలయ్యకు పేరు వచ్చింది. ఆవిడనే కాదు, ఎవరి పక్కన వేసినా బాలయ్య ఎప్పుడూ తేలిపోలేదు. ‘‘పాండవ వనవాసం’’ (1965)లో ఎన్టీయార్ భీముడిగా వేసినప్పుడు బాలయ్య అర్జునుడిగా దీటుగా వేశారు. ‘‘శ్రీకృష్ణ పాండవీయం’’(1966)లో ఎన్టీయార్ కృష్ణ, దుర్యోధన పాత్రలు వేస్తే బాలయ్య ధర్మరాజు పాత్రలో రాణించారు.
బాలయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘‘మొనగాళ్లకు మొనగాడు’’ (1966)లో ప్రకాశ్ పాత్ర గురించి చెప్పి తీరాలి. షేక్ ముఖ్తార్ నటించి, నిర్మించిన ‘‘ఉస్తాదోంకా ఉస్తాద్’’ (1963) సినిమా మంచి హిట్. సేలంలోని మోడర్న్ థియేటర్స్ వాళ్లు ఆ సినిమా హక్కులు కొని, తమిళంలో ‘‘వల్లవనుక్కు వల్లవన్’’(1965)గా తీశారు. హిందీ సినిమాలో షేక్ ముఖ్తార్ గూండాగా కనబడే ఇన్‌స్పెక్టర్ వేషం వేస్తే, సౌజన్యమూర్తిగా కనబడే విలన్ వేషం అశోక్ కుమార్ వేశారు. తమిళానికి వచ్చేసరికి గూండా పాత్ర మనోహర్ వేయగా, విలన్ వేషం జెమినీ గణేశన్ వేశారు. రెండిటిలోనూ విలన్ వేషధారులు స్టార్లు. తెలుగుకి వచ్చేసరికి గూండా కత్తుల రత్తయ్య పాత్రను ఎస్వీ రంగారావు వేస్తున్నారు. విలన్ పాత్రకు నిర్మాత బాలయ్యను ఎంపిక చేసుకున్నారు. కానీ డిస్ట్రిబ్యూటరైన నవయుగ ఫిలిమ్స్ వాళ్లు ‘రంగారావు ఎదుట బాలయ్య తేలిపోతాడు, మార్చండి’ అని పట్టుబట్టారు. నిర్మాత వినలేదు. పది రోజులు షూట్ చేసి, నవయుగ వాళ్లకు ప్రింట్ చూపించారు. వాళ్లు ఒప్పుకున్నారు.
సినిమా రిలీజయ్యాక అది ఒక సెన్సేషన్ అయింది. ఎందుకంటే బాలయ్య బయట ఎంత సౌజన్యమూర్తో, తెరపై కూడా అంత సౌజన్యంగా ఉండే పాత్రలు చాలా వేయడం చేత ఆయన విలన్ అని ప్రేక్షకులెవ్వరూ ఊహించలేరు. పైగా స్టయిలిష్ నడక, సిగరెట్టు కాల్చడం, మంద్రస్వరంతో మాట్లాడడం, పాలిష్డ్ విలనీ అంటే యిది కదా అనిపించారు. సినిమా వంద రోజులు ఆడింది. ఎస్వీ రంగారావుతో పోటీ పడగలడా అని నవయుగ వాళ్లు సందేహించారు కానీ ‘‘అల్లూరి సీతారామరాజు’’ (1974) వచ్చేసరికి ఆయన వేయవలసిన అగ్గిరాజు పాత్రను యీయన వేశారు. రౌద్రమూర్తిగా వేసినా, ఎక్కడా హిస్ట్రియానిక్స్ చూపించకుండా, తూకంగా నటించారు. ‘‘నేరము-శిక్ష’’లో కూడా ఈయన కాకుండా మరొకరైతే రెచ్చిపోయేవారు. అతి అనేది ఆయన నుంచి ఊహించలేం. సినిమాకు తగ్గ నటన సహజంగా అమిరింది అనుకుందామనుకుంటే బాలయ్య రంగస్థలం ద్వారానే చిత్రసీమకు వచ్చారు.
గిండీలో చదివే రోజుల్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కాబట్టి వెయ్యిమంది తెలుగు విద్యార్థులుండేవారు. తెలుగు సంఘం, నాటక పోటీలు వగైరాలు వుండేవి. బిఏ సుబ్బారావు అనే డైరక్టరు వద్ద అసిస్టెంటుగా పనిచేస్తున్న తాపీ చాణక్యను పిలిపించి, కొందరు విద్యార్థులు డైరక్టు చేయమని కోరేవారు. అలా వచ్చినపుడు ఆయన బాలయ్యకు నటనలో తర్ఫీదు యిచ్చి నాటకాల్లో వేయించారు. ఇంజనియరింగు పూర్తయ్యాక సెంట్రల్ పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనియరింగు విభాగంలో అసిస్టెంటు లెక్చరర్‌గా కొన్ని నెలలు పని చేశారు. ఆ తర్వాత కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్‌కు బదిలీ చేస్తే అక్కడ మూడేళ్లు పనిచేశారు. అక్కడుండగానే 1955లో పెళ్లయింది. భార్య కమలాదేవి బిఎస్సీ చదివారు. పాఠాలు చెప్పడం కాదు, ప్రాక్టికల్ లైన్‌లో ఉండాలనుకుని, 1956లో యీ ఉద్యోగం మానేసి, మద్రాసు దగ్గర తిరువొత్తియూరులోని కెసిపి కంపెనీలో అసిస్టెంటు ఇంజనియరుగా చేరారు. ఈలోగా తాపీ చాణక్య ‘‘అంతా మనవాళ్లే’’ (1954)తో డైరక్టరై, ‘‘రోజులు మారాయి’’ (1955)తో సూపర్ హిట్ కొట్టి, ‘‘పెద్దరికాలు’’ (1957) తీసి, సారథీ ఫిలిమ్స్ వారి కోసం ‘‘ఎత్తుకు పైయెత్తు’’ (1958) ప్లాన్ చేస్తున్నారు.
హీరోగా కొత్తవాళ్లను పరిచయం చేద్దామనుకున్న ఆయన 1957లో బాలయ్యను వెతుక్కుంటూ వచ్చి ఆఫర్ యిచ్చారు. కంపెనీ పెద్దలూ సరేనన్నారు. సినిమా లైను వద్దని యింట్లో వాళ్లు పోరుతున్నా, యీయన సారథికి మూడు సినిమాల్లో చేయడానికి కాంట్రాక్టుపై సంతకం పెట్టారు. ‘‘ఎత్తుకు పైయెత్తు’’లో షావుకారు జానకి బాలయ్యకు హీరోయిన్. తర్వాతి అనేక సినిమాల్లో బాలయ్య సరసన జానకి సోదరి కృష్ణకుమారి హీరోయిన్‌గా నటించారు. వాటిలో ‘‘పార్వతీ కళ్యాణం’’ (1958), ‘‘మనోరమ’’ (1959) (దీనిలో బాలయ్యకు తలత్ మహమూద్ ప్లేబ్యాక్ పాడారు), ‘‘గుళ్లో పెళ్లి’’ (1961) (కెఎస్ ప్రకాశరావు డైరక్షన్) ‘‘మోహినీ రుక్మాంగద’’ (1962) (దీనిలో జమున మరో హీరోయిన్) ఎన్నదగినవి. ‘‘ఇరుగుపొరుగు’’ (1963)లో కృష్ణకుమారి సోదరుడిగా వేశారు. జమునతో ‘‘కృష్ణప్రేమ’’ (1961) (ఆదుర్తి డైరక్షన్) వేశారు. బాలయ్య తొలి సినిమా సుమారుగా ఆడింది. ఆ తర్వాత అదే కంపెనీకై ‘‘భాగ్యదేవత’’ (1959) , ‘‘కుంకుమరేఖ’’ (1960) (‘‘ఏక్ హీ రస్తా’’ రీమేక్) వేశారు. వాటిలో జగ్గయ్య హీరోగా వేశారు.
బాలయ్య అన్ని రకాల సినిమాల్లోనూ వేషాలు వేశారు. పౌరాణిక సినిమాలైన ‘‘కురుక్షేత్రం’’, ‘‘భక్త కన్నప్ప’’, ‘‘బభ్రువాహన’’, చారిత్రాత్మక చిత్రాలైన ‘‘బొబ్బిలియుద్ధం’’, ‘‘పల్నాటి యుద్ధం’’, ‘‘తాండ్ర పాపారాయుడు’’,‘‘భక్త పోతన’’, ‘‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ’’, జానపద చిత్రాలైన ‘‘లక్ష్మీకటాక్షం’’, ‘‘వీరపూజ’’, ‘‘ప్రచండభైరవి’’, ‘‘సింహాసనం’’.. చెప్పుకోదగ్గవి. సాంఘిక చిత్రాలైతే ‘‘తల్లీబిడ్డలు’’, ‘‘వివాహబంధం’’, ‘‘మంచిమనిషి’’ వగైరా ఉన్నాయి. ఏ పాత్ర వేసినా హుందాగా వేయడంతో, హీరోగా ప్రజలను ఉర్రూతలూగించే శక్తి లేకుండా పోయింది. పైగా ఆయన హీరోగా వేసిన సినిమాలు అంతంతమాత్రంగానే ఆడాయి. హీరోగా ‘..అల్సో ర్యాన్’ అనే పొజిషన్‌లోనే వుండిపోవడం గమనించి ఆయన తన 40వ ఏట చిత్రనిర్మాణం వైపు దృష్టి సారించి నవయుగ ఫిలింస్ అధినేతల్లో ఒకరైన పి. చంద్రశేఖర రావుగార్ని అప్రోచ్ అయ్యారు.
ఆయన నేను దన్నుగా ఉంటానని అభయమిచ్చి, కథ వెతుక్కో అన్నారు. బాలయ్య సినీరంగానికి వచ్చిన కొత్తల్లో ‘తుఫాన్’ అనే పక్ష పత్రిక వచ్చేది. ఒక రోజు దాని ఎడిటరు కలిసి రాబోయే ప్రత్యేక సంచికకు ఏదైనా రాసివ్వమని పట్టుబట్టారు. ‘నాకు అనుభవం లేదు, నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక సంఘటన గురించి విన్నాను. చెప్తాను. విని బాగుందంటే దాన్ని రాసుకోండి.’ అన్నారు బాలయ్య. ఎడిటరుకి కథ నచ్చింది. కాస్త ముందూవెనకా కథ కలిపి సీరియల్‌గా రాయండి అన్నాడు. బాలయ్య భార్యకు సాహిత్యంలో ప్రవేశం ఉంది. ఇద్దరూ కలిసి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ తయారుచేశారు. పేరు ‘తెలుపు-నలుపు’. తీసుకెళ్లి యిస్తే బాలయ్యగారి పేరు మీదే పబ్లిష్ చేశారు, భార్య పేరు వదిలేశారు. కథాంశం ఘోస్ట్‌రైటింగ్! బాలయ్య నివాళి వ్యాసాల్లో కూడా ఆ కథ బాలయ్యగారిదే అని చెప్తున్నారు తప్ప, ఆయన భార్య ప్రస్తావనే లేదు. ‘‘కమ్మవైభవం’’కు యిచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యే చెప్పారు కాబట్టి ఆవిడ భాగస్వామ్యం తెలిసింది. తక్కిన సినిమా కథల్లో ఆవిడ పాత్ర ఉందో లేదో తెలియదు. ఈ సీరియల్ 12 విడతల్లో వచ్చి ప్రశంసలు పొందింది.
సినిమాకు కథ అనగానే బాలయ్యకు యిది గుర్తుకు వచ్చింది. చంద్రశేఖరరావుగారికి కూడా నచ్చి, గొల్లపూడి మారుతీరావు గారి చేత డైలాగులు రాయించారు. కె విశ్వనాథ్ గారికీ కథ నచ్చి డైరక్షన్ చేస్తానన్నారు. అమృతా ఫిలిమ్స్ అనే పేరుతో కంపెనీ ప్రారంభించి, ‘బాహ్యసౌందర్యం కంటె ఆత్మసౌందర్యం గొప్పది’ అనే థీమ్‌తో శోభన్‌బాబు, వాణిశ్రీ, నాగభూషణంలతో ‘‘చెల్లెలి కాపురం’’ (1971) సినిమా తీశారు. నవయుగ మేనేజింగ్ పార్ట్‌నర్ కాట్రగడ్డ శ్రీనివాసరావుగారికి సినిమా నచ్చలేదు. ‘హీరోకి ఆ నల్లరంగేమిటి? చరణకింకిణులు.., కనులముందు నీవుంటే.. వంటి పాటలు జనానికి అర్థమౌతాయా? ఓ డ్రీమ్ సాంగ్ పెట్టి హీరోహీరోయిన్లను అందంగా చూపిస్తూ ఓ ఫోక్‌సాంగ్ పెట్టండి’ అన్నారు. ‘మళ్లీ షూటింగంటే నా వల్ల కాదు. రిస్కు తీసుకుంటాను.’ అంటూ బాలయ్య సినిమా రిలీజు చేశారు. థియేటర్లలో ఆ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సూపర్ హిట్. ఆ ఏడాది ఉత్తమచిత్రంగా బంగారు నంది ఎవార్డు గెలుచుకుంది.
దీని తర్వాతి సినిమా ‘‘నేరము-శిక్ష’’ కథ తయారుచేసుకోవడానికి ఏడాదిన్నర పట్టింది. ‘మనిషికి మనసే సాక్షి. మనిషి విధించే శిక్ష తప్పినా, మనసు వేధించే శిక్ష తప్పదు’ అనేది కథాంశం. డైరక్టరుగా విశ్వనాథ్ గారు కథకు మెరుగులు దిద్దారు. నవయుగ వారు ఓకే చేశారు. మొదటి సినిమాలో వేషం వేయకపోయినా, దీనిలో బాలయ్య ఒక ముఖ్యపాత్ర వేశారు. పది రీళ్ల వరకు తీసిన తర్వాత నవయుగ వాళ్లు తమ నిర్మాణంలో తాతినేని ప్రకాశరావుగారి డైరక్షన్‌లో శోభన్‌బాబు, వాణిశ్రీ హీరోహీరోయిన్లగా ‘మైనరుబాబు’ మొదలుపెట్టారు. చాలాభాగం షూటింగయ్యాక రెండు సినిమాల థీమూ ఒకటేనని ఎవరో కనిపెట్టారు. నవయుగవారు బాలయ్యను పిలిచి ‘మీ సినిమా ప్రకాశరావుగారికి చూపించడానికి అభ్యంతరమా?’ అంటే యీయన లేదన్నారు. చూస్తే సెంట్రల్ థీమ్ ఒకటేనని తేలింది. ‘మీ సినిమాలో కొన్ని సీన్లు మార్చుకోండి’ అన్నారు ప్రకాశరావు. ‘నవయుగవారికి కథ చెప్పే ప్రారంభించాను. ఇప్పుడు మార్చడం కుదరదు.’ అని చెప్పేసి బాలయ్య సినిమా పూర్తి చేసేశారు. ‘మైనరుబాబు’ కూడా పూర్తయింది.
ఇలాటి సందర్భాల్లో ముందు రిలీజు చేసిన సినిమా ఆడుతుందని అందరికీ తెలుసు. సొంత సినిమా ముందు రిలీజు చేస్తే స్వార్థం అనుకుంటారనే జంకుతో నవయుగ వాళ్లు నెల వ్యవధిలో ముందుగా ‘నేరము-శిక్ష’ విడుదల చేశారు. అది సూపర్ హిట్. ఆశ్చర్యకరంగా ‘మైనరుబాబు’ కూడా హిట్టే. క్రైమ్ అండ్ పనిష్మెంటు థీమ్‌లకు ఎప్పుడూ ఢోకా ఉండందంటూంటారు పరుచూరి గోపాలకృష్ణ గారు. ‘‘నేరము-శిక్ష’’ తమిళంలో కూడా హిట్ కావడంతో తారాచంద్ బర్జాత్యా ‘‘శిక్షా’’ (1979) పేరుతో రాజ్ కిరణ్ హీరోగా తీశారు. ‘‘మైనరుబాబు’’కి యీ భోగం పట్టినట్లు లేదు. అమృతా ఫిలింస్ మూడో చిత్రంగా ‘‘అన్నదమ్ముల కథ’’ (1975) బాలయ్య, చంద్రమోహన్, ప్రభలతో తీశారు. నాల్గో సినిమా కృష్ణ, జయప్రదలతో ‘‘ఈనాటి బంధం ఏనాటిదో’’(1977). దీని హిందీ వెర్షన్‌ను దాసరి రజనీకాంత్ హీరోగా ‘‘వఫాదార్’’ పేర తీశారు. ఐదోది బాలయ్య, మురళీమోహన్, లతలతో ‘‘ప్రేమ-పగ’’ (1978).
ఆరోది ఆయన సినిమాలన్నిటిలో పెద్ద హిట్ – కృష్ణ, శ్రీదేవిలతో ‘‘చుట్టాలున్నారు జాగ్రత్త’’ (1980) దీన్ని ఎవిఎం వారు తమిళంలో రజనీకాంత్‌తో ‘‘పోకిరీ రాజా’’ (1982)గా, పద్మాలయ వాళ్లు హిందీలో జితేంద్ర, శ్రీదేవిలతో ‘‘మవాలి’’ (1983)గా తీశారు. కన్నడ వెర్షన్ కూడా వచ్చింది. ఏడోది చిరంజీవి, సుధాకర్, కవితలతో ‘‘ఊరికిచ్చిన మాట’’ (1981). దీనికి మూడో ఉత్తమచిత్రంగా, ద్వితీయ ఉత్తమకథగా నంది అవార్డులు వచ్చాయి. దీని తమిళ వెర్షన్ శివాజీ గణేశన్, కెఆర్ విజయ నటించిన ‘‘ఊరుమ్ ఉరవుమ్’’. ఎనిమిదోది కృష్ణంరాజు, జయప్రదలతో ‘‘నిజం చెప్తే నేరమా?’’ (1983) దీనిలో బాలయ్య వేశారు. తొమ్మిదోది కృష్ణ, జయప్రదలతో ‘‘కిరాయి అల్లుడు’’ (1983), దీని తమిళ వెర్షన్ ఎవిఎం వారి కార్తీక్, రాధలతో ‘‘నల్ల తంబి’’ (1985). పదో సినిమా తన కొడుకు తులసీరామ్, రాధలతో ‘‘పసుపుతాడు’’ (1986). అది ఆడలేదు.
బాలయ్య ‘‘ఊరికిచ్చిన మాట’’ నుంచి తన నాలుగు సినిమాలకు తనే దర్శకత్వం వహించారు. బయటి వాళ్ల సినిమాలకు దర్శకత్వం వహించినవి. కృష్ణ, మాలశ్రీలతో ‘‘పోలీసు అల్లుడు’’ (1994), తులసీరామ్, అశ్వినిలతో ‘‘అల్లరి పాండవులు’’ (1987), కృష్ణ, జయప్రద, రాధలతో ‘‘మహామనిషి’’ (1985). ఆ తర్వాత చిత్రనిర్మాణ రీతులు మారడంతో అడ్జస్ట్ కాలేక బాలయ్య సినిమాలు తీయడం మానుకున్నారు. 1991లో హైదరాబాదుకి మకాం మార్చారు. తర్వాత కొన్ని సినిమాల్లో చిన్నచిన్న వేషాలే వేశారు. మొత్తం మీద 300 సినిమాల దాకా ఉన్నాయి. ఆ తర్వాత టీవీ సీరియల్స్‌పై దృష్టి మరలించి నిర్మాత, దర్శకుడు, నటుడిగా ఉన్నారు. 2010లో రఘుపతి వెంకయ్య ఎవార్డు నందారు. ఈయన చరిత్ర యింత ఉంటే మన తెలుగు మీడియా చాలా తక్కువ రాయడంతో యింత దీర్ఘవ్యాసం రాయవలసి వచ్చింది. హుందాతనానికి మారుపేరైన బహుముఖ ప్రజ్ఞాశాలి బాలయ్యగారి ఆత్మశాంతికై ప్రార్థిస్తున్నాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)