న‌ట‌న‌లో తండ్రికి త‌గ్గ వార‌సుడు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇప్పుడే క‌ళ్లు తెరుచుకున్న ప‌సిబిడ్డ‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌తో త‌మ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌మాణం చేయ‌డానికి ఆయ‌న బుధ‌వారం అలిపిరి…

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇప్పుడే క‌ళ్లు తెరుచుకున్న ప‌సిబిడ్డ‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌తో త‌మ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌మాణం చేయ‌డానికి ఆయ‌న బుధ‌వారం అలిపిరి చేరుకున్నారు. వివేకా హ‌త్య‌తో సంబంధం లేద‌ని, త‌న నిర్దోషిత్వాన్ని నిరూపించుకోడానికి లోకేశ్ ఇదే ప‌ని రెండేళ్ల క్రితం చేసి ఉంటే ప్ర‌శంస‌లు అందేవి. కానీ లోకేశ్ ఏది చేసినా జీవిత కాలం లేటే అన్న వాద‌న‌కు బ‌లం క‌లిగించేలా ప్ర‌స్తుత ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న ఉంది.

2019లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు వివేకా హ‌త్య రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. అప్ప‌ట్లో త‌న చిన్నాన్న హ‌త్య‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ప్ర‌తిప‌క్ష హోదాలో వైఎస్ జ‌గ‌న్ గ‌ట్టిగా డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. నాడు గ‌వ‌ర్న‌ర్‌ను కూడా క‌లిసి న్యాయం చేయాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. అయితే నారా లోకేశ్ ఇప్పుడు స‌రికొత్త ప్ర‌మాణ డ్రామాకు తెర‌లేపారు. 

తిరుప‌తి ఉప ఎన్నిక‌లు వ‌స్తే త‌ప్ప‌, ఆయ‌న‌కు నిర్దోషి త్వాన్ని నిరూపించుకోవాల‌నే ఆలోచ‌న క‌ల‌గ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కాసేప‌టి క్రితం ఆయ‌న అలిపిరిలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు.

నాడు వైసీపీ నేత‌లు మాట్లాడుతూ లోకేశ్‌కు, చంద్రబాబుకు వివేకా హ‌త్య‌లో హస్తం ఉందని ఆరోపించార‌ని గుర్తు చేశారు. తాత (రాజారెడ్డి)ను, వివేకాను చంపింది తామేనని ఆరోపించార‌న్నారు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశార‌న్నారు. గవర్నర్‌ను కలిసి కూడా ఇదే చెప్పార‌న్నారు. సీఎం అయ్యాక సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేద‌ని లోకేశ్ ప్ర‌శ్నించారు. చిత్తశుద్ధి ఉంటే అలిపిరికి రావొచ్చు కదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

ఎందుకు రాలేదు? అని లోకేశ్ నిల‌దీశారు. వెనుక‌టికి ఓ పుంజుకోడి తాను కూత కూస్తే త‌ప్ప తెల్లార‌ద‌ని చెప్పింద‌ట‌. లోకేశ్ స‌వాల్ విస‌ర‌డం కూడా అట్లే ఉంది. త‌న స‌వాల్‌తో వివేకా హ‌త్య‌లో అస‌లు దోషులెవ‌రో తేలుతుంద‌నే విప‌రీత ధోర‌ణి ఆయ‌న మాట‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. రెండేళ్ల క్రితం జ‌రిగిన వివేకా హ‌త్య‌తో లోకేశ్‌, ఆయ‌న తండ్రి చంద్ర‌బాబుకు సంబంధం ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తే… ఇప్పుడు ప్ర‌మాణానికి స‌వాల్ విస‌ర‌డంలో ఔచిత్యం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. 

దొంగ‌లు ప‌డ్డ ఆరు నెల‌ల‌కు కుక్క‌లు మొరిగి న‌ట్ట‌నే సామెత ఉంది. క‌నీసం ఆరు నెల‌లు కాదు క‌దా, రెండేళ్ల‌కు లోకేశ్‌కు జ్ఞానోద‌యం కావ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. లేడికి లేచిందే ప‌రుగు అన్న‌ట్టుగా… లోకేశ్‌కు ఎప్పుడు ఏ ఆలోచ‌న వ‌స్తే, ఆ విధంగా ఇత‌రులు న‌డుచుకోవాల‌నుకోవ‌డం వింత‌గానూ, విడ్డూరంగానూ ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

వివేకా హ‌త్య‌కు సంబంధించి దోషుల‌ను ప‌ట్టుకోవాల‌నేది అందరి డిమాండ్. ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు. కానీ తిరుప‌తి ఉప ఎన్నిక‌లు వ‌స్తే త‌ప్ప‌, ప్ర‌మాణానికి ముందుకు రాక‌పోవ‌డంలోని తిర‌కాసు ఏంటో లోకేశే చెప్పాలి. డ్రామాలాడ‌డంలో తండ్రికి త‌గ్గ వార‌సుడ‌నే కీర్తిని లోకేశ్ ఆర్జించారు. 

ఎటొచ్చి ప్ర‌జాద‌ర‌ణ‌లోనే టీడీపీ యువ‌కిశోరం చ‌తికిల ప‌డుతున్నారు. ప్ర‌మాణాల‌కు ఓట్లు రాల‌వ‌నే స‌త్యాన్ని గ్ర‌హిస్తే లోకేశ్‌కే మంచిది. వివేకా హ‌త్య కేసులో దోషుల‌ను ప‌ట్టుకునేందుకు సీబీఐకి దోహ‌ద ప‌డితే అదే ప‌దివేలు.

-సొదుం ర‌మ‌ణ