క‌రోనా నంబ‌ర్లు.. ఎంత వ‌ర‌కూ వెళ్తాయో!

తొలి వేవ్ లో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష‌కు కాస్త అటూ ఇటూ చేరిన‌ప్పుడు వామ్మో అనుకున్నారంతా! ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు.. ఆ నంబ‌ర్ల‌ను చూసి అవాక్క‌య్యారు. క‌రోనా విప‌రీత స్థాయిలో వ్యాపిస్తోంద‌ని, ట్రీట్…

తొలి వేవ్ లో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష‌కు కాస్త అటూ ఇటూ చేరిన‌ప్పుడు వామ్మో అనుకున్నారంతా! ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు.. ఆ నంబ‌ర్ల‌ను చూసి అవాక్క‌య్యారు. క‌రోనా విప‌రీత స్థాయిలో వ్యాపిస్తోంద‌ని, ట్రీట్ మెంట్ అందించ‌డానికి కూడా త‌గిన వ‌న‌రులున్నాయా.. అనేది అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా నిలిచింది. 

ప్ర‌భుత్వాలు భారీ ఎత్తున కోవిడ్-19 కేర్ సెంట‌ర్ల‌ను తెరిచాయి. పెద్ద పెద్ద మైదానాల‌ను, ఎగ్జిబిష‌న్ సెంట‌ర్ల‌ను కోవిడ్ బాధితులకు చికిత్స‌ను అందించేందుకు అనువుగా తీర్చి దిద్దారు. అది దేశంలో రోజువారీ కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేరిన‌ప్ప‌టి ప‌రిస్థితి!

అయితే .. రెండో వేవ్ లో రోజువారీ కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేర‌డ‌మూ జ‌రిగిపోయింది, తాజా నంబ‌ర్ ల‌క్షా ఎన‌భై ఐదు వేల‌కు పైనే! ఈ ధాటిని చూస్తుంటే.. రేపోమాపో రోజువారీ కేసుల సంఖ్య రెండు ల‌క్షల‌కు చేరినా , అంత‌కు మించి నంబ‌ర్లు పెరిగినా పెద్ద ఆశ్చ‌ర్య‌పోయే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు కుంభ‌మేళాన‌ట‌, అక్క‌డ ల‌క్ష‌ల మంది భ‌క్తులు పుణ్య‌స్నానాల‌ట‌. 

ఇంకోవైపు వ‌ల‌స కార్మికులు సొంతూళ్ల బాట ప‌ట్టారు. మ‌హాన‌గరాల్లో ఉద్యోగాలు చేసుకునే వారు కూడా.. మ‌ళ్లీ ముంద‌స్తుగా సొంతూళ్ల‌ను చేరుకుంటున్నారు. ప్ర‌భుత్వాలు ఎప్పుడు లాక్ డౌన్ ను ప్ర‌క‌టిస్తాయో, ఎప్పుడు రాష్ట్రాలను దాట‌డానికి ప‌రిమితుల‌ను పెడ‌తాయో.. అనే అనుమానాలు స‌ర్వ‌త్రా నెల‌కొని ఉన్నాయి!

ఇలాంటి నేప‌థ్యంలో.. కోవిడ్-19 సెకెండ్ వేవ్ త‌దుప‌రి ప‌ర్య‌వ‌స‌నాలు ఎలా ఉంటాయ‌నేది అంతుబ‌ట్ట‌నిదిగా మారింది. కేసుల సంఖ్య పెరిగినా.. మ‌ర‌ణాల సంఖ్య ఏమీ పెర‌గ‌లేదు అనేందుకు ఏమీ లేదు. రోజువారీ కోవిడ్ కార‌ణ మ‌ర‌ణాల సంఖ్య వెయ్యికి చేరింది. ఈ నేప‌థ్యంలో కోవిడ్-19 అంతే ప్ర‌మాద‌కారి అని స్ప‌ష్టం అవుతూ ఉంది. 

గ‌మ‌నించాల్సిన కీల‌క‌మైన అంశం ఏమిటంటే.. తీవ్ర‌త ఎలా ఉన్నా ప్ర‌జ‌లు మాత్రం లెక్క చేసే ప‌రిస్థితి లేదు. మ‌హాన‌గ‌రాల్లో అయినా, చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లో అయినా ఎలాంటి భ‌యం లేకుండానే ప్ర‌జ‌ల సంచారం జ‌రుగుతూ ఉంది. జిల్లా స్థాయి, మండ‌ల స్థాయి ప‌ట్ట‌ణాల్లో అయితే.. నూటికి ప‌ది మంది కూడా స్ట్రిక్ట్ గా మాస్కును వేసుకుని లేరు. 

రెస్టారెంట్లు, ఐస్ క్రీమ్ పార్ల‌ర్ లు కిట‌కిట‌లాడుతూ ఉన్నాయి. థియేట‌ర్ల‌కు కూడా జ‌నాలు ఎగ‌బ‌డుతూ ఉన్నారు. రోజు వారీ కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల‌కు చేరింద‌ని అంటున్నా.. మ‌న‌కు కాదులే, మ‌న‌కు రాదులే అనే త‌త్వ‌మే ప్ర‌జ‌ల్లో గ‌ట్టిగా నెల‌కొని ఉండ‌టం గ‌మ‌నార్హం. జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోండి అనే మాట‌ కేవ‌లం చెవిటోడి వ‌ద్ద‌ శంఖం ఊదిన వైనంలో అగుపిస్తున్నాయి.