ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఇక తాడోపేడో తేల్చుకునేందుకే అసంతృప్త ఎమ్మెల్యే సిద్ధమయ్యారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. బాబూరావు రోజురోజుకూ సొంత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ అధిష్టానం జాగ్రత్తగా గమనిస్తోంది.
అయితే వైఎస్ జగన్ కోసం రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన తనకు ఆయన అన్యాయం చేశారనే ఆవేదన బలంగా ఉంది. అలాంటప్పుడు ఇక ఈ రాజకీయాలు ఎందుకని తీవ్ర నిరాశనిస్పృహలకు లోననైట్టు ఆయన ఆగ్రహావేశం ప్రతిబింబిస్తోంది.
“ఈ బోడి రాజకీయాలు నాకెందుకు? ఒక మాట కోసం వాళ్లతో వెళ్లాను. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత బలమైన జాతీయ కాంగ్రెస్ పార్టీని వీడి హింసావాదంతో వైసీపీలోకి వెళ్లాను. కానీ నాకు అన్యాయం చేశారు. వాళ్లు అనుకుంటున్నారేమో నేను అమాయకుడినని. నేను హింసావాదిని. నూటికి లక్షశాతం నేను హింసావాదినే. చెప్పమంటే లక్ష మంది పబ్లిక్ మీటింగ్‌లో కూడా చెబుతా. భయమే లేదు. కావాలంటే జైల్లో పెట్టుకోమనండి. ఒకరిని చంపారనుకోండి, తిరిగి ఇంకొకరిని చంపాల్సి వస్తుంది. లేకపోతే ఎక్కడుందా న్యాయం” అని బాబూరావు ఆగ్రహంతో ఊగిపోవడం వైసీపీని ఇరకాటంలో పడేసింది.
వైఎస్సార్ మరణాంతరం జగన్ కోసం నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను విడిచి పెట్టిన ఎమ్మెల్యేల్లో పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు కూడా ఒకరు. అధికారాన్ని, ఎమ్మెల్యే పదవిని కాదనుకుని జగన్ వెంట నడిచిన తనకు మంత్రి పదవి దక్కకపోవడం బాబూరావు జీర్ణించుకోలేక పోతున్నారు. వైసీపీ అధిష్టానం అనుకుంటున్నట్టు తాను అమాయకుడు కాదని హెచ్చరించారు. బోడి రాజకీయాలు ఎందుకని, తనను జైల్లో పెట్టుకోమనండి అని సొంత పార్టీకి, ప్రభుత్వానికి ఆయన పరోక్షంగా సవాల్ విసరడం ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టైంది.
ఇప్పటికే మంత్రి పదవి ఆశించి భంగపడిన కొందరు ఎమ్మెల్యేలు, అలాగే అమాత్య పదవి పోగొట్టుకున్న నేతల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలిపించుకుని సర్ది చెప్పారు. బాబూరావు విషయంలో అది జరగలేదు. బహుశా అది కూడా ఆయన తీవ్ర అసంతృప్తికి కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబూరావును వదిలించుకోవాలనే ఆలోచనతో ఉండడం వల్లే వైసీపీ అధిష్టానం ఆయన మాటల్ని సీరియస్‌గా పట్టించుకోలేదనే వాదన కూడా లేకపోలేదు. ఈ గేమ్‌లో రాజకీయ లబ్ధి ఎవరికి అనేది తేలాల్సి వుంది.