తమిళ దర్శకుడు శంకర్ హిందీ సినిమాను రూపొందించబోతున్నట్టుగా ప్రకటించారు. దాదాపు 15 సంవత్సరాల కిందట దక్షిణాదిన సూపర్ హిట్ అయిన అపరిచితుడు సినిమాను శంకర్ ఇప్పుడు హిందీలో రూపొందించబోతున్నాడు.
హిందీ వెర్షన్ లో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని రణ్ వీర్ సింగ్ తన ఇన్ స్టాగ్రమ్ పోస్టు ద్వారా ధ్రువీకరించాడు. శంకర్ వంటి దర్శకుడితో పని చేయబోతూ ఉండటం పట్ల ఎంతో ఆసక్తిని వ్యక్తబరుస్తూ రణ్ వీర్ పోస్టు పెట్టాడు.
సౌత్ లో అపరిచితుడు సినిమా ఎంత సంచలనం సృష్టించిందో వేరే చెప్పనక్కర్లేదు. అయితే అప్పట్లోనే ఆ సినిమాను హిందీ వెర్షన్లో కూడా విడుదల చేసినట్టుగా ఉన్నారు. హిందీ కోసం కొన్ని సీన్లను ప్రత్యేకంగా చిత్రీకరించి, అక్కడ కూడా విడుదల చేసినట్టుగా ఉన్నారు. హిందీ సినిమా చానళ్లలో కూడా బోలెడన్ని సార్లు ఆ సినిమాను ప్రసారం చేశారు. మరి రణ్ వీర్ తో ఆ సినిమాను శంకర్ సరికొత్తగా ఎలా రూపొందిస్తాడో చూడాల్సి ఉంది.
ఇది వరకూ కూడా శంకర్ సినిమాలు హిందీలో భారీ ఎత్తున విడుదల అయ్యాయి. ఒకే ఒక్కడు సినిమా హిందీ వెర్షన్ కు కూడా శంకర్ స్వయంగా దర్శకత్వం వహించాడు. అలాగే రోబో, రోబో-2లను హిందీలో భారీ ఎత్తున విడుదల చేశారు.
మరో విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం శంకర్ చేతిలో భారతీయుడు-2 సినిమా ఉంది. దాని భవితవ్యం ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. అలాగే రామ్ చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమా రూపొంచబోతున్నాడని ప్రచారం జరిగింది. అందులో పవన్ కల్యాణ్ ఒక పాత్రలో అని, కాదు ఆ పాత్రలో యశ్ అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. మరి అపరిచితుడు హిందీ రీమేక్ ప్రకటనతో ఆ సినిమా కు సంబంధించిన ఊహాగానాల పరిస్థితి ఏమిటో!